Powered By Blogger

Friday, February 25, 2011

నిష్కల్మష మూర్తి కి అశ్రునివాళి

ఈ మధ్య పనిఒత్తిడితో తరచూ బ్లాగ్ లో రాయడం కుదరలేదు. కానీ ఆంధ్ర రాజకీయాలు మాత్రం కొద్దో గొప్పో ఫాలో అవుతున్నాను. రాజకీయాలు పక్కన పెడితే, నన్ను బాగా కదిలించింది ముళ్ళపూడి గారి మరణం.

ఇండియా ట్రిప్ కు వెళ్ళినప్పుడు తెలుగు పుస్తకాలు కొని తెచ్చుకోవడం మామూలే. ఇటీవల ఇండియాకు వెళ్ళినప్పుడు కూడా కోతికొమ్మచ్చి - 2  కొన్నాను. మొదటి భాగం స్టాక్ లేకపోవడం వల్ల దొరకలేదు. పనిఒత్తిడి ఎక్కువైనా, మనసు బాలేకపోయినా బుడుగు - సీగానపెసూనంబలు, కోతికొమ్మచ్చులు నాలో మళ్లీ ఉత్సాహాన్ని నింపుతుంటాయి. అలాంటి మంచి  మనిషి మన మధ్య లేరనే విషయం నిజం కాకపొతే బాగుండనిపిస్తోంది.

టివి కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించినా, సభల్లో ప్రసంగించినా ఒక్క పొల్లు మాట ఆయన నోటి నుంచి దొర్లిన సందర్భం లేదంటే అతిశయోక్తి కాదు. మాటల విలువ తెలిసిన మహనీయుడు. తమకు అవార్డులు రాకపోతే ఎదుటివాళ్ళ మీద దుమ్మెత్తి పోసే సినీరంగంలో ఉంటూ కూడా, తమకు "పద్మాలు" రాలేదని పన్నెత్తు మాట కూడా అనని సంస్కారి. ప్రాణ మిత్రుడు బాపుగారితో కలసి ఎన్నో సిల్వర్ జూబిలీ హిట్లు ఇచ్చినా, ఏనాడూ, ప్రచార ఆర్భాటానికి వెళ్ళని నిగర్వి.

"జాతస్య మరణం.." నిజమైనప్పటికీ, మరణం ఇలాంటి వారి విషయంలో వీలున్నంత నిదానంగా వస్తే బాగుంటుందేమో.  జీవించినంత కాలం అందరినీ నవ్వించిన పెద్దాయన ఆత్మకు శాంతి కలగాలనీ, ఆయన బహిప్రాణం బాపుగారికి ఈ కష్టకాలంలో  వీలున్నంత త్వరగా స్వాంతన చేకూరాలని ఈ బ్లాగ్ ముఖంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. 

~శశిధర్ సంగరాజు. 

Sunday, February 6, 2011

మనిషివా....చిరంజీవివా?

ఇరానీ హోటల్ లో ఇద్దరి సంభాషణ...

మొదటివాడు: ఏరా...వార్తలు ఫాలో అవుతున్నావా?
రెండోవాడు: అవుతున్నానులే...ఏం?
మొదటివాడు: పీఆర్పీ...కాంగ్రెస్...
రెండోవాడు: ఆ విషయం వదిలైయ్యరా బాబూ..కడుపులో దేవేసినట్లుంది.
మొదటివాడు:అదికాదురా..ఏంటీ దారుణం అని.
రెండోవాడు: అదంతే లేరా...సైడ్ కాల్వలన్నీ వెళ్లి మెయిన్ డ్రైనేజ్ లో కలవాల్సిందే.
మొదటివాడు:జనాలేమనుకుంటారో అని కూడా లేకుండా...
రెండోవాడు: జనాలేమనుకుంటారూ .. " మా చిరు వచ్చేసాడ్రా...అలాంటిలాంటి మార్పు కాదు....అవినీతిని  కడిగేస్తాడు...సామాజిక న్యాయం తెస్తాడు...చూస్తుండు" అని నిన్న మొన్నటి దాకా ఊగిపోయిన మా ఎదురింటి బాబాయి ...ఉదయాన్నే ఎవరినో తిడుతున్నాడు..."నువ్వు మనిషివా...చిరంజీవివా?" అని.
మొదటివాడు: ఖర్మ గాకపోతే...ఎందుకొచ్చిన దూల.కొన్ని రోజులు పోతే మెగాస్టార్ ను దగాస్టార్ అని కూడా అంటారేమో...


