Powered By Blogger

Friday, October 22, 2010

నన్నారి షర్బత్

కడప, ఏడురోడ్ల సెంటర్, ఈ పేరు వినగానే, ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలతో పాటు తప్పకుండా గుర్తుకొచ్చే మరో విషయం "బాషా కూల్ డ్రింక్ షాప్". అక్కడ దొరికే "నన్నారి షర్బత్" . ఈ నన్నారి అనే మాట రాయలసీమ వాసులకు సుపరిచితమే అనుకుంటాను. నన్నారి మొక్క వేళ్ళను ఉడికించి తయారు చేస్తారు. ఎండాకాలం లో వేడి తగ్గించే మంచి జ్యూస్. పరీక్షల టైమ్ లో మరీ.


ఏడురోడ్ల సెంటర్ నుంచి కృష్ణ - రమేష్ థియేటర్లకు వెళ్ళే దారిలో ఎడమ వైపు కార్నర్లో ఉండేది బాషా షాపు. మామూలు కూల్ డ్రింక్ షాపే. కానీ, ఎండాకాలం లో దాదాపు ప్రతి రోజు మాకు సేద తీర్చే అడ్డా. 

సంవత్సరం పరీక్షలు  రాసి,  మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేటప్పుడు నలుగురైదుగురం స్నేహితులం షాప్ దగ్గర ఆగేవాళ్ళం. బాషా అసలు పేరు ఏమిటో నాకు తెలీదు. అందరూ బాషా అనే పిలిచేవాళ్ళు. మేము పిల్లలం మాత్రం "అన్నా" అని పిలిచేవాళ్ళం.

సైకిళ్ళు స్టాండ్ వేసి, వెనకాల క్యారియర్ మీద కూర్చుని, "అన్నా, నన్నారి" అని ఆర్డరు చేసేవాళ్ళం. అప్పుడు బాషా "పరీక్షలు బాగా రాసారా?" అని అడుగుతూ  నన్నారి ప్రిపరేషన్ మొదలెట్టే వాడు. 

 నన్నారి ప్రిపరేషన్: 


ముందుగా, ఫ్రీజర్ లోంచి ఐస్ బ్లాక్ తీసి, తన చేతులు మొద్దు బారకుండా , శుభ్రమైన బట్టతో పట్టుకునేవాడు. బాషా ఎదురుగా స్టీల్ బ్లేడు బిగించిన చెక్క ఫ్రేం ఉండేది. ఐస్ బ్లాక్ ను ఆ బ్లేడ్ కు ఎదురుగా చెక్కేవాడు, కొబ్బరి తురుము లా. చెక్క కు ఉన్న కన్నం లోంచి ఐస్, పొడి, పొడి గా కింద ఉంచిన గ్లాసుల్లోకి పడేది.  సగం వరకు ఐస్ పొడి నిండిన ఆ గ్లాసుల్లోకి, డార్క్ చాకలేట్ రంగులోని , నన్నారి మిశ్రమాన్ని కలిపేవాడు. దానికి పంచదార, అరచెక్క నిమ్మ రసం  జత చేరేవి. గ్యాస్ తో నిండిన గోళీ సోడాను కొట్టి , గ్లాసుల్లోకి పోసేవాడు. సోడా తో కలసిన నన్నారి లేత గోధుమ రంగులోకి మారి, బుస, బుస మని పొంగేది. 
అసలే, కడప ఎండలు, పైగా పరీక్షల టెన్షన్. గ్లాసును నోటి దగ్గరకు చేర్చగానే, సోడా గ్యాస్ వల్ల ఎగిరే నీటి తుంపరలు పెదవులకు తగిలి గిలిగింతలు పెట్టేవి. నన్నారి తాగుతూ, రేపటి పరీక్ష కు ఎలా ప్రిపేర్ కావాలో డిస్కస్ చేసుకునే వాళ్ళం. 

నేను కడప వదిలేసి దాదాపు 15 సంవత్సరాలైంది. ఆ నన్నారి రుచి ఇంకా గుర్తుంది. అమెరికాలో దానికి ఒక ప్రత్యామ్నాయం కనిపెట్టాను. ఇక్కడ "రూట్ బీర్" (నా శీలాన్ని శంకించక్కర్లేదు. ఇది సాఫ్ట్ డ్రింక్. )    అనే డ్రింక్ దొరుకుతుంది. నన్నారి బదులు,  ఈ డ్రింక్ కూడా వాడొచ్చు. కానీ, నన్నారి షర్బత్ కు ఏదీ సాటి రాదు. 


6 సంవత్సరాల తర్వాత, జూలై లో కడప కు వెళ్ళాను. ఏడు రోడ్ల సెంటర్ లో బాషా షాప్ కనపడలేదు. మా నాన్న గారిని అడిగాను. రోడ్లు వెడల్పు చేసేటప్పుడు కొన్ని షాపులను తీశేసారని చెప్పారు. బాషా ఏమయ్యాడని ఎవరినీ అడగలేదు. ఏం వినాల్సొస్తుందోనని. 

కడపను సింగపూర్ చెయ్యాలని, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి, ఆయన మేయరు బామ్మర్ది
ప్రయత్నించిన కారణంగా, కాంట్రాక్టర్లు రోడ్లన్నీ తవ్వేసారు. ఇంకా రాళ్ళగుట్టలు అలాగే
ఉన్నాయి.  ఊర్లో కొన్ని చోట్ల మరీ దారుణం.

