Powered By Blogger

Sunday, February 16, 2014

అమెరికాలో మంచు తుఫాను

గత నెలన్నరరోజులుగా దాదాపు ప్రతిరోజు అమెరికాలో (మిడ్ వెస్ట్, ఈస్ట్) ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తూనే ఉంది. పడిన మంచు పడినట్లుగానే ఉండగానే, పైనుంచి మంచు పడడం, ఉష్ణోగ్రతలు 0 డిగ్రీలకన్నా తక్కువ ఊండడం వల్ల మంచు కరిగే ప్రసక్తి లేకుండా పోయింది. ఉత్తర ధృవం నుంచి వచ్చిన మంచుతుఫాను ఈ విపరీతానికి కారణంగా వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. 

దాదాపు చాలా ప్రాంతల్లో జనజీవనం అతలాకుతలం అయిపోయింది.  రెండువారాలక్రితం అట్లాంటా నగరంలో కురిసిన మంచు వల్ల అక్కడ జనజీవనం స్థంభించడమే కాకుండా, సకాలంలో స్పందించని ప్రభుత్వ యంత్రాంగం పౌరుల నిరసనకూడా గురైంది.

స్థానిక  స్కూళ్ళ యాజమాన్యం స్కూళ్ళు కూడా పూర్తిగా మూసెయ్యడమో, లేకపోతే  ఆలస్యంగా తెరవడమో చేశారు. అనుకోకుండా వచ్చిన సెలవలను, పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తే, ఉద్యోగాలు చేసుకునే తల్లి తండ్రులు, వీళ్ళకు బేబీసిట్టర్ లను సమకూర్చుకోలేక నానా ఇబ్బందులు పడ్డారు. 
ఇప్పుడు వింటర్ ఒలంపిక్స్ జరుగుతున్న సోచి (రష్యా) కన్నా మా ఊర్లోని (లూయివిల్, కెంటకీ) ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అయ్యాయంటే, పరిస్థితి మీకు అర్థమయ్యే ఉంటుంది. 
మాయింటి పరిసరాల్లో కురిసిన మంచుతో కప్పబడిన పరిసరాల ఫోటోలను తీసాను. ఈపోస్ట్ తో పాటు ఆ ఫోటోలను కూడా జతచేస్తున్నాను. చూసి ఆనందించండి. 


 <== మంచు కురవడం ఇప్పుడే కొంత ఆగింది. మా యింటి డ్రైవ్ వే లోంచి తీసిన ఫోటో.
 మంచుతో నిండిన రోడ్లు.==>
<== మా యింటి ముందు భాగం.
 ఐస్ వర్షం కారణంగా ఐస్ తో నిండిన చెట్టు. చూడడానికి గాజు బొమ్మలా ఉంది కదూ ==>

మంచు/ఐస్ బరువుకు వంగిపోయిన చెట్లు. 



 

~శశిధర్ సంగరాజు. 

Monday, December 31, 2012

బ్లాగ్ మిత్రులందరికీ, 

నూతన సంవత్సరంలో, మీకు మరియు మీ ఆప్తులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను, సుఖశాంతులను ప్రసాదించాలని
ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ...

శశిధర్ సంగరాజు & ఫ్యామిలీ

Tuesday, July 17, 2012

మధుయాష్కీ తో నేను


పదిరోజుల క్రితం,  నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ లూయివిల్, కెంటకీ కి వచ్చారు. "ఇండో-అమెరికన్ వ్యాపార సంబధాలు" పర్యటనలో భాగంగా మా ఊరు రావడం జరిగింది. 


మా తెలుగు అసోసియేషన్ సభ్యులం,  కలవడానికి వెళ్ళాం. ఫోటోలు తీయించుకున్నాం. ఇండియాలో అయితే, ఎంపీ స్థాయి వ్యక్తులను కలిసి మాట్లాడాలంటే, కొంచెం కష్టమేమో. ఇక్కడ మాత్రం భేషజాలేమీ లేకుండా బాగానే మాట్లాడాడు. పైగా,  మా సంస్థ చైర్మన్ డాక్టర్ విజయకృష్ణ, మధుయాష్కీ ఇద్దరూ బాల్యస్నేహితులు కావడం కూడా బాగా కలిసొచ్చింది. ఇదుగోండి, మధుయాష్కీ తో కలసి తీయించుకున్నఫోటో.


 ఒక మొక్కుబడి ఉంటే, ఈ మధ్యన పిట్ట్స్ బర్గ్ వెళ్ళి, వెంకటేశ్వరస్వామికి తలనీనాలు సమర్పించి వచ్చాను. అదీ నా గుండు గెటప్ వెనకాల కథాకమామీషు. 


