Powered By Blogger

Friday, December 31, 2010

నూతన సంవత్సర శుభాకాంక్షలు

బ్లాగ్ మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
కొత్త సంవత్సరం గమ్మత్తు గమనించారా... మొదటి రోజే 1 . 1 . 11 .
సరదాగా ఉంది కదూ.
కొత్త సంవత్సరం మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ శుభప్రదం కావాలని ఆశిస్తూ... 


~శశిధర్ సంగరాజు. 

Friday, December 24, 2010

క్రిస్మస్ శుభాకాంక్షలు

బ్లాగ్ మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు 
 
~శశిధర్ సంగరాజు. 

చంద్రబాబు...జగన్.. ఓ పేదరైతు

ఎలాగైతేనేం, మొత్తానికి, రాష్ట్ర ప్రభుత్వం,  చంద్రబాబు దీక్ష భగ్నం చెయ్యగలిగింది. విజయవాడలో జగన్ చేపట్టిన దీక్ష 48 గంటలు మాత్రమే అని ముందుగానే చెప్పడం వల్ల అక్కడ అరెస్టులు లాంటి హడావిడి ఏమి లేకుండానే, ఆయనే దీక్ష ముగించేసారు. ఈ మొత్తం దీక్షా కార్యక్రమాలను, అమెరికాలో నాకు వీలున్నంతవరకు పేపర్లు, టీవీ ల ద్వారా ఫాలో అయ్యే ప్రయత్నం చేసాను .నాకొక విషయం అర్థం కాలేదు. నాయకుల దీక్షలు, వాటికైయ్యే బందోబస్తు, రక్షణకు వచ్చే పొలీసుల జీతభత్యాలు, ఈ నాయకులు, వారి అనుచరగణం చేసే ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, మళ్లీ వాటిని బాగు చెయ్యడానికయ్యే  ఖర్చు. ఇదంతా కలసి కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. వీళ్ళంతా చేసే దీక్షలు రైతులకోసమే అయినప్పుడు, ఆ డబ్బేదో రైతులకిచ్చే ప్యాకేజ్ లోనే కలిపి ఇస్తే, పాపం రైతులకు కొంతైనా ప్రయోజనం ఉంటుంది కదా అనిపించింది. సరే, ఈ దీక్షలవల్ల రైతులకు ఏం ఒరిగింది అనే విషయం పక్కనపెడితే, రాజకీయ నాయకులకు ఎవరికెంత లాభమొచ్చిందో చూద్దాం. 


చంద్రబాబు (ఎంతైనా సీనియర్ కదా, ముందు ఆయన గురించే చెప్పుకుందాం): తెలంగాణా, సీమాంధ్ర రెండూ, రెండు కళ్ళు అనిచెప్పి దాదాపు చూపు పోగొట్టుకుంటున్న తరుణంలో, చంద్రబాబుకు ఈ దీక్ష భలే ఉపయోగపడింది. జాతీయ స్థాయిలో మీడియా కవరేజ్, జాతీయ నాయకుల పలకరింపులు మాత్రమే కాకుండా, సామాన్య ప్రజల్లో కూడా సానుభూతి కూడా పెరిగింది. దీనికి అధిష్టానం నిర్లక్ష్య, నిరంకుశ ధోరణి కూడా తోడైంది. అది వేరే విషయం. చంద్రబాబు పేరు చెపితే చిందులేసే అమెరికాలోని తెలుగు మిత్రుడు కూడా "పాపం, అరవై ఏళ్ళ వయసులో, బాగానే కష్టపడ్డాడు" అనేసాడు. సాక్షాత్తు, అధికార పార్టీ ఆరోగ్య మంత్రి డి.ఎల్.రవీంద్రారెడ్డి, జగన్ పెట్టబోయే పార్టీ కన్నా, తెలుగుదేశం వందరెట్లు మేలు అన్నాడంటే, బాబు దీక్ష ఫలప్రదమైనట్లే. మన టైంబాలేక మధ్యంతరం వస్తే, బాబును రైతు జనభాంధవుడు గా ప్రొజెక్ట్ చెయ్యడానికి తెదేపా శ్రేణులు కదం తొక్కుతాయి. సందేహం లేదు. 

