Powered By Blogger

Sunday, October 31, 2010

లూయివిల్ లో బాలల సాంస్కృతిక కార్యక్రమాలు ....

మా ఊర్లో (లూయివిల్ ) సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పిల్లలను ఎంకరేజ్ చేయడానికి చిన్న రైట్అప్ రాస్తున్నాను. ఈ వార్తను ఈనాడు కు కూడా పంపడం జరిగింది. లింక్ ఇస్తున్నాను. http://www.eenadu.net/story.asp?qry1=28&reccount=29
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
కెంటకి రాష్ట్రం లోని లూయివిల్ లో బాలల దినోత్సవం సందర్భం గా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.
కెంటకియాన తెలుగు సంఘం ఆధ్వర్యం లో "ఆటల పాటల సాయంత్రం" పేరుతొ జరిగిన ఈ కార్యక్రమం లో చిన్నారులు చేసిన నృత్యాలు అందరిని అలరించాయి.
కార్యక్రమానికి రఘు కొడుమూరి,రాధిక వేమ్మిరెడ్డి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. చిన్నారులు ప్రదర్శించిన "బృందావనం" నృత్యరూపకం ఆహూతుల మన్ననలు పొందింది. డాక్టర్ రాజశేఖర్ లక్కరాజ్ ఆలపించిన ఘంటసాల సినీ గీతాలు అందరిని అలరించాయి. తెలుగు జానపద గీతాలకు అమెరికన్ యువతులు చేసిన నృత్యం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
ఏడు సంవత్సరాల "సూపర్ జీనియస్ కిడ్" మాస్టర్ ప్రణవ్ తన అసాధారణ ప్రతిభ తో ప్రేక్షకులను ఆశ్చర్యం లో ముంచెత్తాడు. ఈ అబ్బాయి ధారణ శక్తి  ప్రముఖ శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ కన్నా ఎక్కువనీ, పది లక్షల మంది లో ఒక్కరికి ఇలాంటి సామర్థ్యం ఉంటుందని నిర్వాహకులు తెల్పారు (ఈ అబ్బాయి గురించి , మరో పోస్ట్ విడిగా రాయాలని ఉంది. తప్పకుండా రాస్తాను.) సంస్థ చైర్మన్ డాక్టర్ సురేష్ కొడాలి విజేతలకు బహుమతి ప్రధానం చేసారు.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~













Friday, October 29, 2010

హాలోవీన్ వచ్చేసింది...

నార్త్ అమెరికా (అమెరికా, కెనడా), యూరప్ లలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 31 (ఈ సంవత్సరం ఆదివారం రోజు)న హాలోవీన్ జరుపుకుంటారు. పిల్లలు, పెద్దలు రక రకాల కాస్ట్యుంలు ధరించి సందడిగా గడిపేస్తారు. అసలీ హాలోవీన్ ఏమిటో, ఈ విచిత్ర వేషధారణ వెనకాల ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం. 

కథ కమామీషు: 
దశాబ్దాల నాటి చరిత్ర ఉన్న ఈ హాలోవీన్ యూరప్ లో మొదలైంది. అక్కడి వారికి ఒక నమ్మకం/మూఢ నమ్మకం ఉండేది. హాలోవీన్ రోజున, చనిపోయిన వారి ఆత్మలు భూమి మీదకు వస్తాయని. సరే, వచ్చిన ఆత్మలు ఊరికే ఉండవు కదా? తమ ఇళ్ళ దగ్గరకు వచ్చి పట్టి పీడిస్తాయని వీరి నమ్మకం. అందుకని, ఆ ఆత్మలు తమను గుర్తు పట్టకుండా, రక రకాల వేషాలు, మొహాలు కనపడకుండా మాస్కులు ధరించి, తమ ఇళ్ళ నుంచి బయటకు వచ్చి గుంపులు గుంపులు గా తిరిగేవాళ్ళు (ట). యూరోపియన్లు అమెరికా కు వలస వచ్చిన తర్వాత ఈ సాంప్రదాయం ఇక్కడ కూడా మొదలైంది.  

దాదాపు నెల రూజుల ముందు నుంచే, షాపుల్లో వెరైటీ  కాస్ట్యుంలు అమ్ముతుంటారు. పిల్లలే కాదు, పెద్దలు కూడా ఈ కాస్ట్యుంలు ధరించి పార్టీలకు, పెరేడ్ లకు వెళతారు. 
కొన్ని ఆఫీసుల్లో ఉద్యోగుల మధ్య కాస్ట్యుం పోటీలు నిర్వహించి, బెస్ట్ కాస్ట్యుం కు ప్రైజ్ మనీ కూడా ఇస్తారు. 