~శశిధర్ సంగరాజు.

Saturday, February 5, 2011

పీఆర్పీ + కాంగ్రెస్ = ఇంకో చారిత్రక తప్పిదం (?)

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపెయ్యడం దాదాపుగా ఖరారైంది (మీడియా వార్తల ప్రకారం)..
విలీనం మరో  చారిత్రక తప్పిదం అవుతుందని నా నమ్మకం. ఈ నేపధ్యం లో నా అభిప్రాయాలు :


ఆగుష్టు 26 , 2008 తిరుపతి లో మెగా స్టార్ చిరంజీవి "ప్రజారాజ్యం" పార్టీని అధికారికంగా ప్రకటించబోతున్నాడు. దాదాపు అంతకు నెల రోజుల ముందరనుంచే మీడియా లో పార్టీ జెండా, అజెండాల గురించి చర్చలు ఊపందుకున్నాయి. ఆంధ్ర రాజకీయాల మీద ఆశక్తి తో నేను కూడా అమెరికా నుంచి ఈ డెవలప్మెంట్ల ను గమనిస్తూ వచ్చాను. ఒక విధంగా సంతోషపడ్డాను కూడా. ఎందుకంటే, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రత్యామ్న్యాయంగా ఇంకో రాజకీయ పార్టీ రాబోతోందని. అదీ, అత్యధిక ప్రజాదరణ ఉన్న చిరంజీవి పెట్టబోయే పార్టీ. ఇక ఆంధ్ర ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని మురిసి ముక్కలైపోయాను.అమెరికా నుంచి కొందరు ఉత్సాహవంతులు పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి తరలి వెళ్ళారు.  అంతటి అద్రుష్టం, అవకాశం నాకు లేకపోయిందే అని కొంత బాధపడ్డ మాట కూడా నిజం. స్వర్గీయ ఎన్టీయార్  1983 లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు నేను బాగా చిన్నవాణ్ణి. అందరూ అనుకుంటుంటే వినడమేకానీ, ఈ రాజకీయ పార్టీలు, ఎలెక్షన్ లు ఆంటే ఏమిటో అర్థం అయ్యేది కాదు. సరే, అప్పుడెలాగు త్రిల్ మిస్ అయ్యాము ,  ఈయనేదో పొడిచేస్తాడు కదా అని ఎదురుచూడడం మొదలెట్టాను. 


పార్టీ పెట్టిందగ్గర నుంచి, " నానాటికి తీసికట్టు నాగం భొట్లు" అన్నట్లు తయారైయాడు అన్నయ్య. ఏ విషయంలో క్లారిటీ లేదు (ఇప్పుడు పీఆర్పీని, కాంగ్రెస్ లో  విలీనం చెయ్యడం మినహా). తనను చూడడానికోచ్చే  జనాన్ని చూసి మురిసి పోవడం తప్ప.ఇక పవన్ కళ్యాణ్ అయితే కాంగ్రెస్ పార్టీని, నాయకులను అమ్మనాబూతులు తిట్టేసాడు. పార్టీ పెట్టింతర్వాత గట్టిగా రెండు,మూడు సంవత్సరాలైనా నడపడం చేతకాలేదు. తమిళనాడు లో విజయకాంత్ ను చూడండి ఎలా రాజకీయాలకు ఎదురీదుతున్నాడో. సాటి నటుడ్ని చూసినా చిరుకు జ్జ్ఞానోదయం కలగాలి.


కేవలం జగన్ తాకిడిని తట్టుకోవడానికి తప్ప, కాంగ్రెస్ కు చిరంజీవి వల్ల ఒనగూడే లాభం ఏమాత్రం లేదు. ఒకవిధంగా నష్టమే. అదెలాగంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చిరంజీవికి కొత్త అల్లుడి మర్యాదలు చేస్తే, ఇంతవరకూ పార్టీని పట్టుకు వేలాడుతున్న సీనియర్లు అలగడం ఖాయం.  వాళ్ళను మచ్చిక చేసుకోవడానికి చిరంజీవి ని పక్కన పెట్టడమో, ప్రాధాన్యత తగ్గించడమో చేస్తే,ఇక పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసి ప్రయోజనం ఏముంది. మీడియా లో ఇంకో రకం పుకార్లు వినిపిస్తున్నాయి. విలీనం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టి చిరంజీవిని సీయమ్ చేస్తారని. ఎందుకయ్యా ఆంటే , జగన్ ను ఎదుర్కునేందుకు సమర్ధుడైన నాయకుడి అవసరం కనుక. చిరంజీవి సమర్దుడే అయితే ఈసరికి ముఖ్యమంత్రే అయ్యేవాడు. ఇక, ప్రతిదానికి అల్లు అరవింద్ వైపు చూసే చిరంజీవి, జగన్ ను ఎదుర్కుంటాడనేది అర్థం లేని వాదన. 