జగన్: ప్రత్యక్ష రాజకీయాల్లో, నిండా రెండు సంవత్సరాల సీనియారిటీ కూడా లేని బుడ్డోడు, 125  సంవత్సరాల (వాళ్ళే చెప్పుకున్నారు) వయసున్న కాంగ్రెస్ పార్టీ కి సినిమా చూపించేసాడు. అంతవరకూ, "అబ్బే, ఇప్పుడు జగన్ వెనకాల పదిమంది కంటే ఎక్కువమంది లేరని" చప్పరించేసిన సీనియర్లకు, దాదాపు పాతిక పైచిలుకు ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు ఎంపీలు, వందల సంఖ్యలో వచ్చిన కార్యకర్తలను చూసి పొలమారి ఉంటుంది. ఇంతవరకూ అటూ, ఇటూ గా ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు, ఈ దీక్ష పుణ్యమా అని తెరముందుకొచ్చి తొడలు కొట్టేస్తున్నారు. జీవిత, రాజశేఖర్ లాంటి పక్క వాయిద్యాలు మామూలే. ఈ సారి తానుకూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేస్తానని రాజశేఖర్ వార్నింగ్ కూడా ఇచ్చేసాడు. ఇక మీ ఇష్టం. ఈ లెక్కన దీక్ష, జగన్ కు కూడా బ్రంహాండంగా కలిసొచ్చింది.


పేదరైతు: ఆంబోతుల కుమ్ములాటలో నలిగిపోయిన లేగదూడలా, పాపం, ఒకవైపు పంట నష్టం, మరోవైపు కౌలుదారుల ఒత్తిడి, కోతకొచ్చిన పంట పొలంలోనే కుళ్ళిపోతూఉంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఈ మొత్తం ప్రహసనం లో పూర్తిగా నష్టపోయింది రైతే. ఈ పరిస్థితే కొనసాగితే, ఇక ముందు ముందు, నాట్లు వెయ్యడానికికూడా ఎవరూ ముందుకు రారేమో.


అదేదో సినిమాలో సాయికుమార్ డైలాగు చెప్పినట్లు, ప్రస్తుతం రాష్ట్రం లో కనపడని నాలుగో సింహం ఒకటి తిరుగుతోంది. అదే, చిరంజీవి..రంజీవి..జీవి..వి..(ఇక్కడ కావాలంటే, మీరు స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ వేసుకోవచ్చు) .తాజా రాజకీయ పరిణామాలవల్ల ఈయనకు కూడా ఒక లాభం జరిగింది. అదెలాగంటే, ఇంతకుముందు, ప్రెస్ మీట్లలో విలేఖర్లు "ఫలానా వారు మీ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారట కదా?" అని అడిగితే , "అవునా?" అంటూ అముల్ బేబీ పేస్ పెట్టేవాడు. ఇంక లెక్క చూసుకోక తప్పేట్లు లేదు. ముగ్గురు బహిరంగంగానే జగన్ దీక్షలో పాల్గొని మద్దతిచ్చేసారు. మిగిలిన వాళ్ళు ఎప్పుడు జంప్ జిలాని అవుదామా అని ఎదురుచూస్తున్నారు. పోన్లెండి, ఈ రకంగానైనా తనవాళ్ళెవరో , పైవాళ్ళెవరో తెలిసొస్తుంది.


~శశిధర్ సంగరాజు.

Saturday, December 18, 2010

కృష్ణ భగవాన్ - నీకిదేం బుద్ది?

నిన్న సాయంత్రం టీవిలో చూసాను, సినీ  హాస్యనటుడు కృష్ణ భగవాన్ పిచ్చి చేష్టలు. "ఏప్రిల్ ఒకటి విడుదల"
సినిమాతో నటుడిగా లైంలైట్ లో కొచ్చిన ఈయన, గోదావరి జిల్లాల యాసతో డైలాగులు చెప్పడంలో ప్రసిద్ధుడు. అంతవరకూ బాగానే ఉంది. 

ఇటీవల, నరసాపురం లో ఒక విద్యాసంస్థ, వాళ్ళ కాలేజి "ఫ్రెషర్స్ డే"  కార్యక్రమానికి ఈ ప్రభుద్దుడిని పిలిచారు, ఇంకెవరూ లేనట్లు. సరే, వచ్చినవాడు సక్రమంగా రావచ్చు కదా? తప్పతాగి మరీ వచ్చాడు. ఆ తాగి తగలడేదేదో కార్యక్రమం అయ్యాక, అఘోరించొచ్చు కదా.నాలుగు గోడల మధ్య మీరు ఎలా ఏడిస్తే ఎవరు చూడొచ్చారు గనుక. 