స్థానిక "తాజ్ పాలెస్" రెస్టారెంట్ లో ఆయన్ను కలిసాము. మరాఠీ, గుజరాతీ, పంజాబీ కంమ్యూనిటీ వాళ్ళు కూడా వచ్చారు. మధు, తెలుగు వాళ్ళతో కాస్త ఎక్కువ సమయం గడిపారు. స్వతహాగా లాయర్ కూడా కావడంతో, కొంతమంది అడిగిన ఇమ్మిగ్రేషన్ సంభందిత విషయాలు కూడా బాగానే మాట్లాడారు. ఎన్నారైలను ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించడం పర్యటన ఉధ్ద్యేశ్యం. 


తెలుగోళ్ళం (పనికిమాలిన)రాజకీయాల గురించీ, గుజరాతీ బ్యాచ్,  వ్యాపారాలు/పెట్టుబడుల గురించీ, మరాఠీ వాళ్ళు ఎవరికీ అర్థం కాకుండా ఏదో విషయం గురించి ప్రశ్నలు అడిగాం.

 

మేమంతా రాష్ఱ్రంలో పెరుగుతున్న అవినీతి గురించి మరొక్కసారి తీవ్రంగా బాధపడి, ఇంకో రెండు రస్మలాయిలు అదనంగా లాగించి ఇళ్ళకు చేరుకున్నాం. అదీ సంగతి. 


~శశిధర్ సంగరాజు. 



Monday, April 2, 2012

లూయివిల్ లో ఉగాది సందడి


ఏప్రిల్ 1  వ తేదీ సాయంత్రం మా ఊర్లో (లూయివిల్  ) లో తెలుగువారందరూ కలసి ఉగాది వేడుకలు జరుపుకున్నాము. ఎంతో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో మా అబ్బాయి రెండు డాన్సు ఈవెంట్స్ లో పాల్గొన్నాడు.  నేను పత్రికలకు పంపిన చిన్న రైట్ -అప్ కూడా కింద ఇస్తున్నాను.  
*****************************************************
కెంటకీ రాష్ట్రంలోని లూయివిల్ నగరంలో ప్రవాస భారతీయులు ఉగాది సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ కెంటకియానా (టాక్) ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు విరివిరిగా పాల్గొని పరస్పరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ పుష్పలత పావులూరి మాట్లాడుతూ, విదేశాల్లోని తెలుగువారంతా తమ సంస్కృతీ సంప్రదాయాలను మరచిపోకుండా ప్రతి సంవత్సరం ఇలాంటి పండుగలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. సంస్థకు విరాళాలు అందజేసిన దాతలను సభకు పరిచయం చేసి అభినందించారు.

ఈ సందర్భంగా పలు సాంస్క్రతిక కార్యక్రమాలు జరిగాయి. సినీ గీతాలకు చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శ్రీమతి సుప్రియ నృత్య దర్శకత్వంలో 22 మంది చిన్నారులు ప్ర్రదర్శించిన "శ్రీకృష్ణ లీలలు", బాబు కొండవీటి బృందం ప్రదర్శించిన "భీష్మ , కర్ణ, దుర్యోధన సంవాదం", డాక్టర్ రాజశేఖర్ లక్కరాజ్ ఆలపించిన సినీగీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఫ్రాంక్ ఫర్ట్ కుర్రాళ్ళు ప్రదర్శించిన నృత్యాలు ఆహూతులను ఉర్రూతలూగించాయి.
కార్యక్రమానికి రఘు, స్వరూప్, భార్గవి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

కార్యక్రమం విజయవంతంగా జరగడానికి కృషి చేసిన ఎగ్జిక్యూటివ్ కమిటీని సంస్థ చైర్మన్
డాక్టర్ విజయకృష్ణ అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు బహుమతి ప్రదానం జరిగింది.
అనంతరం అతిధులకు తెలుగు వంటకాలతో కూడిన విందుభోజనం అందించారు.
************************************************
                             
                                       (గణపతి ప్రార్థన)
                                   
                                        (శ్రీ కృష్ణ  లీలలు నృత్య రూపకం)
                           
                                          (కర్ణ, దుర్యోధన, భీష్మ సంవాదం)
                                          (సాకేత్ మెడ్లీ - 1)

                                          (సాకేత్ మెడ్లీ - 2 )


~శశిధర్ సంగరాజు



Sunday, January 1, 2012

నూతన సంవత్సర శుభాకాంక్షలు

బ్లాగ్ మిత్రులందరికీ ,
నూతన సంవత్సర శుభాకాంక్షలు.
కొత్త సంవత్సరంలో  మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ 
సర్వ శుభాలు చేకూరాలని ఆశిస్తూ...


