Powered By Blogger

Friday, July 22, 2011

ఘోస్ట్ హంటర్స్...

క్రితం వారం, నేను రాసిన "బహుశా..ఇదే కారణమై ఉంటుంది" పోస్ట్ లో ఆత్మల గురించి రాయడానికి ఒక కధ ఉందని చెప్పాను కదా?  ఆ కధ గురించే ఈ పోస్ట్. చదవండి మరి. 

ఇక్కడ మాకు టివిలో "ట్రావెల్" ఛానల్ వస్తుంది. సాధారణంగా, ఆ ఛానల్ లో ప్రపంచంలోని వివిధ దేశాలు, అక్కడి ప్రజల జీవన శైలి, ఆహారపు అలవాట్లు మొదలైనవి చూపిస్తుంటారు. "అంతోనీ బోర్డైన్ - నో రిజర్వేషన్", "ఆడం రిచ్మన్  - మాన్ వర్సెస్ ఫుడ్" ప్రోగ్రామ్స్ నాకు చాలా ఇష్టం. సరదాగా  ఉండడమే కాకుండా, ఎంతో విజ్ఞానదాయకంగా కూడా ఉంటాయి. ఈ ప్రోగ్రామ్స్ తో పాటు, "పారానార్మల్ స్టడీస్" (ఆత్మలకు సంబంధించిన శాస్త్రం) మీద కూడా ప్రోగ్రామ్స్ ప్రసారం అవుతుంటాయి. ఈ కార్యక్రమాలు ఏదో, "మా పెరట్లో చింత చెట్టు మీద దయ్యం ఉంది, నిన్ను పట్టుకుంటుంది లే" అని చిన్నప్పుడు, తోటి పిల్లలను దడిపించినట్లు కాకుండా,  కాస్త సైంటిఫిక్ గా, లాజికల్ గా ఉంటాయి. సైంటిఫిక్ గా అంటే నా ఉదేశ్యం, ఆత్మలు చేసే శభ్దాలను, మాటలను (అవును, మాటలనే) హై సెన్సిటివ్ వాయిస్ రికార్డర్స్ తో రికార్డ్ చెయ్యడం, నైట్ విజన్ వీడియో కెమెరాలతో , చిమ్మ చీకటిలో, ఆత్మల సంచారాన్ని చిత్రించడం, తర్వాత వాటిని విశ్లేషించడం ఆసక్తికరంగా ఉంటాయి. ఈ పోస్ట్ రాస్తున్నప్పుడు కూడా, టివి లో ఆ ప్రోగ్రామే వస్తోంది. ఈ కోవలోకే చెందినదే "ఘోస్ట్ హంటర్స్" అనే కార్యక్రమం.  ఒక చిన్న ఎపిసోడ్ గురించి చెప్పి ముగిస్తాను. 

ఒక కుటుంబానికి పురాతన వస్తువులు (Antiques) సేకరించడం సరదా. నిజంగా కూడా, అమెరికాలో, ఇదో పిచ్చి. ఎక్కడెక్కడో తిరిగి,  తుప్పు పట్టిన వస్తువులని డబ్బులిచ్చి కొని మరీ ఇంట్లో పెట్టుకుంటారు. మన దగ్గరైతే, ఎవరైనా ఇనుప వస్తువులు ఉచితంగా ఇచ్చినా తీసుకోము, దరిద్రమని.

సరే, కధలోకొస్తే, ఆ ఇంటి యజమాని ఎక్కడినుంచో ఒక పురాతన బాయ్నేట్ (తుపాకి ముందు తగిలించే కత్తి లాంటి ఆయుధం) కొని తెచ్చి ఇంట్లో అల్మారాలో పెట్టుకుంటాడు. వాళ్ళ ఆబ్బాయికి రాత్రిళ్ళు తన గదిలో ఎవరో తిరుగుతున్నట్లు అనిపిస్తుంటుంది. ఈ విషయం తల్లిదండ్రులకు చెపితే, మొదట్లో, పిల్ల చేష్టలుగా కొట్టి పారేస్తారు. కాని, తర్వాత, యజమాని భార్యకు కూడా అలాంటి అనుభవమే ఎదురవుతుంది. దాంతో వాళ్ళు భయపడి ఈ "ఘోస్ట్ హంటర్స్" ను పిలిపిస్తారు పరిశోదన చెయ్యడానికి. వాళ్ళ అనాలిసిస్ లో తేలిందేమిటంటే, ఈ బాయ్నేట్, వియత్నాం యుద్ధం లో పాల్గొన్న ఒక అమెరికన్ సైనికుడిది. అమెరికన్ సైనికులకు, వియత్నమీస్ కు జరిగిన యుద్దంలో, అమెరికన్ సైనికుడు ఈ బాయ్నేట్ ఉపయోగించి ఎంతో మందిని చంపేస్తాడు.బలవన్మరణాలకు గురైన ఆ ఆత్మలన్నీ, ఈ బాయ్నేట్ ను అంటిపెట్టుకుని ఉన్నాయన్నది పరిశోదన ఫలితం. "ఘోస్ట్ హంటర్స్" పరిశోధన ఎలా చేశారన్నది టివి లో చూస్తేగానీ మజా రాదు. ప్రస్తుతం నేను చూస్తున్న ఎపిసోడ్ ఇంకా థ్రిల్లింగ్ గా ఉంది. 