వీళ్ళు  కడపను సింగపూర్ చేస్తే సంతోషించేవాళ్ళల్లో నేనూ ఒకడిని. కానీ, కాంట్రాక్టర్లు పనిని సగంలో ఒదిలేస్తే మాత్రం, పరిస్థితి అదేదో సామెత లాగా ( "ఉన్నదీ పోయి, ...." ) అవుతుంది. సామెత నేను పూర్తి చేయక్కర్లేదు. మీకు తెలుసు.


నన్నారి షర్బత్ ట్రై చెయ్యడం మర్చిపోకండి.

~ శశిధర్ సంగరాజు.




12 comments:

జర్నో ముచ్చట్లు said...

శశీ,
నన్నారి గుర్తు చేశావ్‌.. అసంకల్పిత ప్రతీకార చర్యలాగా.. నోట్లో లాలాజలం ఊరుతోంది. ఈ భాగ్యనగరంలో అట్లాంటి అద్భుతమైన పానీయం దొరికి చావదు అదేం దౌర్భాగ్యమో. ఈ మధ్యలో ఎప్పుడైనా ఎమ్మిగనూరు (కర్నూలు జిల్లా) వెళ్లి, భేషజాలకు పోకుండా ఒకటికి రెండు గాజు గ్లాసుల నిండా నన్నారి తాగితే గానీ ఈ దాహార్తి తీరదు. అప్పట్లో.. మేము ఇంటర్‌ చదివే రోజుల్లో వచ్చిన బాలకృష్ణ సినిమా నారీ నారీ నడుమ మురారీని ముద్దుగా నన్నారి అని పిలుచుకునేవాళ్లం.. అంటే నన్నారిపై మా ప్రేమ ఎంతటిదో అర్థమవుతుది. మంచి జ్ఞాపకాలను రింగులు రింగులుగా (పాత సినిమాల్లోని ఫ్లాష్‌బ్యాక్‌ ఎఫెక్ట్) తిప్పావ్‌. థ్యాంక్యూ..
విజయ్

Vinay Datta said...

Nannari is available in Chennai right from 'naattu marundu kadai' ( pachaari shop) to super markets. If it's available here in the super markets, it might have got place even in Hyd.

ఇందు said...

Nice post.Nenu kadapa vellanu...kaani ee 'nannari' gurinchi teliyadu. meeru cheppina preparation bagundi :) veelu vunte ee sari try chesta (naa ghajini burra ki gurtu unte) :D

జ్యోతి said...

అబ్బా ఎన్నాళ్ళకు విన్నానండి నన్నారి గురించి. నేను కూడా ఇక్కడ రూట్ బీర్ అందుకే తాగుతాను:)నేను కడపలో ఎప్పుడు తాగలేదు కానీ మాతాత మాకోసం వేంపల్లి నుండి తెప్పించేవాడు.

Anwartheartist said...

నన్నారి అన్న పేరు వినని తెలుగు పేపర్లలొ , మొన్నటి ఎండాకాలం నన్నరి పై ఏకం గా నేనొ కార్టూనే గీశా. కాని నా మట్టుకు మొదతి నిమ్మకాయ సొడానే ఇష్టం,
నన్నారి, నింలెట్, ఉగ్గాని, పొంగనాలు, అత్తరాస, కట్మిర్చి, ముంతకింది బొరుగులు, పుగ్గ్యాల గురించి వినని చెవులేల? తినని బతుకేల??

Anwartheartist said...

నారి నారి నడుమ నన్నారి బావుందే!

Sujatha said...

Hyd lo Nimbu soda tappa inkemee teleeni nalanti vallaki ee post choosi enta dukham vachindo!!!!!

Unknown said...

hi sasidhar

congrates to start a blog of your own. good effort. i wish it will once again be a media mahal of rajnagar, hyd.

-madhupokuri

Sujatha said...

BTW, sasi, you can call fro celebrations !!!..endukante kadapani singapore ga marchadam sagam ayindi. singa okkate aavvali.rendo bhagam ayinatte kada!

Sasidhar said...

నా బ్లాగ్ లో కామెంట్స్ పోస్ట్ చేసిన మీ అందరికీ, నా ధన్యవాదాలు. నా బ్రౌజర్ కుకీస్ సరిగా పనిచేయక పోవడం వల్ల వెంటనే మీకు రిప్లై ఇవ్వలేక పోయాను.
ఇక నుంచి వెంటనే రిప్లై ఇవ్వగలను.

~ శశిధర్

SatyaMurthyABN said...

sasi.....nannari gurinchi baga rasavu. ee madhya kadapa vellinappudu....bhasha shop kanapadakapovadam, road vedalpu lo teesesinatlu nanna cheppadam.... emi vinalsi vastundo ani....bhasa gurinchi adagaka povadam..... kallaku kattinatlu vivarinchavu. khadeer darga mitt kathalu gurtukochchayi. inapadevudi comments kuda chusanu. vadu unnadanna mata...

Sasidhar said...

@మూర్తి,

కామెంట్స్ కి థ్యాంక్స్ . తెలిసో, తెలియకో నా ప్రయత్నంలో, నీకు ఖదీర్ బాబు "దర్గామిట్ట కధలు" గుర్తుకొచ్చాయంటే అది నా అదృష్టమే. ఎంతైనా పక్క రూమ్మేటు కదా, వాసన తగిలిందేమో. But, I will take this as an encouragement for my trials. I am nowhere comparable to Khadeer. Not even close.