~శశిధర్ సంగరాజు
 






Sunday, September 18, 2011

నేచురల్ బ్రిడ్జి - కెంటకి

మా ఊరు లూయివిల్ కు దాదాపు రెండు గంటల ప్రయాణ దూరంలో "నేచురల్  బ్రిడ్జి" స్టేట్ పార్క్ ఉంది. 

ప్రకృతి సహజం గా ఏర్పాటైన బ్రిడ్జి అన్నమాట. మీలో చాలామంది మన తిరుమల కొండమీద "శిలా తోరణం" చూసే ఉంటారు. సరిగ్గా అలాగే ఉంటుంది. కాకపొతే, చాలా పెద్దది ఎత్తైనది. మరో విషయం ఏంటంటే, నాకు తెలిసినంతవరకూ "శిలా తోరణం" మనం నడవడానికి వీలు లేదనుకుంటా. (నాకు సరిగ్గా గుర్తు లేదు. Correct me if I am wrong.) ఈ ఆర్చ్ మీద, మీరు నడవొచ్చు, పరుగులు పెట్టొచ్చు..మీ ఇష్టం. 

అసలీ పార్క్ కు వెళ్ళే దారికూడా చాలా బాగుంటుంది. రెండుగంటల ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది. దారి పొడువునా, విశాలమైన పచ్చిక బయళ్ళు, స్వేచ్చ గా తిరిగే గుర్రాలు. (మా ఊరు గుర్రాలకు, గుర్రప్పందేలకు ప్రసిద్ది)చూడ్డానికి చాలా బాగుంటాయి. 
అసలు ఎలా ఏర్పడింది:  దాదాపు మిలియన్ సంవత్సరాలకు పూర్వమే ఈ బ్రిడ్జి ఏర్పడడం మొదలైందని కొంత మంది జియాలజిస్ట్ ల నమ్మకం. నిజంగా ఎన్నాళ్ళ నుంచి ఉందో తెలియదు కానీ, కొంతమంది పర్యాటకులు 1889 నుంచి ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారట. 78 అడుగుల పొడవు, 65 అడుగుల ఎత్తు, 12 అడుగుల మందం, 20 అడుగుల వెడల్పు.ఇవీ  ఈ బ్రిడ్జి వివరాలు.
 
ఆసక్తి ఉన్నవారికి ఇక్కడ కేమ్పింగ్ వసతులున్నాయి. కొండ కిందున్న లేక్ లో బోటింగ్ చెయ్యడానికీ, పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం కూడా ఉన్నాయి. 





 











 


మరి కొండపైకి వెళ్ళడం ఎలా?:
ఇక్కడ ఉన్న "స్కయ్ లిఫ్ట్" నిజంగా ప్రత్యేక ఆకర్షణ. దాదాపు అరమైలు దూరం సాగే ఈ స్కయ్ లిఫ్ట్ ప్రయాణం ఉత్కంట భరితంగా ఉంటుంది. పైకి వెళుతున్న కొద్దీ, 
 కింద కనిపించే జింకలు, కుందేళ్ళు చూడ ముచ్చటగా ఉంటాయి.(కుందేళ్ళు కెమేరాకు చిక్కలేదు!)


ఈ ఆర్చ్ ఏర్పడడానికి ఉపయోగపడిన రాయిని  జియాలజీ పరిభాషలో 
"Pottsville conglomeratic sandstone" అంటారట. కొండపైన అడవిలాంటి ప్రాంతంలోపలికి వెళ్ళడానికి దారులు కూడా ఏర్పరచారు. 
మొత్తానికి ఈ ట్రిప్ పిల్లలకు, పెద్దలకు కూడా వీకెండ్ ఆటవిడుపే.


~శశిధర్  సంగరాజు.

Friday, September 16, 2011

నీ అసాధ్యం కూలా.. రాంబాబూ...నువ్వు సామాన్యుడివి కాదయ్యా!

ఇదిగో రాంబాబూ,
టీవీల్లో ఏదో చూపిస్తున్నారు. నువ్వేం  మనసు కష్టపెట్టుకోకు. ఈసారి వినాయక చవితికి కథ చదువుకోకుండా చంద్రున్ని చూసినట్లున్నావ్. నీలాపనిందలు. అవే సర్దుకుంటాయి లే.