ఇక పిల్లల హడావుడి కి అడ్డేముంది..సంవత్సరం ముందు నుంచే , వచ్చే హాలోవీన్ కు ఏయే కాస్ట్యుంలు కొనాలో ప్లాన్ చేసే చిచ్చర పిడుగులున్నారంటే అతిశయోక్తి కాదు. 

చెక్కిన గుమ్మడి కాయ ఆకారంలో ఉన్న ఇలాంటి ప్లాస్టిక్ బకెట్ లు పట్టుకుని "ట్రిక్ ఆర్ ట్రీట్" అంటూ పరుగులు పెడతారు. ఈరోజున తమ ఇళ్ళ దగ్గరకు వచ్చే చిన్నారులకు చాక్లెట్లు, కాన్డీలు, చిన్న చిన్న ఆట బొమ్మలు పంచి పెడతారు. ఇదే  "ట్రిక్ ఆర్ ట్రీట్".

మా ఇంటి దగ్గరున్న చర్చి ఆవరణలో పెరేడ్ జరుపుతారు. చర్చి వాలంటీర్లు పిల్లలు ఆడుకోవడానికి వీలుగా,  ఇంఫ్లేటబుల్స్ ఏర్పాటు  చేస్తారు. అందుకే, మా పిల్లలు కూడా చర్చి పెరేడ్ కు వెళ్ళడానికి బాగా ఇష్టపడతారు. 
సరే, ఇక టివి చానళ్ళు ఒక నెల రోజుల ముందు నుంచే  దడుచుకునే హారర్ సినిమాలు వేసి వాయించేస్తారు.


ప్రతి సరదా సందర్భం వెనుకా, ఒక ప్రమాదం ఉన్నట్లే (దీపావళి పండుగలో చేతులు కాల్చుకునే ప్రమాదం ఉన్నట్లు), ఇక్కడ కూడా ఒక సమస్య ఉంది. ముఖ్యం గా పిల్లలను "ట్రిక్ ఆర్ ట్రీట్" కు పంపేటప్పుడు.


అమెరికాలోని బ్లాగ్ మిత్రులకు కొన్ని సూచనలు:
1 ) పిల్లలను ఒంటరిగా పంపకండి.
2 ) అపరిచితుల ఇళ్ళకు, రోడ్డుకు కొంత దూరంగా, కాస్త విసిరేసినట్లు ఉండే ఇళ్ళకు అస్సలు పంపకండి. 
(అపరిచితుల ఇళ్ళ దగ్గరకు పెద్దల తోడు లేకుండా వెళ్ళిన పిల్లలు ఎదుర్కునే పరిస్థితులను టివి లలో చూపుతుంటారు. వాటి వివరాల్లోకి నేను వెళ్ళదలచుకోలేదు.) 
3 ) వీలున్నంత వరకూ, జనం బాగా ఉండే ప్రాంతాల్లో జరిగే పెరేడ్ లకు తీసుకెళ్ళండి. అదీ, పిల్లలను, మీ కనుచూపు మేరలో ఉండేలాగా చూసుకోండి. 
దీనికి, మేము కనిపెట్టిన ఒక ఉపాయం, మా పిల్లలను చర్చి పెరేడ్ కు కానీ, దగ్గరలోని మాల్ కు కానీ తీసుకెళ్లడం. మాల్ కు వెళ్ళడం వల్ల రెండు ఉపయోగాలున్నాయి. ఇక్కడ ఎక్కువ మంది ఉండడం ఒకటైతే ,ఎలాగూ, అక్టోబర్ చివరి వారం వచ్చే సరికి వాతావరణం బాగా చల్లబడి పోతుంది. మాల్ లో అయితే, సెంట్రల్ ఎయిర్ కండీషనర్ మూలంగా వెచ్చగా ఉండడం రెండోది. 
మీ దగ్గరలోని మాల్ లో సంప్రదించండి. "ట్రిక్ ఆర్ ట్రీట్" టైమింగ్స్ చెప్తారు.  

ఇండియా లో కూడా ఈమధ్య కాలం లో హాలోవీన్ సెలబ్రేట్ చేసుకుంటున్నారని విన్నాను. అది నిజమైతే,
మీకందరికీ , "హ్యాపీ హాలోవీన్"! 
ఎంజాయ్ చెయ్యండి మరి.

