Powered By Blogger

Sunday, April 24, 2011

అర్జునుడా? అభిమన్యుడా?

 కడప లోక్ సభకు, పులివెందుల అసెంబ్లీ కి ఉప ఎన్నికల తేదీ దగ్గరపడుతోంది . కాంగ్రెస్, తెలుగుదేశం,వైఎస్ఆర్ కాంగ్రెస్ హోరా హోరీ గా ప్రచారం చేసుకుంటున్నాయి. ఎప్పుడు చూసినా, కరవుతో, వర్షాభావంతో  అల్లాడే కడప ప్రజలపై ఇప్పుడు ధనవర్షం కురుస్తోంది. ఓటుకు ఐదు వేల రూపాయలవరకు ముట్టచెపుతున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.  కాంగ్రెస్ పార్టీ హేమాహేమీలను రంగం లోకి దింపింది. ఇక విమర్శలు, ప్రతివిమర్శలకు అంతే లేదు. ఈ నేపధ్యంలో విజయావకాశాలు ఎవరికి ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇది కేవలం ఊహాత్మకమైన పరిశీలన మాత్రమే. ఫలితాలు దీనికి పూర్తిగా వ్యతిరేకంగా కూడా ఉండొచ్చు. 
ముందుగా పులివెందుల అసెంబ్లీ స్థానం: ప్రదానం గా పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ విజయమ్మ, కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డిల మధ్యనే.తెలుగుదేశం అభ్యర్థి బిటెక్ రవి మూడో స్థానంతో సరిపెట్టుకోవచ్చు. ఎందుకంటే, ఎంతో కుటుంబ నేపధ్యం, దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో తలపడిన ఎస్వీ సతీష్ రెడ్డి కే ఇక్కడ విజయం దక్కలేదు. మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన బిటెక్ రవికి ఇంతకన్నా మెరుగైన ఫలితాలు వస్తాయనుకోవడం నమ్మశక్యం కాని విషయం. 

ఇక విజయమ్మ పరిస్థితి కొస్తే, ప్రస్తుతానికి ఎక్కడికి వెళ్ళినా మహిళలు నీరాజనాలు పడుతున్నారు. గతంలో ఒక్కసారి కూడా ప్రచారానికి రాని ఆమె, మండుటెండల్లో వీదుల్లోకి రావడంతో మహిళల్లో  సానుభూతి కూడా పుష్కలంగా ఉంది. కానీ, ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది. మహిళా సానుభూతి ఓట్లతో ఒకవేళ గెలిచినా, పులివెందుల ప్రజలకు వాళ్ళ పనులు జరగాలంటే, మళ్ళీ వివేకానందరెడ్డి సహాయం తప్పనిసరి. పైగా, 
వైఎస్ మరణం తర్వాత, అన్ని పార్టీల మద్దతుతో గెలుపొందిన విజయమ్మ ఒక్కసారి కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు (మీడియా వార్తల ప్రకారం). అప్పుడంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు "మీది తెనాలే..మాది తెనాలే" అని పాడుకుంటూ సరిపెట్టుకున్నారు. ఇప్పుడు విజయమ్మ, జగన్ ఇద్దరూ కాంగ్రెస్ కు  బద్దవ్యతిరేకుల జాబితాలో చేరిపోయారు కాబట్టి, ఒకవేళ గెలిచి అసెంబ్లీ, మెట్లు ఎక్కకపోతే, ప్రతిపక్షాలతో పాటు, కాంగ్రెస్ కూడా విమర్శలు గుప్పించక మానదు. ఒకవేళ, అసెంబ్లీ కి వెళ్ళినా ప్రజా సమస్యలపై ఈమె ఏమాత్రం పోరాడుతారో అనుమానమే. (ఇప్పుడు అసెంబ్లీ లో ఉన్నోళ్ళు ఏమి పొడిచేసారని నన్ను అడక్కండి...నా దగ్గర సమాధానం లేదు) 
వివేకానంద రెడ్డి విషయానికొస్తే, మొన్నేదో అసెంబ్లీ లో గాలి ముద్దుకృష్ణమనాయుడ్ని ఒక్కటిచ్చుకున్నాడని పేపర్లలో వచ్చింది గానీ, స్వతహాగా ఈయన సౌమ్యుడు. పులివెందుల ప్రాంతంలో అందరికి అందుబాటులో ఉంటాడనే మంచి పేరు ఉంది. (ఈయన లోగడ కడప ఎంపి గా చేసినప్పుడు అందరూ అంటుంటే, విన్నాను. ) మంత్రి పదవికి రాజీనామా చేసి మరీ పోటీ చెయ్యడం ఒక విధంగా ప్లస్ పాయింట్ అవుతోంది. 