కొంతమంది పీఆర్పీ నాయకులు, రాజకీయాల్లో ఇలాంటి విలీనాలు తప్పు కాదు, విజయశాంతి "తల్లి తెలంగాణా పార్టీ"ని తెరాస లో విలీనం చెయ్యలేదా అని లా పాయింట్లు లాగుతున్నారు. ఆంటే, చిరంజీవిని , విజయశాంతిని ఒక గాటన కట్టేస్తారా? ఒక రకంగా విజయశాంతి నయం. తెలంగాణా సాధనకు పోరాడుతున్న ఇంకో పార్టీ లో   విలీనం చేసింది. కమ్యునిస్ట్ పార్టీలు కాంగ్రెస్ ను, టిడిపి ని తిట్టి తర్వాత అవసరానికి వాళ్ళతో పొత్తు పెట్టుకోలేదా అని మరో వాదన. రాష్ట్ర రాజకీయాల్లో,కమ్యునిస్ట్ పార్టీ లు ప్రధాన పార్టీలకు ఎప్పుడూ ప్రత్యామ్నాయం కాదు. అలా ఎవరైనా అనుకుంటే అంతకన్నా పొరపాటు ఇంకోటి ఉండదు. కానీ, అభిమానులు పీఆర్పీని, కాంగ్రెస్, టిడిపి లకు ప్రత్యామ్నాయంగానే చూసారు. ఇప్పుడు పీఆర్పీ జండాలు మోసిన అభిమానుల పరిస్థితేంటి. ఆస్తులమ్ముకుని, 2009 లో పీఆర్పీ తరుఫున పోటీచేసిన వాళ్ళ పరిస్థితేంటి.విలీనం అంటూ జరిగితే (జరగడం అనివార్యం...ఈ సరికే పీఆర్పీ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పదవుల వాసన చూపించేసింది...వాల్లెలాగూ పదవులకు మొహం వాచే ఉన్నారు.) పీఆర్పీ వీళ్ళందరికీ ముందుగా జవాబు చెప్పాలి. 

ఒకవైపు, కేంద్రం, రాష్ట్రాల్లో  2 జి స్పెక్ట్రం అవినీతి, ఎమ్మార్ కుంభకోణాలు ఎదుర్కుంటున్న పరిస్తితుల్లో, కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడాల్సింది పోయి, వెళ్లి, వెళ్లి కాంగ్రెస్ లో కలవడం నిజంగా మూర్ఖత్వమే. అయినా, అంత తొందరేమొచ్చింది. పదవుల పిచ్చ కాకపొతే.

ప్రజలను, అభిమానులను వెర్రివాళ్ళను చేసిన ఈ మొత్తం డ్రామాలో బంపర్ ఆఫర్ కొట్టింది అల్లు అరవింద్. మొన్న ఎలెక్షన్లలో ఓడిపోయినా, ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం లేకపోయినా, చిరంజీవి బామ్మర్ది అయిన కారణంగా కేంద్రంలో మంత్రి పదవి వచ్చేలాగుంది. మొత్తానికి, చిరంజీవి పెట్టిన ఈ పీఆర్పీ దుకాణం త్వరలో ఎలాగూ మూసేస్తారు. అదేదో కథలో చెప్పినట్లు "ఏనుగు ఏదో చేస్తుందని జనాలు ఎగబడితే, వారికి నిరాశ ఎదురైనట్లు ...." పీఆర్పీ ప్రస్థానం ఈ రకంగా తుస్సుమంది. ముందుముందు, చిరంజీవి & కో ఇంకెన్ని అవమానాలు ఎదుర్కోవాలో. చూద్దాం.


~శశిధర్ సంగరాజు.