~శశిధర్ సంగరాజు.


Tuesday, October 26, 2010

'తిక్క'వరపు సుబ్బరామిరెడ్డి


 నేనెవరి గురించి రాస్తున్నానో మీకందరికీ తెలిసే వుంటుంది.   ఇంటి  పేరు లోనే 'తిక్క' ఉన్న ఈ పెద్ద మనిషి పిచ్చి ప్రేలాపన ఇప్పుడే టివి లో చూసాను. "తెలుగు లలిత కళా తోరణం" పేరు ను "రాజీవ్ తెలుగు లలిత కళా తోరణం" గా మార్చడం సమంజసం అన్నది ఈయన పిడివాదం. 

ఆంధ్రప్రదేశ్ లో కొన్ని దిక్కుమాలిన కళా/సాంస్కృతిక సంఘాలు ఉన్నాయి. వీళ్ళ పనేంటంటే, సమాజం లో బాగా స్థితి పరులైన కొందరు పెద్దలను కాకా పట్టి, వాళ్ళ డబ్బులతోనే వాళ్లకు సన్మానాలు చేస్తుంటారు. అలాంటి సంఘాలకు డబ్బులిచ్చి సుబ్బరామిరెడ్డి గారు "కళాబంధు" (నిజంగా రాబందు)లాంటి బిరుదులు కొనుక్కున్నారు. ఈయన కళా రంగానికి సేవచేసిన మాట నిజమే గాని, ఇలా డబ్బులిచ్చి డప్పు కొట్టించుకోవడం కూడా అంతే నిజం.

సరే, ఈయన ప్రతాపం కళా రంగానికి పరిమితమైతే బాగుండేది. ఉన్నట్లుండి సోనియమ్మ ను ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగా 10 కోట్లు విరాళం ఇస్తాను, లలిత కళా తోరణం పేరును మార్చి "రాజీవ్" ముందు తగిలించాలని అడగడం, దానికి రోశయ్య గారు వెంటనే బట్టతల ఊపడం జరిగి పోయింది. 


టివి షో లో యాంకర్ తో ఈయన వాగ్యుద్ధం ...అసలు "తెలుగు జాతి" అనేది లేదనీ, అదొక డైలాగ్ మాత్రమేనని.ఇది నిజంగానే పిచ్చికి పరాకాష్ట.


ఈ లెక్కన రాష్ట్ర అసెంబ్లీ కీ, హైకోర్టు కు కూడా రాజీవ్, ఇందిర ల పేర్లు పెడతారేమో ఖర్మ. అన్ని రాజకీయపార్టీలు (పార్టీలకు అతీతంగా) ఈ పేరు మార్పిడి ప్రోగ్రాం ను అడ్డుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.


సుబ్బరామిరెడ్డి గారు నమ్ముకున్న పరమేశ్వరుడు ఆయనకు సద్భుద్ది ప్రసాదించుగాక. 

ఈ ఉన్మాదాన్ని అందరూ ఖండించండి.

~ శశిధర్ సంగరాజు.

Friday, October 22, 2010

నన్నారి షర్బత్

కడప, ఏడురోడ్ల సెంటర్, ఈ పేరు వినగానే, ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలతో పాటు తప్పకుండా గుర్తుకొచ్చే మరో విషయం "బాషా కూల్ డ్రింక్ షాప్". అక్కడ దొరికే "నన్నారి షర్బత్" . ఈ నన్నారి అనే మాట రాయలసీమ వాసులకు సుపరిచితమే అనుకుంటాను. నన్నారి మొక్క వేళ్ళను ఉడికించి తయారు చేస్తారు. ఎండాకాలం లో వేడి తగ్గించే మంచి జ్యూస్. పరీక్షల టైమ్ లో మరీ.


ఏడురోడ్ల సెంటర్ నుంచి కృష్ణ - రమేష్ థియేటర్లకు వెళ్ళే దారిలో ఎడమ వైపు కార్నర్లో ఉండేది బాషా షాపు. మామూలు కూల్ డ్రింక్ షాపే. కానీ, ఎండాకాలం లో దాదాపు ప్రతి రోజు మాకు సేద తీర్చే అడ్డా. 

