Powered By Blogger

Sunday, October 17, 2010

అమెరికా లో ఫాల్ కలర్స్

ఈ సంవత్సరం సెప్టెంబర్ 22 నుంచి ఫాల్ / ఆటం మొదలైంది. ఈ కాలం లో చెట్లు తమ ఆకుల రంగులను క్రమ క్రమం గా మార్చుకుని చివరికి రాలి పోతాయి. అందరికీ తెలిసిన విషయమేగా , ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా- చిన్నప్పుడు సైన్సు క్లాసు లో చదువుకునే ఉంటాం ఫోటో సింథసిస్ గురించి.మరోసారి గుర్తు చేసుకుందాం. 

చెట్లు తమ వేళ్ళ ద్వారా భూమి లోని తేమనీ , పర్యావరణం లోని కార్బోన్ డై ఆక్సైడ్ ని గ్రహిస్తాయి. సూర్యరశ్మి ని ఉపయోగించి తేమనీ , కార్బోన్ డై ఆక్సైడ్ నీ, ఆక్సిజన్ , గ్లూకొస్ లు గా మార్చు కుంటాయి. ఈ ప్రక్రియనే ఫోటో సింథసిస్ అంటారు. ఫోటో సింథసిస్ జరగడానికీ, చెట్ల ఆకులు ఆకు పచ్చ గా ఉండడానికీ క్లోరోఫిల్ అనే రసాయనం ప్రధాన కారణం. (కింది ఫోటో చూడండి).

ఫాల్ / ఆటం లో చెట్ల ఆకుల రంగులో మార్పెలా వస్తుంది?
ఎలాగంటే, ఎండాకాలం అయిపోయి, ఆకు రాలే కాలం వచ్చిన తర్వాత, పగటి పూట ఎండలో తీక్షణత  తగ్గుతూ వస్తుంది. తగినంత సూర్యరశ్మి లేకపోవడం వల్ల ఫోటో సింథసిస్ ప్రక్రియ మందగిస్తుంది. తద్వారా చెట్ల ఆకులు ఆకుపచ్చ రంగును కోల్పోయి, పసుపు, ఎరుపు, వంగ, నారింజ రంగుల్లోకి మారతాయి. ఇవ్వాళ మా ఇంటి దగ్గర కొన్ని చెట్ల ఫోటో లు తీసాను. చూడండి రంగులు ఎలా ఉన్నాయో. 
ఇండియా లో ఉన్నప్పుడు , ఇన్ని రకాలుగా ఆకులు రంగు మారడం ఎప్పుడూ చూడలేదు. బహుశా, ఉష్ణోగ్రతల్లో పెద్ద తేడాలు ఉండక పోవడం కూడా కారణమై ఉండొచ్చు.

 ఉష్ణ ప్రాంతాలైన దక్షిణాది రాష్ట్రాల్లో ఎండా కాలానికీ, ఆకురాలే కాలానికి మధ్య ఉష్ణోగ్రతా భేదాలు ఎక్కువగా ఉండవు.


 


అమెరికా లో, వీకెండ్స్ లో ఫాల్ కలర్స్ చూడడానికి వెళ్ళడం ఒక ఆట విడుపు. కొన్ని వందల మైళ్ళు డ్రైవ్ చేసుకుని వెళ్లి , కలర్స్ చూసి వస్తుంటారు. మా ఊరికి దగ్గర్లో "గ్యాటలిన్ బర్గ్ " అనే ప్రాంతం, ఈ ఫాల్ కలర్స్ కి బాగా ప్రసిద్ది.  మళ్ళీ డిసెంబర్ 21 నుంచి చలికాలం మొదలవుతుంది. మంచు, చలి. అదొక అందం. 


                            (ఈ ఫోటో, లూయీవిల్ కు దగ్గర్లోని " బెర్న్ హైమ్ ఫారెస్ట్  " లో  తీసింది. )  



ప్రకృతి సృష్టించే ఈ రంగుల కాన్వాస్ ను, పునఃసృష్టి చేయడం, ఎంత చేయి తిరిగిన చిత్రకారుడికైనా అసాధ్యం అంటే అతిశయోక్తి కాదేమో!

చెట్లన్నీ కొట్టేస్తే, ముందు తరాలకు ఈ అందాలన్నీ దూరమైపోతాయి.
మరి మీ వంతుగా మొక్కలను నాటి, పర్యావరణ సమతుల్యానికి పాటుపడతారు కదూ?

ప్రయత్నించండి.

~ శశిధర్ సంగరాజు.


 


3 comments:

Vinay Datta said...

the yellow and the red ones are simply beautiful.

జర్నో ముచ్చట్లు said...

డియర్‌ శశీ,

ఫోటోలు అందంగా.. ప్రకృతి సోయగానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నాయి. ఈ ఫోటోలకు నీ వ్యాఖ్యానం చదువుతుంటే.. మనం ఈటీవీలో చెన్నైలో పనిచేసిన రోజులు.. ఎప్పుడు పాండా స్టోరీలు వచ్చినా వాటి పేటెంట్‌ రైట్‌ నాదే అన్నట్లుగా నువ్వు రాసిన రోజులు రింగు రింగులుగా (పాత సినిమాల్లోని ఫ్లాష్‌బాక్‌ టెక్నిక్) గుర్తొస్తోంది. వర్తమాన చిత్రాలతో అందమైన భూతకాలాన్నీ స్ఫురణకు రప్పించిన నీకు ధన్యవాదాలు.
... విజయ్

Sasidhar said...

విజయ్ గారు,

మీరు చెప్పింది అక్షరాలా నిజం. చెన్నై రోజులు ఇప్పటికీ గుర్తుకొస్తుంటాయి. మీతో కలసి రాత్రి ఏ రెండుకో, మూడుకో టీ తాగడానికి వెళ్ళడం. రాబర్ట్ రాజు మీద వేసుకునే జోకులు వగైరా..వగైరా.... Good Old Days