ముఖం ఉబ్బిపోయి, మాట తడబడుతూ, ఎబ్బెట్టుగా కనిపించే బాడీ లాంగ్వేజ్ తో మనోడు స్టేజి మీద దిష్టిబొమ్మలా తయారైయాడు.  తెలిస్తే మాట్లాడాలి, లేకపోతే, నోరుమూసుకుని కూర్చున్నట్లయితే "ఆయన అంతే, మితభాషి" అని నిర్వాహకులు సరిపెట్టుకునేవాళ్ళేమో. సమయం, సందర్భం లేని వ్యాఖ్యానాలతో పాపం పిల్లలను హడలగొట్టి పారేశాడు. ఈ వికారం అక్కడితో ఆగలేదు. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు, ప్రముఖ సహస్రావధాని గరికపాటి నరసింహారావు గారిని వెటకారం చెయ్యడం మొదలెట్టాడు.


కేవలం, తెలుగు భాష కు మాత్రమే సొంతమైన అవధాన ప్రక్రియ లో, అందులోనూ ఉన్నకొద్ది మంది ప్రముఖుల్లో గరికపాటి వారు విశిష్ట స్థానాన్నిసుస్థిరం చేసుకున్న ప్రజ్ఘ్నావంతులు. ఆయనను, ఆయన విద్వత్తును వెటకారం చేసే స్థాయి, ఎవరో రాసి పెట్టిన డైలాగ్ లను చెప్పుకుని బతికే కృష్ణ భగవాన్ కు లేదు. "ఆయన ఏదో చెప్పాడు, ఎవరికి అర్థమవుతున్దీ?" అని తనదైన శైలిలో విమర్శలకు దిగాడు. గరికపాటి వారి పాండిత్యం అర్థం కావాలంటే ఒక స్థాయి ఉండాలి, కనీసం ఆస్వాదించే హృదయమైనా ఉండాలి. వాక్చాతుర్యానికీ, వాగడానికీ మధ్య అంతరం తెలియని కృష్ణ భగవాన్ కు అర్థం కాకపోవడం లో ఆశ్చర్యం ఏమీ లేదు. 

సినిమా నటుల్లో హుందాగా ప్రవర్తించేవాళ్ళు  చాలా మందే ఉన్నారు, కనీసం పబ్లిక్ లోనైనా. ముఖ్య అతిధిగా వెళ్ళే సభకు తాగి వెళ్ళాలనే దిక్కుమాలిన ఆలోచన వచ్చినందుకు కృష్ణ భగవాన్ ను అభినందించాల్సిందే. అసలే, సినిమా వాళ్ళంటే జనాలకున్న చులకన భావం ఇలాంటి వ్యక్తుల చర్యల మూలంగా ఇంకా బలపడతాయి. సినిమా వాళ్ళు ఆడవాళ్ళైతే సెక్స్ రాకేట్లలోనూ, మగవాళ్ళు డ్రగ్స్ రాకేట్లలోనూ, కొంతమంది, భార్య ఉండగా రెండో పెళ్లి చేసుకుని కోర్ట్ చుట్టూ తిరుగుతూ ఇప్పటికే పరువు పోగొట్టుకుంటున్నారు (అందరూ కాకపోయినా). ఇంకా ఇలాంటి చిల్లర చేష్టలు చేసి ప్రజల్లో పలుచన కాకండి. 


అకారణంగా, గరికపాటి నరసింహారావు గారి పట్ల అవాకులు చెవాకులు పేలిన కృష్ణ భగవాన్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని సాహితీ అభిమానులందరి తరుపునా ఈ బ్లాగ్ ముఖంగా డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ, క్షమాపణ చెబితే, "ఏదో తాగిన మత్తులో వాగినా, కృష్ణ భగవాన్ చేసిన తప్పుకు పశ్చాత్తాపం వెలిబుచ్చాడు, సంస్కారవంతుడే!" అని అనుకుంటాం. చెప్పకపోతే, "గరికపాటి వారి వంటి గజరాజు వెళుతూ ఉంటే, కృష్ణ భగవాన్ లాంటి గ్రామ సింహాలు మొరగడం సహజమే" అని సర్ది చెప్పుకుంటాం.  ఏ కోవలోకి చెందాలనుకుంటున్నారో మీ ఇష్టం. 


~ శశిధర్ సంగరాజు.