సంవత్సరం పరీక్షలు  రాసి,  మధ్యాహ్నం ఇంటికి వెళ్ళేటప్పుడు నలుగురైదుగురం స్నేహితులం షాప్ దగ్గర ఆగేవాళ్ళం. బాషా అసలు పేరు ఏమిటో నాకు తెలీదు. అందరూ బాషా అనే పిలిచేవాళ్ళు. మేము పిల్లలం మాత్రం "అన్నా" అని పిలిచేవాళ్ళం.

సైకిళ్ళు స్టాండ్ వేసి, వెనకాల క్యారియర్ మీద కూర్చుని, "అన్నా, నన్నారి" అని ఆర్డరు చేసేవాళ్ళం. అప్పుడు బాషా "పరీక్షలు బాగా రాసారా?" అని అడుగుతూ  నన్నారి ప్రిపరేషన్ మొదలెట్టే వాడు. 

 నన్నారి ప్రిపరేషన్: 


ముందుగా, ఫ్రీజర్ లోంచి ఐస్ బ్లాక్ తీసి, తన చేతులు మొద్దు బారకుండా , శుభ్రమైన బట్టతో పట్టుకునేవాడు. బాషా ఎదురుగా స్టీల్ బ్లేడు బిగించిన చెక్క ఫ్రేం ఉండేది. ఐస్ బ్లాక్ ను ఆ బ్లేడ్ కు ఎదురుగా చెక్కేవాడు, కొబ్బరి తురుము లా. చెక్క కు ఉన్న కన్నం లోంచి ఐస్, పొడి, పొడి గా కింద ఉంచిన గ్లాసుల్లోకి పడేది.  సగం వరకు ఐస్ పొడి నిండిన ఆ గ్లాసుల్లోకి, డార్క్ చాకలేట్ రంగులోని , నన్నారి మిశ్రమాన్ని కలిపేవాడు. దానికి పంచదార, అరచెక్క నిమ్మ రసం  జత చేరేవి. గ్యాస్ తో నిండిన గోళీ సోడాను కొట్టి , గ్లాసుల్లోకి పోసేవాడు. సోడా తో కలసిన నన్నారి లేత గోధుమ రంగులోకి మారి, బుస, బుస మని పొంగేది. 
అసలే, కడప ఎండలు, పైగా పరీక్షల టెన్షన్. గ్లాసును నోటి దగ్గరకు చేర్చగానే, సోడా గ్యాస్ వల్ల ఎగిరే నీటి తుంపరలు పెదవులకు తగిలి గిలిగింతలు పెట్టేవి. నన్నారి తాగుతూ, రేపటి పరీక్ష కు ఎలా ప్రిపేర్ కావాలో డిస్కస్ చేసుకునే వాళ్ళం. 

నేను కడప వదిలేసి దాదాపు 15 సంవత్సరాలైంది. ఆ నన్నారి రుచి ఇంకా గుర్తుంది. అమెరికాలో దానికి ఒక ప్రత్యామ్నాయం కనిపెట్టాను. ఇక్కడ "రూట్ బీర్" (నా శీలాన్ని శంకించక్కర్లేదు. ఇది సాఫ్ట్ డ్రింక్. )    అనే డ్రింక్ దొరుకుతుంది. నన్నారి బదులు,  ఈ డ్రింక్ కూడా వాడొచ్చు. కానీ, నన్నారి షర్బత్ కు ఏదీ సాటి రాదు. 


6 సంవత్సరాల తర్వాత, జూలై లో కడప కు వెళ్ళాను. ఏడు రోడ్ల సెంటర్ లో బాషా షాప్ కనపడలేదు. మా నాన్న గారిని అడిగాను. రోడ్లు వెడల్పు చేసేటప్పుడు కొన్ని షాపులను తీశేసారని చెప్పారు. బాషా ఏమయ్యాడని ఎవరినీ అడగలేదు. ఏం వినాల్సొస్తుందోనని. 

కడపను సింగపూర్ చెయ్యాలని, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి, ఆయన మేయరు బామ్మర్ది
ప్రయత్నించిన కారణంగా, కాంట్రాక్టర్లు రోడ్లన్నీ తవ్వేసారు. ఇంకా రాళ్ళగుట్టలు అలాగే
ఉన్నాయి.  ఊర్లో కొన్ని చోట్ల మరీ దారుణం.

వీళ్ళు  కడపను సింగపూర్ చేస్తే సంతోషించేవాళ్ళల్లో నేనూ ఒకడిని. కానీ, కాంట్రాక్టర్లు పనిని సగంలో ఒదిలేస్తే మాత్రం, పరిస్థితి అదేదో సామెత లాగా ( "ఉన్నదీ పోయి, ...." ) అవుతుంది. సామెత నేను పూర్తి చేయక్కర్లేదు. మీకు తెలుసు.