అయినా, ఈ ఆంధ్రజ్యోతి ఛానల్ వాళ్ళకు వేరే పనేమీ లేనట్లుంది. గతంలో కూడా ఎన్ డి తివారీ విషయంలో కూడా ఇలాగే చేసారు. ఏదో ముసలాయన ఊరపిచ్చుక లేహ్యం గట్రా తిని హుషారుగా ఉన్నాడులే అని చూసీ చూడనట్లుండకుండా నానా యాగీ చేసి గవర్నర్ గిరి ఊడగొట్టించారు.

సరే, నీ విషయంలో అంటే ఊడగొట్టించడానికి నీ దగ్గర ప్రస్తుతానికి పదవేదీ లేదనుకో.
ఇక పరువు మర్యాదలంటావా..తూచ్..మనకు వాటికీ ఆమడదూరం. ఈ విషయం వాళ్ళకు తెలిసిరాలేదు.

అయినా, ఈ మధ్య ఓటర్ల కు కూడా బాగా కోరికలెక్కువయ్యాయి. ఏదో అయిదు సంవత్సరాలకొకసారి, నాలుగైదు
గంటలు ఎండలో నిలబడి ఓటు వేసినంతమాత్రాన, అవినీతి చెయ్యద్దంటారు, మహిళలను గౌరవించాలంటారు, ఎంత కష్టం. పైగా ప్రతిదానికీ ప్రకాశం పంతుల్ని, వావిలాల గోపాలకృష్ణయ్య లాంటివాళ్ళను ఉదాహరణలు చూపిస్తారు. వాళ్ళలా నీతినిజాయితీ గా ఉండడానికి మనకేమైనా చాదస్తమా? ఏదో నాలుగు రాళ్ళు సంపాదించుకోకపోతే, రాజకీయాల్లోకి రావడం ఎందుకు?

 వీళ్ళకు తోడు ఈ మధ్యన అన్నాహజారే తయారయ్యాడు,  ప్రతిదానికీ నిరాహార దీక్ష చేస్తానంటాడు.
ఈవయసులో అప్పుడప్పుడూ ఉపవాసం చెయ్యడం ఆయనకు కూడా మంచిదే అనుకో. కాకపోతే మధ్యతరగతి జనాలు ఆ విషయం అర్థం చేసుకోవడం లేదు. ఏదో భూమి బద్దలైపోతున్నట్లు హడావిడి.

ఇంతకూ రాంబాబూ, మహిళా కార్యకర్తలను ఈరకంగా గిల్లుకోవచ్చని నీకు భలే ఐడియా వచ్చిందే. సూపర్ కదా!
అందుకే నిన్ను సామాన్యుడివి కాదూ అన్నది. రాజకీయాల్లో టెన్షన్ తట్టుకోలేక, రిలీఫ్ కోసం చేసి ఉంటావు కదా? అంతేలే, దానికి ఇంత గొడవ చెయ్యాలా?

ఏమాటకు ఆమాట చెప్పుకోవాలి. నీ తాపత్రయం నా కర్థమైందిలే. ఏదో బయటున్నప్పుడే ఈ ముచ్చట్లన్నీ.
రేప్పొద్దున ఎమ్మార్ కేసులో సిబిఐ అరెస్టు చేసి లోపలేసిందనుకో, అక్కడ గోక్కోడానికి మహిళా కార్యకర్తలెవరూ ఉండరు. ఉంటే గింటే, మహిళా కానిస్టేబుళ్ళు ఉంటారు. వాళ్ళను గోకావనుకో, బయటకు  చెప్పుకోలేనిచోట థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు. మళ్ళీ అదో  బాధ.

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నట్లున్నావ్. ధైర్యం అంటే అదీ. నిజం ఎలాగూ త్వరలోనే బయటపడుతుంది. ఈలోపల తొందరపడి జగన్ పార్టీలోంచి తీసేస్తాడని ఆలోచించొద్దు. ఇది కాకపోతే ఇంకోటి. ఈసారి మహిళలు కాస్త ఎక్కువున్న పార్టీ చూసి చేరుదువు గానీ. వినడానికి ఫోన్లో నీ గొంతు భలేగా ఉంది రాంబాబూ. ఈసారి వీడియో చాటింగ్ చెయ్యి. టెక్నాలజీ ని ఉపయోగించుకో. అసలే నీది మంచి ఫోటోజనిక్ ఫేస్  కదా.

ఈ ఛానళ్ళు, మహిళా సంఘాల  గొడవ మామూలేగానీ, నీ పనిలో నువ్వుండు. ఆల్ ది బెస్ట్.

~శశిధర్ సంగరాజు.