Thursday, December 16, 2010

దస్తగిరి పార్ట్ 3 : బ్లాక్ బోర్డ్

నేను దస్తగిరి పార్ట్ I , పార్ట్ II  రాసిన తర్వాత, మిత్రులనుంచి అందిన ప్రోత్సాహం, అభినందనలు మరువలేనివి.  9  వతరగతిలో జరిగిన మరో చిన్న జ్జ్ఞాపకాన్ని మీ అందరితో పంచుకోవాలని ఈ పోస్ట్ రాస్తున్నాను. చదవండి మరి. 
****************************
9 వ తరగతిలో ఉన్నప్పుడు, మేము మహా సరదాగా, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే అంశం, బ్లాక్ బోర్డుకు ఆకు పూయడం. అదెలాగంటే, మా మునిసిపల్ హైస్కూల్ 1857 లో స్థాపించారు. బ్రిటిష్ కాలం లో కట్టిన బిల్డింగ్ అవ్వడం మూలాన తరగతి గదులు విశాలంగా, గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలాగా ఉండేవి. మా క్లాసు లోకి ఎంటర్ అవ్వగానే, తలుపుకు ఎదురుగా, ఎత్తైన అరుగు (ప్లాట్ ఫాం) ,దానిపైన, టీచర్ కూర్చోడానికి ఒక చైర్, చైర్ కు ఎదురుగా ఒక టేబుల్ ఉండేవి. సరిగ్గా, టీచర్ కూర్చునే చైర్ కు వెనకాల బ్లాక్ బోర్డు ఉండేది. ప్లాట్ ఫాం కు ఎదురుగా, గదికి అటువైపున రెండు పెద్ద, పెద్ద కిటికీలు ఉండేవి. కిటికీల వల్ల మా కొచ్చిన నష్టం ఏమీ లేదుకానీ, కిటికీ లోంచి వచ్చే సూర్యరశ్మి, బోర్డు మీద పడి, పరావర్తనం చెంది, బోర్డు మీద రాసే అక్షరాలు కనిపించేవి కావు. బోర్డు కూడా బాగా వాడడం వల్ల, నునుపుగా తయారై, దాదాపు, సగం బోర్డు మీద ఏమి రాస్తున్నారో కింద కూర్చున్న వాళ్లకు కనిపించేది కాదు.


నోట్స్ లు రాసుకోవడానికి బద్దకించేవాళ్ళు మాత్రం ఒకటి, రెండు సార్లు గట్టిగా "అక్షరాలు కనిపించడం లేదు సార్" అనేసి, తర్వాత నోట్స్ లు బ్యాగ్ లలో సర్దేసి కబుర్లు చెప్పుకునేవారు. ముందువరస లో కూర్చునే మాకు మాత్రం మహా ఇబ్బందిగా ఉండేది. మా లెక్కల సార్, మా పుస్తకాల్లోకి తొంగి చూసి మరీ "రాసుకున్నారా?" అని రెట్టించి అడిగేవారు. కొంతమంది, బోర్డు మీద రాసింది సరిగ్గా కనపడక, నోట్స్ లు చేతిలో పట్టుకుని క్లాసు మొత్తం అటూ, ఇటూ తిరుగుతూ రాసుకునే వాళ్ళు. 


మా తిప్పలు గమనించిన మా లెక్కల సార్, "మీకు, SUPW కానీ, వీవింగ్ కానీ ఉన్నప్పుడు, కొంచెం బోర్డు కు ఆకు పుయ్యండ్రా, అక్షరాలు సరిగ్గా కనపడతాయి." అనే వారు. SUPW సెక్షన్ లో మాకు ఎప్పుడూ, ఏమీ చెప్పిన పాపాన పోలేదు. నోట్ పుస్తకాల్లో, పిచ్చి బొమ్మలు వేసుకోవడమో, సినిమా కథలు చెప్పుకోవడమో చేసేవాళ్ళం.అసలు, ఏమి నేర్పించే ఉద్దేశ్యం తో ఆ సెక్షన్ పెట్టారో, అప్పుడే కాదు, ఇప్పుడు కూడా నాకు తెలియదు. వీవింగ్ క్లాసులు మాత్రం, మెయిన్ బిల్డింగ్ కు పక్కన ఉన్న ఇంకో చిన్న బిల్డింగ్ లో జరిగేవి. జరగడం అంటే, వీవింగ్ సార్ మమ్మల్ని వరండాలో కూర్చోపెట్టేవారు. లోపల గదిలో మగ్గాలు, వాటికి వేలాడుతూ రకరకాల దారాలు ఉండేవి. ఎందుకో తెలియదు కానీ, ఆ రూం కు తాళం కూడా ఉండేది. మమ్మల్ని ఒక్కరోజు కూడా మగ్గం ముట్టుకోనిచ్చేవాళ్ళు కాదు. మేము బయట వరండాలో కూర్చుని,  లోపల ఉన్న మగ్గాల్ని, బోనులో ఉన్న జంతువుల్ని చూసినట్లు చూస్తూ ఉండేవాళ్ళం. ఈ రెండు క్లాస్సుల్లో మేము నేర్చుకుని ఉద్ధరించేది ఏమీ లేదు కాబట్టి, బోర్డు కు ఆకు పూసే కార్యక్రమం అప్పగించారు, మా లెక్కల సార్. 