నన్నారి షర్బత్ ట్రై చెయ్యడం మర్చిపోకండి.

~ శశిధర్ సంగరాజు.




Sunday, October 17, 2010

థాంక్స్

ఇటీవలె కూడలి నుంచి ఈమెయిలు వచ్చింది. నా బ్లాగ్ ను కూడలి లో చేర్చారని.
నాకు కూడలి ని పరిచయం చేసి, నా బ్లాగ్ ను కూడలి కి పంపేలా ప్రోత్సహించిన 
 శ్రీదేవి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 


కలసి పనిచేసి (ఈటీవి లో) దాదాపు 14 సంవత్సరాలైనా , నేను బ్లాగ్ ఓపెన్ చేసి, రాయడం మొదలు పెట్టానని 
 తెలిసి ప్రోత్సహిస్తున్న విజయ్ కుమార్ (ఆయన జర్నలిజం స్కూల్ లో నాకు సీనియర్ , ప్రస్తుతం  "జర్నో ముచ్చట్లు" బ్లాగ్ నిర్వాహకులు)గారికి మెనీ థాంక్స్.










అమెరికా లో ఫాల్ కలర్స్

ఈ సంవత్సరం సెప్టెంబర్ 22 నుంచి ఫాల్ / ఆటం మొదలైంది. ఈ కాలం లో చెట్లు తమ ఆకుల రంగులను క్రమ క్రమం గా మార్చుకుని చివరికి రాలి పోతాయి. అందరికీ తెలిసిన విషయమేగా , ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా- చిన్నప్పుడు సైన్సు క్లాసు లో చదువుకునే ఉంటాం ఫోటో సింథసిస్ గురించి.మరోసారి గుర్తు చేసుకుందాం. 

చెట్లు తమ వేళ్ళ ద్వారా భూమి లోని తేమనీ , పర్యావరణం లోని కార్బోన్ డై ఆక్సైడ్ ని గ్రహిస్తాయి. సూర్యరశ్మి ని ఉపయోగించి తేమనీ , కార్బోన్ డై ఆక్సైడ్ నీ, ఆక్సిజన్ , గ్లూకొస్ లు గా మార్చు కుంటాయి. ఈ ప్రక్రియనే ఫోటో సింథసిస్ అంటారు. ఫోటో సింథసిస్ జరగడానికీ, చెట్ల ఆకులు ఆకు పచ్చ గా ఉండడానికీ క్లోరోఫిల్ అనే రసాయనం ప్రధాన కారణం. (కింది ఫోటో చూడండి).

ఫాల్ / ఆటం లో చెట్ల ఆకుల రంగులో మార్పెలా వస్తుంది?
ఎలాగంటే, ఎండాకాలం అయిపోయి, ఆకు రాలే కాలం వచ్చిన తర్వాత, పగటి పూట ఎండలో తీక్షణత  తగ్గుతూ వస్తుంది. తగినంత సూర్యరశ్మి లేకపోవడం వల్ల ఫోటో సింథసిస్ ప్రక్రియ మందగిస్తుంది. తద్వారా చెట్ల ఆకులు ఆకుపచ్చ రంగును కోల్పోయి, పసుపు, ఎరుపు, వంగ, నారింజ రంగుల్లోకి మారతాయి. ఇవ్వాళ మా ఇంటి దగ్గర కొన్ని చెట్ల ఫోటో లు తీసాను. చూడండి రంగులు ఎలా ఉన్నాయో. 
ఇండియా లో ఉన్నప్పుడు , ఇన్ని రకాలుగా ఆకులు రంగు మారడం ఎప్పుడూ చూడలేదు. బహుశా, ఉష్ణోగ్రతల్లో పెద్ద తేడాలు ఉండక పోవడం కూడా కారణమై ఉండొచ్చు.

 ఉష్ణ ప్రాంతాలైన దక్షిణాది రాష్ట్రాల్లో ఎండా కాలానికీ, ఆకురాలే కాలానికి మధ్య ఉష్ణోగ్రతా భేదాలు ఎక్కువగా ఉండవు.


