Powered By Blogger

Thursday, January 20, 2011

సింహ Vs పరమవీర చక్ర

ఇంతలో ఎంత తేడా...
సింహ: "చూడూ...ఒకవైపే చూడూ...రెండో వైపు చూడాలనుకోకూ..తట్టుకోలేవూ..మాడిపోతావ్" 
            (ప్రేక్షకుల చప్పట్లతో ధియేటర్ లు మారుమోగాయి)
పరమవీరచక్ర : "చూడూ...వాల్ పోస్టర్ మాత్రమే చూడూ..సినిమా చూడాలనుకోకూ...చచ్చిపోతావ్ "
          (ప్రేక్షకులు బయటనుంచే పారిపోవడంతో ధియేటర్ లు చిన్నబోయాయి)
~ శశిధర్ సంగరాజు.

Saturday, January 15, 2011

వెన్నుపోటు - కత్తిపోటు

ఒక ఇరాని హోటల్ లో ఇద్దరి సంభాషణ :

మొదటివాడు  -  మద్దెలచెర్వు సూరి భార్య గంగుల భానుమతి, తన భర్త హత్య వెనుక చంద్రబాబు       హస్తం ఉందని ఆరోపించిందిట. విన్నావా?
రెండోవాడు - ఆ..విన్నాలే...ఎవరు నమ్ముతారూ.
మొదటివాడు - ఏం?
రెండోవాడు - మనోడి చరిత్రలో వెన్నుపోటు ఉందికానీ, కత్తిపోటు లేదు. 
మొదటివాడు -??
(కేవలం సరదాకే, ఎవరినీ నొప్పించాలని కాదు)
~శశిధర్ సంగరాజు.

Wednesday, January 12, 2011

సంక్రాంతి శుభాకాంక్షలు

బ్లాగ్ మిత్రులందరికీ 
సంక్రాంతి శుభాకాంక్షలు 
~ శశిధర్ సంగరాజు

Tuesday, January 11, 2011

రుద్రాక్షలు - సద్గురు జగ్గీ వాసుదేవ్

గత సంవత్సరం (జూలై 2010 ) ఇండియా కు వెళ్ళినప్పుడు, టివీల్లో రుద్రాక్షల గురించి ప్రకటనలు చూసాను. హైదరాబాద్, అమీర్ పేట్ ప్రాంతంలో ఏకంగా ఒక షాపే ఉంది(ట). నేను వెళ్ళలేదు. అంతకముందు రుద్రాక్షల గురించి కొంత అవగాహన ఉన్నా, పెద్దగా ఎప్పుడూ పట్టించుకోలేదు. ఈ ప్రకటనలు, అందులో వాళ్ళు చెప్పే విషయాలు విన్న తర్వాత, కొంత ఆసక్తి  పెరిగింది. 

 ఇండియా ట్రిప్ లో ఉన్నప్పుడే, అమెరికాలోని మిత్రుడొకరు,  "మా  బంధువులు  "ఏకముఖి రుద్రాక్ష" ఇస్తారు, తీసుకురాగలరా?"  అని అడిగారు. "దానికేం భాగ్యం, తప్పకుండా" అని నేను కూడా ఒప్పుకున్నాను. ఆ రకంగా "ఏకముఖి రుద్రాక్ష" ప్రత్యక్షంగా చూసే అద్రుష్టం కలిగింది. 


సరే, రుద్రాక్షలు ధరించడం వల్ల లాభాలు, నష్టాలు పక్కన పెడితే, ఈ మధ్య "యూట్యుబ్" లో వెతుకుతుంటే, సద్గురు జగ్గీ వాసుదేవ్ గారు రుద్రాక్షల గురించి చెప్పిన వీడియో కనిపించింది. రెండు భాగాలుగా ఉన్న ఈ వీడియో, రుద్రాక్షల గురించి నాకు తెలియని కొన్ని విషయాలు చెప్పింది. 

ముఖ్యంగా, రెండవ లింక్ లో, రుద్రాక్షమాలను ఉపయోగించి మనం తాగే నీళ్లు మంచివో, కాదో తెలుసుకునే విధానం నన్ను ఆకట్టుకుంది. అడవుల్లో సంచరించే సాధువులు, సన్యాసులు రుద్రాక్షమాలను ఉపయోగించి, నీటిచెలమల్లోని నీరు తాగడానికి శ్రేయస్కరమో, కాదో తెలుసుకునేవాళ్ళట. ప్రస్తుతం నా దగ్గర రుద్రాక్షమాల లేదు కాబట్టి పరీక్షించి చూడలేను. 