బోర్డు కు ఆకు పూయడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం, బోర్డు ను నల్లగా, గరుకుగా తయారు చెయ్యడం. దీనికి కావాల్సిన ముడి పదార్థాలు - సుంకేసుల చెట్ల ఆకులు (ఏ చెట్టు ఆకు అయినా సరిపోతుందేమో, ఆ చెట్లు మా స్కూల్ కాంపౌండ్ లో ఉండడం వల్ల, ఆ ఆకులు వాడేవాళ్ళం.), బొగ్గులు. దస్తగిరి, దాదాపు తొమ్మిదో తరగతి మధ్యలో మా క్లాసు కు వచ్చాడు. అంతవరకూ, మేము బోర్డులో మూడొంతులు మాత్రమే నలుపు చెయ్యగలిగే వాళ్ళం. అందరికీ, చేతులు అంతవరకే అందేవి. దస్తగిరి పొడవు కాబట్టి మాకు ఆ సమస్య కూడా తీరిపోయింది. ఇక రెండో సమస్య బొగ్గులు. 

ఈ కార్యక్రమానికి బొగ్గులు చాలానే కావలసి వచ్చేవి. బోర్డు కు నలుపు రంగు వచ్చేది బొగ్గుల వాడకం వల్లనే. ఆకు, కేవలం గరుకుదనానికి వాడేవాళ్ళం. స్కూల్ బయట మొక్కజొన్న పొత్తుల బండ్ల దగ్గర కొన్ని బొగ్గులు సంపాదించినా, ఇంకా కావాల్సి వచ్చేవి. దీనికీ, దస్తగిరి ఒక ఉపాయం చెప్పాడు. మా స్కూల్ వెనకవైపున (స్టేడియం దగ్గర) ఒక లాండ్రీ షాప్ ఉండేది. వాళ్ళ దగ్గరికి వెళ్లి అడుగుదామని.అలాగే, కొంతమందిమి వెళ్లి అడిగాము కూడా. స్కూల్ పిల్లలు అడిగేసరికి వాళ్ళు కూడా వెంటనే ఇచ్చేవాళ్ళు. 


సుంకేసుల చెట్లు మా స్కూల్ లోనే ఉండడం వల్ల వాటికేమి ఇబ్బంది లేదు. ఆ చెట్టు ఆకులు పలుచగా, చిన్నగా ఉండేవి. చెట్టుకు కాసే కాయలు (అవును, కాయలే) మాత్రం లోపల గింజలతో  మోచేతి పొడవు, రెండు, మూడు వేళ్ళ వెడల్పు ఉండేవి. ఎండి రాలిపోయిన కాయలు, అటూ, ఇటూ కదిపితే, ఎండిన గింజల వల్ల గల, గలా శభ్దం వచ్చేది. ఎన్టీఆర్, కాంతారావు జానపద సినిమాలు చూసిన ప్రభావంతో   ఇంటర్వల్ లో, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో ఈ కాయలతో మేము కత్తియుద్ధం చేసేవాళ్ళం. ఎవరి చేతిలోని కాయ విరిగిపోతే, వాళ్ళు ఓడిపోయినట్లు లెక్క.


బోర్డు కు ఆకు పుయ్యాలంటే, కనీసం నలుగురైదుగురు కావాల్సి వచ్చేది. ఇది నాజూకుగా చేసే పని కాకపోవడం, పని పూర్తైన తర్వాత అందరి చేతులు నల్లగా, అసహ్యం గా తయారవడంతో ఎవరూ ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అందరిని కూడగట్టే పని దస్తగిరికి అప్పగించేవాన్ని. ఏం మంత్రం వేసేవాడో కానీ, నేను పిలిస్తే మొహమాటానికైనా వస్తామని అనని వాళ్ళు, కనీసం ఇంకో నలుగురైనా వచ్చేవాళ్ళు. తర్వాత తెలిసింది, మర్యాదగా ఒప్పుకోని వాళ్ళను, దస్తగిరి బెదిరించేవాడట. "వచ్చి బోర్డుకు ఆకు పూస్తారా? లేకపోతే మీ సైకిల్ టైర్ లలో గాలి తీసేసి, వాల్ట్యూబ్ లు తీసుకెళ్ళాలా? అని". టైర్లలో గాలి పోతే, పదిపైసలిస్తే గాలికొడతారు కానీ, వాల్ట్యూబ్ పోతే మాత్రం అర్ధరూపాయి దాకా ఛార్జ్ చేసేవాళ్ళు. ఈ హింస భరించలేక చచ్చినట్లు ఒప్పుకునేవాళ్ళు. 