 


అమెరికా లో, వీకెండ్స్ లో ఫాల్ కలర్స్ చూడడానికి వెళ్ళడం ఒక ఆట విడుపు. కొన్ని వందల మైళ్ళు డ్రైవ్ చేసుకుని వెళ్లి , కలర్స్ చూసి వస్తుంటారు. మా ఊరికి దగ్గర్లో "గ్యాటలిన్ బర్గ్ " అనే ప్రాంతం, ఈ ఫాల్ కలర్స్ కి బాగా ప్రసిద్ది.  మళ్ళీ డిసెంబర్ 21 నుంచి చలికాలం మొదలవుతుంది. మంచు, చలి. అదొక అందం. 


                            (ఈ ఫోటో, లూయీవిల్ కు దగ్గర్లోని " బెర్న్ హైమ్ ఫారెస్ట్  " లో  తీసింది. )  



ప్రకృతి సృష్టించే ఈ రంగుల కాన్వాస్ ను, పునఃసృష్టి చేయడం, ఎంత చేయి తిరిగిన చిత్రకారుడికైనా అసాధ్యం అంటే అతిశయోక్తి కాదేమో!

చెట్లన్నీ కొట్టేస్తే, ముందు తరాలకు ఈ అందాలన్నీ దూరమైపోతాయి.
మరి మీ వంతుగా మొక్కలను నాటి, పర్యావరణ సమతుల్యానికి పాటుపడతారు కదూ?

ప్రయత్నించండి.

~ శశిధర్ సంగరాజు.


 


Saturday, October 16, 2010

దసరా శుభాకాంక్షలు .

నా బ్లాగ్ ను సందర్శిస్తున్న  మిత్రులందరికీ , విజయదశమి శుభాకాంక్షలు. 




~ శశిధర్ సంగరాజు.

Friday, October 15, 2010

అమెరికా లో డాక్టర్ అపాయింట్మెంట్

ఈమధ్యన రెగ్యులర్ చెకప్ కోసం , డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవలసి వచ్చింది. అమెరికా లో డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవడం అనేది ఒక పెద్ద ప్రహసనం.  మీకందరికీ తెలిసే ఉంటుంది, ఇండియా లో చాలా మంది డాక్టర్ లు ఉదయం 8 నుంచి 12 దాకా, మళ్లీ సాయంత్రం 4 నుంచి 8 దాకా పనిచేస్తారు. మనం ఆఫీసు లో పర్మిషన్లు, సెలవులు తీసుకోనక్కరలేదు .అమెరికా లో మాత్రం, డాక్టర్ లు  చాలా మంది 8  నుంచి 4 వరకే పేషంట్లను చూస్తారు. సరే, అవసరం వచ్చినప్పుడు తప్పదు కదా అని , ఆఫీసు లో పర్మిషన్ తీసుకుని వెళ్ళాను. 

డాక్టర్ పిలుపు కోసం ఎదురు చూస్తూ, అక్కడ నేను ఎదుర్కున్న పరిస్తితులను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.  


ఫ్రంట్ డెస్క్ లో ఉన్న నర్స్ "We need latest information , because its been an year since your last visit" అంటూ  పేషంట్ హిస్టరీ ఫోరం ఇచ్చింది. ప్రతి సంవత్సరం ఇది తప్పదురా బాబూ అనుకుంటూ ఫిల్ చెయ్యడం మొదలెట్టాను. ఆ చిత్రగుప్తుడి చిట్టా  పూర్తి చేయడానికి దాదాపు ఇరవై నిమిషాలు పట్టింది. ఇక్కడో ముఖ్యమైన విషయం - అపాయింట్మెంట్ టైం కు పదిహేను నిమిషాలు మీరు లేట్ గా వెళ్ళారా, ఇక అంతే సంగతులు. బిజీ డాక్టర్ అయితే, మీ అపాయింట్మెంట్ కాన్సిల్. కానీ, డాక్టర్ గారు మాత్రం ఆయనకు వీలున్నప్పుడు చూస్తారు. అవును, అవసరం మనది మరీ. 


ఒక విషయం మాత్రం ఒప్పుకుని తీరాలి, డాక్టర్ ఆఫీసు లో వెయిటింగ్ రూం లు మాత్రం శుభ్రంగా ఉంటాయి. 
వెయిటింగ్ టైం లో చదువుకోడానికి కొన్ని మేగజైన్ లు ఉంచారు. అవి కనీసం సంవత్సరం క్రితంవి. అట్టలు చిరిగి, నలిగి పోయి , నా సహనాన్నిపరీక్షించాయి.
 అక్కడ ఒక స్పోర్ట్స్ మేగజైన్ కోసం, నాకు, ఒక చైనీస్ ముసలామెకు జరిగిన పోరాటంలో పరిస్థితుల ప్రభావం వల్ల నేను ఓడి పోవలసి వచ్చింది. పోనీలే సీనియర్ సిటిజన్ కదా అని నన్ను నేను ఓదార్చుకున్నాను. (ఇది జగన్ ఓదార్పు కాదు, నిజమైనదే).