Bottom Line: తక్కువ మెజార్టీతో అయినా సరే, పులివెందుల నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి గెలుస్తాడని నా అంచనా. 
కడప పార్లమెంటు స్థానం: ఇక్కడ, కాంగ్రెస్ నుంచి డిఎల్ రవీంద్ర రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి జగన్, తెలుగుదేశం నుంచి మైసూరారెడ్డి బరిలో ఉన్నారు. అధికార పార్టీ, అధికారుల అండదండలు డిఎల్ కు కలిసివచ్చే అంశం. కాకపొతే, ఈయన సాదారణంగా మైదుకూరు నియోజక వర్గానికి పరిమితమైన నాయకుడు. జిల్లా మొత్తాన్ని ఎలా ప్రభావితం చేస్తాడనే దానిమీద విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. పిఆర్పి, కాంగ్రెస్ లో విలీనం కావడంవల్ల, ఆ సామాజిక వర్గం ఓట్లు తప్పకుండా కలిసొస్తాయి. ఇక, మైసూరారెడ్డి ది మాత్రం ఎదురీతే. స్వతహాగా, మంచి నాయకుడనే పేరు, ప్రజల్లో సానుభూతి (గత ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి)ఉంది. అవి ఎంతవరకు ఓట్లుగా మారతాయనేది వేచిచూడాల్సిన విషయం. 
ఇక జగన్, ఈయన,  తాను సియం అయితే...ఏ ఫైల్ మీద ముందుగా సంతకం పెడతాడో అన్న విషయం పక్కనపెట్టి, ప్రజలకు ఏమిచేస్తాడో చెపితే ఇంకొన్ని ఓట్లు ఎక్కువ రాలే అవకాశం ఉంది.కాంగ్రెస్ పన్నిన పద్మవ్యూహం లో అభిమన్యుడవుతాడో, అర్జునుడవుతాడో మే 13 దాకా వేచిచూడాల్సిందే.  

Bottom Line: జగన్ వర్గం డప్పు కొట్టుకుంటున్నట్లు, మూడులక్షల మెజార్టీ రాదు కానీ, జగన్ గెలిచే అవకాశాలే ఎక్కువున్నాయి. గతంలో కన్నా మెజార్టీ తగ్గొచ్చు. అయినా, ఎంపి గా పదవీ కాలం ఉన్నప్పుడు, రాజీనామ చేసి, మళ్లీ ఎంపి గా గెలిస్తే మాత్రం ఒరిగేదేముంటుంది (సొంత గుర్తు మీద గెలిచానన్న తుత్తి తప్ప).
రిగ్గింగ్ జరక్కుండా అడ్డుకుని, ప్రజలను స్వేచ్చగా ఓట్లు వేసుకోనిస్తే ఫలితాలు తారుమారైయ్యే అవకాశం ఉంది. కానీ, కడప లో అది సాధ్యమైయ్యే వ్యవహారం కాదు. ముఖ్యంగా, ఈ ఎన్నికల్లో. 
ఒకవేళ, రెండు సీట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుచుకుంటే, రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి మాత్రం ఖాయం.