బొగ్గులు, సుంకేసుల ఆకులు కలిపి ముద్దగా నూరి, ఆ ముద్దను, బోర్డు కు పూసే వాళ్ళం. మరుసటిరోజు ఉదయం స్కూల్ కు వచ్చేసరికి నిగ,నిగలాడుతూ బ్లాక్ బోర్డు రెడీ. నోట్స్ రాసుకోకుండా తిరిగే వాళ్లకు మాత్రం, తప్పించుకునేందుకు మరో సాకు దొరికేది కాదు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం మాకు భలే సరదాగా ఉండేది. 


ఈమధ్యన మా ఆఫీసు లో మీటింగ్ లు, ప్రెజంటేషన్లు బాగా ఎక్కువైపోయాయి. ప్రస్తుతం ఆఫీసుల్లో వాడే వైట్ బోర్డులు, ప్రొజెక్టర్ లు, వాటి హడావిడి చూసినప్పుడు, మేము బ్లాకుబోర్డును నలుపు చెయ్యడానికి పడ్డ కష్టాలు గుర్తుకొస్తుంటాయి.





జూలై లో ఇండియాకు వెళ్ళినప్పుడు, మా స్కూల్ బోర్డు ఫోటో తీసుకున్నాను. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా చేర్చారట. కానీ, మా క్లాసురూంలన్నీ పడగొట్టి, కొత్త బిల్డింగ్లు కట్టించారు. పాత జ్జ్ఞాపకంగా   మిగిలింది ఈ బోర్డు ఒక్కటే.

~శశిధర్ సంగరాజు.

Sunday, December 12, 2010

నాగబాబు ఆవేదన - నిజమేనా?

ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు, సినీ రంగంలో నిర్మాతలకు విలువ లేదనీ, సినిమా నిర్మాణం లో తమ మాట చెల్లడం లేదనీ, అందరూ కలసి నిర్మాతను నాశనం చేస్తున్నారనీ ఆక్రోశం వెలిబుచ్చారు. కానీ, కొంచెం లోతుగా ఆలోచిస్తే, నాగాబాబుది నిజమైన ఆవేదనా?లేక మనసులో ఏదో పెట్టుకుని వెళ్ళగక్కిన కడుపు మంటా అన్న అనుమానం కలుగుతోంది. 

పెద్ద నిర్మాతలమైన తమ పరిస్థితే ఇలా ఉంటే, చిన్న నిర్మాతల గతి ఏమిటని ఆయన వాక్రుచ్చారు. కాకపోతే, ఒకటి ఆయన ఈమధ్యన తీసిన "ఆరంజ్" అనే కళాఖండం బాక్సాఫీస్ దగ్గర బోర్లా పడ్డం, తద్వారా కోట్ల రూపాయలు నష్టం రావడంతో, ఆ బాధ తట్టుకోలేక, ఇలా చిన్న నిర్మాతల సంక్షేమం అన్న అంశాన్ని తెరపైకి తెచ్చారనేది నిర్వివాదాంశం.  

రాష్ట్రం లోని మెజారిటీ థియేటర్లను తమ గుప్పిట్లో పెట్టుకుని, చిన్న సినిమాలను కనీసం విడుదల చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా, చిన్న నిర్మాతల ఉసురు పోసుకుంటున్నది  ఈయన లాంటి పెద్దచేపలే అన్న విషయం మరచిపోయి ఎవరిమీదో అభాండాలు వెయ్యడం ఎంతవరకు సబబు?

నాగబాబు ఒక టివి ఛానల్ చర్చాకార్యక్రమం లో పాల్గొన్నారు. తాను ఎవరినీ విమర్శించడం లేదంటూనే, టెక్నీషియన్ల వల్లనే సినిమా నిర్మాణం ఆలస్యం అవుతోందని, బడ్జెట్ అదుపు తప్పి పోతోందనీ చెప్పారు. అసలు క్రేజీ కాంబినేషన్ కోసం పాకులాడి (ఆంటే, ఎలక హీరో, పిలక హీరోయిన్, తోక డైరెక్టర్ ) అవసరం ఉన్నా, లేకున్నా కోట్లు కుమ్మరించి నిర్మాణ వ్యయం పెంచుకునేది వీళ్ళే. ఆ కార్యక్రమ చూసాక, "ఆరంజ్" సినిమా చూసాను. అంతవరకూ చూసే సాహసం చెయ్యలేదు. సినిమా చూసాక అనిపించింది, ఇది మామూలు మనుషులకు ఎక్కే సినిమా కాదని. ఇంతోటి సినిమా ఇందిరా పార్క్ లో తీసినా సరిపొయ్యేది. ఆస్ట్రేలియా కు వెళ్ళడం ఎందుకు? 