ఇంకో వైపు రక రకాలైన రోగాలు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి , రాకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి, లేదా చెయ్యకూడదు లాంటి వివరాలతో బ్రోషర్స్ పెట్టారు. అవన్నీ చదివారో , అవసరం లేని పరిజ్ఞానం పెరిగి, ఆ రోగాలు అన్నీనిజం గా మనకే ఉన్నాయేమోనన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది.  విషయ పరిజ్ఞానం మంచిదే కానీ, ఈ విషయం లో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. అందుకే వాటి జోలికి మాత్రం వెళ్ళలేదు. 


ఇలా, దాదాపు గంటసేపు తిప్పలు పడ్డాక, కలుగు లోంచి బయటపడ్డ ఎలుక లా,ఎక్కడినుంచో నర్స్ వచ్చిడాక్టర్ పిలుస్తున్నాడని చెప్పింది. Thank GOD  అనుకుంటూ, లోపలికి నడిచాను. 

చెకప్ పూర్తయింది. అంతా శుభం. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకూ ఈ వైపు వచ్చే అవసరం రాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తూ, బయట పడ్డాను. వచ్చే సంవత్సరమైనా కొత్త మేగజైన్స్ ఉంచుతారని ఆశ. 

చూద్దాం.


~ శశిధర్ సంగరాజు.








Wednesday, October 13, 2010

పాల్ హెన్రీ ...నోటి దురద తీరిందా?

ఆకాశం వైపు చూసి ఉమ్మేస్తే , అది మన మీదే పడుతుందన్నసత్యం..న్యూజిలాండ్ టీవీ యాంకర్ పాల్ హెన్రీ విషయం లో అక్షరాలా నిజమైంది. 

బహుశా రాత్రి హాంగోవర్ దిగలేదేమో, ఉదయం బ్రేక్ ఫాస్ట్ షోలో,
New Delhi ముఖ్య మంత్రి షీలా దీక్షిత్ పేరును వ్యంగంగా పలికి కొరివితో తల గోక్కున్నాడు. 
ఏదో, పలకడం చేతకాక పొరపాటున పలకడం కూడా కాదు, పదే, పదే దీక్షిత్ ను Dick-Shit అని పలకడం, పైపెచ్చు అదేదో పెద్ద జోక్ అయినట్లు వెటకారం గా నవ్వడం. ఈ ప్రబుద్ధుడికి గతంలో కూడా ఇలాంటి చేష్టలకు మొట్టికాయలు పడ్డాయి. అయినా ఇంకా బుద్ధి వచ్చినట్లు లేదు. 

మొత్తానికి, టీవీ యాజమాన్యమే పీకేసిందో , భారత దేశం వ్యక్తం చేసిన నిరసనకు జడిసో, లేక ప్రపంచ వ్యాప్తం గా న్యూజిలాండ్ పరువు పోతుందని భయపడో,  పాల్ హెన్రీ తన ఉద్యోగానికి రాజీనామా చేసాడు.టీవీ వాళ్ళు సంతోషం గా రాజీనామాను అప్రూవ్ చేసేసారు. 

చేతులు కాలాక, ఆకులు పట్టుకున్నట్లు, అయ్యగారు ఇప్పుడు తీరిగ్గా పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. తను చేసింది తప్పేనని, ఇకపై తానా ఉద్యోగం చెయ్యలేనని స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. 
ఈ విషయం లో ఒక్క పాల్ హెన్రీ యే కాదు, పశ్చిమ దేశాలకు ఇతర దేశాలను, వారి సంస్కృతిని అర్థం చేసుకునే సంస్కారం ఇంకా అలవడినట్లు కనిపించడం లేదు. హిందూ దేవీ, దేవతల బొమ్మలను చెప్పులమీదా, అండర్ వేర్ ల మీద ముద్రించడం, ఆనక హిందూ సంస్థల నుంచి నిరసనలు ఎదురైన తర్వాత, ఆ బొమ్మలను తీసేయడం వీళ్ళకు పరిపాటే. అందరినీ పాల్ హెన్రీ గాటన కట్టేయలేక పోయినా , చాలా మంది లో ఇంకా ఈ జాత్యహంకార ధోరణి సమసిపోలేదు.