నేను కాలేజి హాస్టల్ లో ఉన్నప్పుడు "ఊజా బోర్డు" అనే ప్రయోగం చేసాను. మా రూమ్మేట్స్ మాత్రమే పాల్గొనాలని ముందు కండిషన్ పెట్టుకున్నా, తర్వాత హాస్టల్ లో అందరికి తెలిసిపోయి రూం కిక్కిరిసి పోయ్యేలాగా జనం పోగైపోయారు. వార్డన్ కు తెలిస్తే, తన్ని తగలేస్తారని మధ్యలోనే ఆపెయ్యాల్సి వచ్చింది.  

మీకు కూడా, ఇలాంటి ప్రోగ్రామ్స్ మీద ఆశక్తి ఉంటే, ఒక పని చెయ్యండి. మీ ఇంట్లో అన్ని గదుల్లో లైట్లు ఆర్పేయండి. టివి చూసే గదిలోకూడా ట్యూబ్ లైట్ కాకుండా, నైట్ బల్బ్ వెలుగులో సౌండ్ ఎక్కువ పెట్టుకుని చూడండి. మా ఊరి ఎమ్మెల్యే మీద ఒట్టు, దడుచుకోకపోతే నన్నడగండి.
Happy Ghost Hunting...
~శశిధర్ సంగరాజు. 

Tuesday, July 19, 2011

బహుశా ...ఇదే కారణమై ఉంటుంది.

అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే, రాందేవ్ బాబాల దీక్షలు, ప్రజలు దానికి మద్దతు పలకడం, రాజకీయనాయకులు యథాప్రకారం తమను కాదన్నట్లు అమాయకత్వం నటించడం చూస్తుంటే ఒకవైపు ఆనందం,మరోవైపు చిరాకు వస్తోంది. అవినీతి అన్ని రంగాల్లో ఉన్నా,  రాజకీయనాయకులదే పైచేయి.       నాకెప్పుడూ ఒక అనుమానం వస్తుండేది. రాజకీయ నాయకులు ఈస్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారు కదా, వీళ్ళకు మనస్సాక్షి ఉండదా?పాపభీతి లేదా? ఇంత మంది ఉసురు పోసుకుని రాత్రిళ్ళు ప్రశాంతంగా ఎలా పడుకోగల్గుతున్నారు? అని. ఈమధ్యకాలంలో నాకొక దిక్కుమాలిన లాజిక్ తట్టింది. (లాజిక్ దిక్కుమాలిందని ముందే చెప్పాను, నన్ను చీవాట్లు పెట్టి లాభంలేదు.) 

భగవద్గీత సిడిలో ఘంటశాల మాష్టారు స్పష్టంగా చెప్పారు -

                     "ఆత్మ నాశనము లేనిది.
                                 ఆత్మను అగ్ని దహింపజాలదు,
                                 నీరు తడపజాలదు,
                                వాయవు ఆర్పివేయనూ సమర్ధము కాదు " అని.

జనాలు ఎంతమాత్రం వేదాంతమార్గం పట్టారో  తెలియదుకానీ, మన రాజకీయనాయకులు ఈ పాయింట్ మాత్రం బాగా వంటపట్టించుకున్నట్లుంది.ఎలాగూ వీళ్ళు పోయాక ఆత్మ వెళ్ళేది నరకానికే (స్వర్గం గేటు దగ్గరికి కూడా వీళ్ళను రానివ్వరని అరాజ(చ)కీయులకు ముందే తెలుసు). ఆత్మకు పైనచెప్పినట్లు ఏ బెంగా లేదు. ఇంకేం, సిగ్గు, శరం లేకుండా "అనుభవించు రాజా" అని పాడుకుంటూ ఇష్టమొచ్చినట్లు లంచాలు మేసేస్తున్నారు. పాపం, ఈవిషయం తెలియక యమకింకరులు పెద్ద, పెద్ద విగ్గులు అవీ పెట్టుకుని, నల్లరంగు పూసుకుని అమాయకంగా తిరుగుతుంటారు...సినిమాల్లో చూపించినట్లు. "చేసుకున్నవాళ్ళకు చేసుకున్నంత" అన్నట్లు కొంతమందిని పట్టుకుని జైల్లో పారేసినా, అక్కడ కూడా ఇడ్లీలు, వడలు తింటూ ఎంజాయ్ చేస్తున్నారని వార్తలొస్తున్నాయి.

నా లాజిక్ తో ఏకీభవించేవాళ్ళెవరైనా ఉంటే, నాకు రాయండి.  ఇంతకూ, ఉన్నట్లుండి ఆత్మల మీద పడ్డాడేమిటి అనుకుంటున్నారా? దానికో కధ ఉంది. నా తర్వాత పోస్ట్ లో రాస్తాను.
~శశిధర్ సంగరాజు.