రుద్రాక్షలు వాడమనో, వాడితే మంచిదనో, మరోటో ప్రచారం చెయ్యడం నా ఉద్దేశ్యం కాదు. ఎవరిష్టం వారిది. 
నా ఆసక్తి అంతా, రుద్రాక్షమాల టెక్నిక్ ఉపయోగించి ఈ మధ్యకాలంలో మినరల్ వాటర్ అని చెప్పి మురికి నీళ్ళు  అంటగడుతున్న దొంగ వెధవల ఆటకట్టించొచ్చు కదా అనే. (సాధ్యమో కాదో తెలియదు..ఒక ఆలోచన మాత్రమే)


వీడియో లింకులు కింద ఇస్తున్నాను. మీరు రుద్రాక్షలు వాడుతున్నట్లయితే మీ అనుభవాలు నాతో పంచుకోండి (అభ్యంతరం లేకపోతేనే సుమా!)


Rudhraksha - Part 1

Rudhraksha - Part 2 


~శశిధర్ సంగరాజు

Sunday, January 2, 2011

కెలైటోస్కోప్ - రంగుల హరివిల్లు

మా ఊర్లో (లూయివిల్, కెంటకి) క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా " కెలైటోస్కోప్" అనే ప్రదర్శన ఏర్పాటు చేసారు. ఒహాయో నది వడ్డున ఉన్న "గాల్ట్ హౌస్" ప్రాంగణం లో ఈ ప్రదర్శన జరిగింది. నేను మా శ్రీమతి, పిల్లలు (సాకేత్,శ్రియ) తో కలసి వెళ్లాను. వేళ్ళు కొంకర్లు తిరిగే చలిలో కూడా నిజంగా చూడాలనిపించే రంగుల హరివిల్లు ఈ కార్యక్రమం. 


పురాతన చైనీస్ ఆర్ట్ స్పూర్తితో ఏర్పాటు చేసిన శిల్పాలు(?) లోపలకు అడుగు పెట్టగానే మమ్మల్ని కట్టి పడేశాయి.
 దూరం నుంచి చూడగానే ఈ ఆకృతులు గాజు పలకలతో చేసారేమో అనిపించాయి. తర్వాత నిర్వాహకులు చెప్పారు, ఇవి పూర్తిగా ప్రత్యేకమైన, సిల్క్ లాంటి, రంగు రంగుల బట్టలతో చేసారని. బట్టల వెనకాల నుంచి అమర్చిన కలరఫుల్ లైట్ల కాంతులు బొమ్మలకు కొత్త అందాలనిచ్చాయి.
 క్రిస్మస్, న్యూ ఇయర్ థీమ్ లతో దాదాపు 25  అంశాలను ప్రదర్శించారు. ప్రతి అంశంలోనూ, చిన్న పిల్లలకు ఆసక్తి కరంగా ఉండడానికి, కొన్ని పజిళ్ళను ఏర్పాటు చేసారు. మా సాకేత్ అన్ని పజిళ్ళను పూర్తిచేయ్యాలని పరుగులు పెట్టాడు. 
 పజిళ్ళను సకాలంలో పూర్తిచేసిన పిల్లలకు చిన్న చిన్న బహుమతులు కూడా ఇస్తారు. సాకేత్ కూడా కొన్ని బహుమతులు గెలుచుకున్నాడు. కొన్ని ఆకృతులు దాదాపు 24  అడుగుల పొడవుకూడా ఉన్నాయి.
 ఈ ఫ్లవర్  ఎగ్జిబిట్ సన్నటి ఫ్రేం మీద అమర్చారు. మంచి రంగుల కలయికతో పాటు, లైట్ కాంబినేషన్ కూడా చక్కగా అమరింది. ఫోటో లో ఉన్నది మా ఏడాదిన్నర వయసున్న శ్రియ. అన్నిటిని ముట్టుకు చూడాలని చాలా గొడవ చేసింది.
 పిరమిడ్ ల షేప్ లో ఉన్న ఈ ఆకృతి ఆప్టికల్ ఇల్లూషన్ ను కలిగిస్తాయి. ఈ పిరమిడ్ లు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టడం పజిల్. ఏ చివరనుంచి లెక్కించినా కొన్ని మన దృష్టిని తప్పించుకుంటాయి. మనం అన్నీ లెక్క పెట్టాము అనుకుని సంతోషపడేసరికి, మన పక్కనున్న వాళ్ళు వేరే మొత్తం చెప్తారు. మళ్లీ కౌంటింగ్ మొదలు. సరదాగా గడిచిపోయింది.
  మా పిల్లలిద్దరికి ఈ ఎగ్జిబిట్ బాగా నచ్చింది. ఎంతోమంది కళాకారులు శ్రమించి సృష్టించిన ఈ రంగుల లోకం మాకు కూడా ఎంతో ఆనందాన్నిచ్చింది. 

మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తాను. 


~ శశిధర్ సంగరాజు.