వీళ్ళందరికీ మంచి సంస్కారం అబ్బాలని మున్నా భాయ్ లాగ "గెట్ వెల్ సూన్ " కార్డులు పంపిద్దాం.
వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు, మనకెందుకు  కార్డులు  దండగ అంటారా? అదీ పాయింటే.




~శశిధర్ సంగరాజు.














Sunday, October 10, 2010

ఐరావతాలు




ఐరావతం అంటే, దేవేంద్రుడి వాహనమైన ఏనుగు. ఈ ఏనుగు తెల్ల గా ఉంటుంది. వాడుక బాషలో, పోషించడానికి కష్టమైన వాటిని ఐరావతాలు అని అంటూ ఉంటారు. 
ఉదాహరణకు, పాతబడి రిపేర్లు ఎక్కువగా వస్తూన్న కార్లు, స్కూటర్లు మొదలైనవి.

అలాగే, తెలుగు సినీ పరిశ్రమలో కూడా కొన్ని ఐరావతాలు ఉన్నాయి. వీళ్ళ రెమ్యునరేషన్ కళ్ళు తిరిగే స్థాయి లో ఉంటాయి. వీళ్ళ సినిమాలు ఏళ్ళ తరబడి షూటింగులు జరుపుకుంటాయి. కానీ, ఫలితం మాత్రం ఆశించిన స్థాయి లో 
ఉండట్లేదు.

ఇటీవల విడుదలైన పులి బాక్స్ ఆఫీసు దగ్గర తీవ్రంగా గాయపడింది. ఈ సినిమా కు అయిన ఖర్చు దాదాపు 25 కోట్లకు పై మాటే. తగలెట్టిన కాలం ౩ సంవత్సరాలు.  ఇక, ఈమధ్యనే విడుదలైన ఖలేజా పరిస్థితి కూడా బేజారు గానే ఉంది. ఈ సినిమా విడుదలకు ముందు ఇచ్చిన బిల్డప్ కు, రిజల్టు కు పొంతన కనిపించడం లేదు. ఈ సినిమా షూటింగ్ కూడా ౩ సంవత్సరాలు జరుపుకుంది. ఖర్చు ౩౦ కోట్లకు పైమాటే.

ఈ రెండు సినిమాలు ఆడక పోయినా, హీరోలకు వచ్చిన నష్టం ఏమీ లేదు. వాళ్ళు హాయిగా , లైన్ లో ఉన్న తమ తర్వాతి చిత్రాలు చేసుకుంటున్నారు.వీళ్ళ ను నమ్ముకుని కోట్లు పోసి సినిమా కొన్నవాళ్ళు అన్యాయమై పోతున్నారు. 
అందుకని, ఈ హీరోలు తమ రెమ్యునరేషన్ నుంచి కొంత మొత్తాన్ని నష్టపోయిన వారికి ఇవ్వాలి. (తమిళనాడు లో రజనీకాంత్ లాగ).


మీరేమంటారు...


~శశిధర్ సంగరాజు. 















Wednesday, October 6, 2010

జగన్ పై ఈనాడు కార్టూన్

వద్దన్నా వినకుండా, ఓదార్పు సా..గిస్తున్న జగన్ పై అధిష్టానం  చర్యలు తీవ్రతరం చేస్తోంది. జగన్ వర్గానికి చెందిన వ్యక్తులను సస్పెండ్ చెయ్యడం మొదలెట్టింది. నెల్లూరు డిసిసి అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై వేటు లేటెస్ట్. 
ఈ నేపధ్యం లో, జగన్ లాగ దీర్గాలు తీసి మాట్లాడుతున్నట్లు  ఈరోజు ఈనాడు లో శ్రీధర్ వేసిన కార్టూన్ చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది. కార్టూనిస్ట్ లకు ఎవరి పైన ఆయినా సెట్టైరేసే స్వాతంత్రం ఉన్నప్పటికీ, అసలే ఈనాడు, అధిష్టానం, చంద్రబాబు లపై ఛాన్స్ దొరికితే విమర్శలతో విరుచుకు పడుతున్న జగన్, అతని అనుచరుల ఎదురు దాడి ఎలా ఉండబోతోందో !


~శశిధర్ సంగరాజు.