Powered By Blogger

Friday, October 15, 2010

అమెరికా లో డాక్టర్ అపాయింట్మెంట్

ఈమధ్యన రెగ్యులర్ చెకప్ కోసం , డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవలసి వచ్చింది. అమెరికా లో డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవడం అనేది ఒక పెద్ద ప్రహసనం.  మీకందరికీ తెలిసే ఉంటుంది, ఇండియా లో చాలా మంది డాక్టర్ లు ఉదయం 8 నుంచి 12 దాకా, మళ్లీ సాయంత్రం 4 నుంచి 8 దాకా పనిచేస్తారు. మనం ఆఫీసు లో పర్మిషన్లు, సెలవులు తీసుకోనక్కరలేదు .అమెరికా లో మాత్రం, డాక్టర్ లు  చాలా మంది 8  నుంచి 4 వరకే పేషంట్లను చూస్తారు. సరే, అవసరం వచ్చినప్పుడు తప్పదు కదా అని , ఆఫీసు లో పర్మిషన్ తీసుకుని వెళ్ళాను. 

డాక్టర్ పిలుపు కోసం ఎదురు చూస్తూ, అక్కడ నేను ఎదుర్కున్న పరిస్తితులను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.  


ఫ్రంట్ డెస్క్ లో ఉన్న నర్స్ "We need latest information , because its been an year since your last visit" అంటూ  పేషంట్ హిస్టరీ ఫోరం ఇచ్చింది. ప్రతి సంవత్సరం ఇది తప్పదురా బాబూ అనుకుంటూ ఫిల్ చెయ్యడం మొదలెట్టాను. ఆ చిత్రగుప్తుడి చిట్టా  పూర్తి చేయడానికి దాదాపు ఇరవై నిమిషాలు పట్టింది. ఇక్కడో ముఖ్యమైన విషయం - అపాయింట్మెంట్ టైం కు పదిహేను నిమిషాలు మీరు లేట్ గా వెళ్ళారా, ఇక అంతే సంగతులు. బిజీ డాక్టర్ అయితే, మీ అపాయింట్మెంట్ కాన్సిల్. కానీ, డాక్టర్ గారు మాత్రం ఆయనకు వీలున్నప్పుడు చూస్తారు. అవును, అవసరం మనది మరీ. 


ఒక విషయం మాత్రం ఒప్పుకుని తీరాలి, డాక్టర్ ఆఫీసు లో వెయిటింగ్ రూం లు మాత్రం శుభ్రంగా ఉంటాయి. 
వెయిటింగ్ టైం లో చదువుకోడానికి కొన్ని మేగజైన్ లు ఉంచారు. అవి కనీసం సంవత్సరం క్రితంవి. అట్టలు చిరిగి, నలిగి పోయి , నా సహనాన్నిపరీక్షించాయి.
 అక్కడ ఒక స్పోర్ట్స్ మేగజైన్ కోసం, నాకు, ఒక చైనీస్ ముసలామెకు జరిగిన పోరాటంలో పరిస్థితుల ప్రభావం వల్ల నేను ఓడి పోవలసి వచ్చింది. పోనీలే సీనియర్ సిటిజన్ కదా అని నన్ను నేను ఓదార్చుకున్నాను. (ఇది జగన్ ఓదార్పు కాదు, నిజమైనదే).

ఇంకో వైపు రక రకాలైన రోగాలు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి , రాకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి, లేదా చెయ్యకూడదు లాంటి వివరాలతో బ్రోషర్స్ పెట్టారు. అవన్నీ చదివారో , అవసరం లేని పరిజ్ఞానం పెరిగి, ఆ రోగాలు అన్నీనిజం గా మనకే ఉన్నాయేమోనన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది.  విషయ పరిజ్ఞానం మంచిదే కానీ, ఈ విషయం లో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. అందుకే వాటి జోలికి మాత్రం వెళ్ళలేదు. 


ఇలా, దాదాపు గంటసేపు తిప్పలు పడ్డాక, కలుగు లోంచి బయటపడ్డ ఎలుక లా,ఎక్కడినుంచో నర్స్ వచ్చిడాక్టర్ పిలుస్తున్నాడని చెప్పింది. Thank GOD  అనుకుంటూ, లోపలికి నడిచాను. 

చెకప్ పూర్తయింది. అంతా శుభం. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకూ ఈ వైపు వచ్చే అవసరం రాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తూ, బయట పడ్డాను. వచ్చే సంవత్సరమైనా కొత్త మేగజైన్స్ ఉంచుతారని ఆశ. 

చూద్దాం.


~ శశిధర్ సంగరాజు.








1 comment:

జర్నో ముచ్చట్లు said...

డియర్‌ శశీ,
మీ పోస్ట్ చదివాక, శుభ్రత విషయం తప్పిస్తే.. అమెరికా వైద్యశాలలకు, భారతీయ వైద్యశాలలకు పెద్దగా తేడా ఉన్నట్లు కనిపించడం లేదు. అయితే.. డాక్టర్ల అపాయింట్‌మెంట్‌ విషయంలో మాత్రం కాస్త కటువుగానే ఉన్నట్లున్నారు. ఇండియాలో అయితే డబ్బు లేదా దర్పం పనిచేస్తాయి కాబట్టి, క్షణాల్లో పరీక్షలు చేయించుకునే వెసులు బాటు ఉంటుంది. ఏది ఏమైనా పాత మ్యాగజైన్లు, నర్సుల అడ్డగింపులు, వైద్యశాల ఎక్కడున్నా అదే తీరులో ఉంటాయన్న విషయం అర్థమైంది. మీరు సతతం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని అభిలషిస్తున్నాను.
విజయ్