ఈ సినిమా అనేకాదు, విదేశాల్లో సినిమా షూటింగ్ చెయ్యడం ఒక అంటురోగంలా తయారైంది. కథకు సంబంధం ఉంటే అదో విషయం.హీరోయిన్ ముగ్గుపిండి, హీరో తాటిముంజెలు అమ్ముకుంటుంటారు. వీళ్ళిద్దరి డ్రీంసాంగ్ ఆల్ఫ్ పర్వతాల్లోనో, నయాగరా జలపాతం పక్కనో చిత్రీకరిస్తారు. పైగా జిగేల్మనే డ్రెస్సులు (ఇవి కేవలం హీరో కాస్ట్యుం లు మాత్రమే, హీరోయిన్ కు ఎప్పుడూ గుడ్డ పేలికలే, అదృష్టం బాగుండి, వీళ్ళ షూటింగ్ లు జరిగే ప్రదేశంలో కాస్త చలి ఎక్కువగా ఉంటే, ఇంకొన్ని గుడ్డ పేలికలు చుట్టబెడతారు అంతే). కలలు గొప్పగా ఉండొచ్చు, తప్పు లేదు కానీ, మరి అన్ని కోట్లు ఖర్చు చేసి రిచ్ గా తియ్యాలనుకున్నప్పుడు రిస్క్ కూడా ఉంటుంది. కేవలం డైరెక్టర్ ను విమర్శించడం మంచిది కాదు. కథ అద్భుతం గా ఉంటే, విదేశాల్లో చిత్రీకరించే పాటలు అదనపు ఆకర్షణ అవుతాయి కానీ, అసలు కథ లో పట్టులేకపోతే ఆస్ట్రేలియా లో తీసినా, ఆముదాలవలస లో తీసినా ఒకటే.


అదే, "ఆరంజ్" ఘనవిజయం సాదించి ఉంటే అప్పుడు కూడా నిర్మాణ వ్యయం పెరిగిందనీ, ఆలస్యం చేసారనీ, అనేవాళ్ళా? మెగా పవర్ స్టార్ కు హ్యాట్రిక్ విజయం అని విజయోత్సవాలు నిర్వహించే వాళ్ళేగా?మగధీర కూడా కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా.విజయం కూడా అదే స్థాయిలో దక్కింది కదా?


చిత్ర నిర్మాణం,  నిర్మాతగా మీకు నిజంగా సంత్రుప్తినివ్వకపోతే, ఆ డైరెక్టర్ ను మార్చడమో, అనవసరమైన ఖర్చును అదుపు చెయ్యడమో ఎంత పని?ఏమో, ఆడుతుందేమో అన్న ఆశ. ఫలితం మాడు పగిలేలా ఉంటే మాత్రం ఓర్చుకోలేరు.

మీరూ గాంబ్లింగ్ ఆడుతున్నారు, దానికి నిర్మాతలను బతకనివ్వడం లేదని మీడియా ముందు గొంతు చించుకోవడం దేనికి?

~శశిధర్ సంగరాజు. 

Friday, December 3, 2010

" ధర్నాంధ్ర" ప్రదేశ్

టైటిల్ చూసి కంగారు పడకండి, దేవుడి దయవల్ల ఆంధ్ర ప్రదేశ్ ఇంకా పేరు మార్చుకోలేదు. కానీ, ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఆ రోజు కూడా ఎక్కువ దూరంలో లేదు. 

