Powered By Blogger

Sunday, June 26, 2011

కాలేజి రోజుల్లో నా కపిత్వం

అవును, కపిత్వం - మీరు చదివింది కరక్టే.
"కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ...." అని పెద్దాయన చెప్పినట్లు, పి.జి. చదివే రోజుల్లో నేను రాసిన ఒక కవిత గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. 

మొదటి సారి కవితలు రాసేవారు చాలామంది ప్రాస కోసం ప్రయత్నిస్తుంటారు. 
ఈ బాపతు ప్రయత్నమే ఎవరో చేసారట 

                     అందమైన మేడ
                     మేడ చుట్టూ గోడ
                     గోడ పక్కన దూడ
                     దూడ కింద పేడ   

ఇలాంటి కవితల పై గరికపాటి నరసింహారావు గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ "దూడ కింద పేడ కాకపోతే నువ్వుంటావా?" అని చురకలంటించారు. 

ఇక నా కవిత విషయానికొస్తే...నేను నెల్లూరు జిల్లా కావలి లో మాస్టర్స్ చేసాను. అప్పటివరకు, కడప లో నా చదువు సాగింది.మరీ మిలిటరీ రూల్స్ కాకపోయినా, మా ఇంట్లో కూడా స్ట్రిక్ట్ గానే ఉండేవారు. కావలి లో హాస్టల్ మకాం.పై ఊర్లో ఉండి చదవడం, ఎప్పుడూ ఏమి అవసరం వస్తుందో అని ఇంట్లో వాళ్ళు అవసరానికి మించి పంపే డబ్బులు. ఇంకేముంది, అసలే కోతి, ముల్లు గుచ్చుకుంది, నిప్పు తొక్కింది అన్నట్లుగా ఉండేది వ్యవహారం.
పుస్తకాలు చదవడం, ఊర్లో కొత్త సినిమా రిలీజ్ అవ్వడం ఆలస్యం,వెంటనే చూసేయ్యడం మా దినచర్యగా మారింది. 

1993 ప్రాంతంలో కావలిలో కరవు వచ్చింది. మంచినీళ్ళకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. అంతకమునుపు 30 సంవత్సారాల నుంచి అంత కరవు ఎప్పుడూ రాలేదని స్థానికంగా ఉండేవాళ్ళు చెప్పారు. 
నీటి ఇబ్బంది తో పాటూ, చదువు కూడా సరిగ్గా సాగడం (?) లేదని, మేము నలుగురం స్నేహితులం హాస్టల్ నుంచి జనత పేట కు మకాం మార్చాం. కానీ అక్కడ కూడా నీటి ఎద్దడే. పాపం, మహిళలు బిందెలు తీసుకుని రైల్వే ట్రాక్ దాటి కలుగోల్లమ్మ గుడి దాక మంచి నీళ్ళకోసం వెళ్ళేవారు. మేము అద్దెకు దిగిన ఇంట్లో బావి ఉన్నా, అదికూడా దాదాపుగా ఎండిపోయింది. కాకపోతే, చదువుకునే కుర్రాళ్ళు ప్రతిరోజూ స్నానం చెయ్యాలనే రూలేమీ లేదు కాబట్టి, మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గడిచిపోయింది. మా రూమ్మేటు ఒకతను కంద పద్యాలు రాసేవాడు.వ్యాకరణం పై నాకంత పట్టు లేకపోవడం వల్ల, నేను మామూలు కవితలకు సెటిల్ అయిపోయాను. 
మా బావి లో నీటి ఊట లేకపోయినా, అప్పటికే తెలుగు పుస్తకాలు బాగా చదివే అలవాటు ఉండడం వల్ల,  నాలో కవిత్వం పొంగడం మొదలై...ఇలా తయారైంది.
(మీకు ఓపిక ఉంటె మధ్య మధ్య లో వహ్వా, వహ్వా అనుకోవచ్చు ..నేనేమీ ఫీల్ అవను)

                     ఆకాశం లో నల్లని మబ్బులు
                     పక్కింటి మేడ పై తెల్లని సుబ్బులు
                     మబ్బులు కనిపిస్తే వర్షం
                     సుబ్బులు కనిపిస్తే హర్షం
                     ఎండిన కావలి జనాల్ని మబ్బులు  కరుణించేదేప్పుడో 
                     మండే నా హృదయాన్ని సుబ్బులు కరుణించేదేప్పుడో 
      
ఈ కవిత్వం ఆనోటా, ఈనోటా పడి హాస్టల్ లోని మా మిత్రబృందానికి కూడా చేరిందనీ, దానికి వాళ్ళు యథాశక్తి ప్రాచుర్యం కల్పించారనీ తర్వాత తెలిసింది.


షరా: పై కవితలో సుబ్బులు అనే శాల్తీ ఎవరూ లేరనీ, కేవలం ప్రాస కోసం పడ్డ తాపత్రయం మాత్రమేననీ, మానస ధియేటర్ కాంటీన్ లో దొరికే వేడి, వేడి పులిబొంగారాల మీద ఒట్టు. (ఇక్కడ మాత్రం ముళ్ళపూడి వారిని చదివి వాతలు పెట్టుకుంటున్నా..ఆయన కూడా రాసేవారుగా..."భట్టు గారి అట్టు మీద ఒట్టు" అని...అదన్నమాట.)


మీరు కూడా ఈ మాత్రం కపిత్వం వెలగబెట్టి ఉంటే...నాతో పంచుకోండి.
~శశిధర్ సంగరాజు.