అవును, ప్రస్తుతం రాష్ట్రం లో పలు సంఘాలు/గ్రూపులు/రాజకీయ పక్షాలు/జేఏసి లు కలసి గానీ, విడివిడిగా కానీ  ధర్నాలకు పిలుపునిచ్చాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ ధర్నాలు దాదాపు 17 దాకా ఉన్నాయి. వాళ్ళు , వీళ్ళు అని తేడా లేకుండా, దాదాపు అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదే ఉన్నారు. అప్పటికీ, కొత్త ముఖ్యమంత్రి (ప్రతిపక్షాల భాషలో మూడో కృష్ణుడు)ఉద్యోగసంఘాలను బతిమాలో, బామాలో కొంత (ఆంటే 15 రోజులు ) గడువు   పొందారు. కొత్త ప్రభుత్వం కాబట్టి సర్దుకోడానికి కాస్త టైం ఇస్తామనీ, తర్వాత కూడా డిమాండ్లు తీర్చక పొతే, మళ్లీ ధర్నాలు మొదలెట్టి ఇంకా ఉధృతం చేస్తామనీ ఉద్యోగ సంఘాలు ఆల్టిమేటం ఇచ్చాయి. 

సరే, ప్రజాస్వామ్యంలో తమ నిరసనలు తెలియ చేయడానికి ధర్నా చెయ్యడం ఒక విధానం. ఒప్పుకుంటాం. కానీ, ఈ మధ్య ధర్నాలు కొన్ని సందర్భాల్లో మరింత చికాకు కలిగిస్తున్నాయి. ధర్నాల వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నా, ఎవరికి చెప్పుకోవాలో తెలియని వర్గం ఒకటుంది. వాళ్ళే , స్కూల్ పిల్లలు.  

ఈ మధ్య టీవీ లో చూసాను.కొన్ని విద్యార్ధి సంఘాలు ధర్నాల పేరిట స్కూల్లకు వెళ్లి పిల్లలను క్లాసు లు బహిష్కరించమని ఇబ్బంది పెడుతున్నాయట. ఆ టీవీ వాళ్ళు, పిల్లల ఇంటర్వ్యూ లు కూడా ప్రసారం చేసారు. ఆ పిల్లల తిప్పలు చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. 

ఒక అబ్బాయైతే, ఈ సంవత్సరం తనది పదో తరగతి అనీ, ఈ ధర్నాల మూలంగా క్లాసు లు సరిగ్గా జరగడం లేదనీ, ఇలాగైతే పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలో తెలియడం లేదనీ వాపోయాడు. ఇంకో అమ్మాయిది మరీ ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులట. ఉదయం పిల్లలను స్కూల్ల కు  పంపి వాళ్ళు ఇంటికి తాళం వేసేసి తమ ఉద్యోగ నిమిత్తం  బయటకు వెళ్లి పోతారట. మళ్లీ తిరిగిరావడం, పిల్లలు స్కూల్ నుంచి తిరిగి వచ్చే సమయానికి.ధర్నాల మూలంగా, స్కూల్ అర్ధాంతరంగా అయిపోవడంతో, ఇంటికి తిరిగి వెళ్ళే తాము ఒంటరిగా ఉండాల్సి వస్తోందనీ  తద్వారా మానసిక ఒత్తిడికి గురవుతున్నామనీ చెప్పింది. మహానగరాల్లో తల్లి ఒకవైపు, తండ్రి ఒకవైపు ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు వెంటనే పనులు మానుకుని ఇంటికి రావడం కూడా సాధ్యం అయ్యే పని కాదు. చాలామంది విద్యార్థులు, ఈ ధర్నాల మూలంగా విద్యాసంవత్సరం కోల్పోయే పరిస్థితి కూడా ఎదురవుతుంది.


మా బంధువులబ్బాయి హైదరాబాద్ లో ఒక కార్పోరేట్ విద్యా సంస్థలో చదువుతున్నాడు. అన్నివిద్యా సంస్థలలో ఉన్నట్లే, వాళ్ళ కాలేజ్ లో కూడా ఎక్కువగా యూనిట్ టెస్ట్ లు వగైరా జరుపుతుంటారు. కానీ, ఈ సారి మాత్రం, డిసెంబర్ 6  (బ్లాక్ ఫ్రైడే ) న  , డిసెంబర్ 31  (తెలంగాణా పై శ్రీ కృష్ణ కమిటి ప్రకటన) తర్వాత  జరిగే ఆందోళనల్లో క్లాసులు  ఎలాగూ జరగనివ్వరు కాబట్టి, ప్రస్తుతానికి టెస్ట్ లు పక్కన పెట్టి, హడావిడిగా సిలబస్ పూర్తి చెయ్యడం పై దృష్టి పెట్టారట. 

ధర్నాలు, రాస్తారోకోలవల్ల సామాన్య ప్రజానీకం ఎలాగూ ఇబ్బందులు పడుతున్నారు. కనీసం, స్కూల్ పిల్లలనైనా మినహాయించాలని నా అభిప్రాయం. 

మీరేమంటారు.

~ శశిధర్ సంగరాజు.