Powered By Blogger

Wednesday, May 18, 2011

సూరీడు ఎక్కడ?

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణించే రోజు వరకూ, ఏ దినపత్రికలో (ముఖ్యంగా ఈనాడులో ) రాజశేఖర్ రెడ్డి మీద కార్టూన్ వచ్చినా, పక్కనే, తెల్లటి జుట్టుతో, పొట్టిగా, లావుగా ఉన్నవ్యక్తి బొమ్మ తప్పకుండా ఉండేది. ఆయనే, రాజశేఖర్ రెడ్డి నమ్మినబంటు సూరీడు.కడప జిల్లాకే చెందిన సూరీడు (పూర్తి పేరు సూర్యనారాయణ రెడ్డి అనుకుంటా..) వైఎస్సార్ వెనుక ఫైళ్ళు పట్టుకొస్తూనో, మరోటో 
చేస్తూ వెన్నంటి ఉండేవాడు. కొన్ని టీవీ చానళ్ళ (బహుశా,టివి 9) ఇంటర్వ్యూ లలో ఆయనకు భోజనం వడ్డిస్తూ కూడా చూసినట్లు గుర్తు.

సర్వశిక్ష అభియాన్ కేసులో సూరీడు పేరు ప్రముఖంగా వినిపించింది. అన్ని కేసుల్లోలాగే, ఇందులో కూడా ఏమీ తేలలేదనుకోండి.అది వేరే విషయం.

వైఎస్సార్ అకాల మరణం తర్వాత సూరీడు కూడా కనుమరుగైపోయాడు. కానీ, ఇటీవల కడప ఉపఎన్నికల ప్రచారంలో కానీ,జగన్ ఘనవిజయం సాధించినప్పుడు కానీ ఈయన ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. పోనీ, జగన్ తో పొరపొచ్చాలేమైనా వచ్చాయనుకున్నా, స్వయానా  వైఎస్ తమ్ముడు వివేకా వైపుకూడా కనిపించలేదు.

మీరు గానీ ఎక్కడైనా టివీల్లో చూస్తే చెప్పండి. నాకు ఆయనతో పనేంలేదు కానీ, జస్ట్ క్యూరియాసిటీ...  అంతే.
~శశిధర్ సంగరాజు.

Saturday, May 7, 2011

కెంటకీ డర్బీ - మా ఊళ్ళో గుర్రప్పందేలు

మే 7 న (శనివారం) మా ఊర్లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గుర్రప్పందేలు జరిగాయి. చర్చిల్ డౌన్స్ అనే ప్రాంతం లో జరిగిన ఈ రేసును  "డర్బీ" అంటారు. చిన్న, చితకా రేసులు దాదాపు సంవత్సరం పొడుగునా జరుగుతూనే ఉన్నా, ఈ రేసుకు ఒక ప్రత్యేకత ఉంది. అమెరికా లో ప్రతిసంవత్సరం మూడు పెద్ద రేసులు జరుగుతాయి. వీటిని "ట్రిపుల్ క్రౌన్" రేసులంటారు. లూయివిల్ లో జరిగిన "డర్బీ" రేసు,  "ట్రిపుల్ క్రౌన్" లో మొదటిది. రెండోది, "ప్రీక్నెస్ స్టేక్స్"  బాల్టిమోర్/మేరీలాండ్ లో జరుగుతుంది. మూడో రేస్ "బెల్మొంట్ స్టేక్స్" న్యూయార్క్ లో జరుగుతుంది. అక్కడితో  ఈ సంవత్సరానికి "ట్రిపుల్ క్రౌన్" రేసులు ముగుస్తాయి. 
చర్చిల్ డౌన్స్



ఈ బ్లాగ్ చదివేవాళ్ళలో జంతు ప్రేమికులేవరైనా ఉంటే "నోరులేని జీవాలను హింసిస్తున్న దుర్మార్గులు" అని నా మీద అలగక్కరలేదు. ఈ రేసులు ఇప్పుడేదో కొత్తగా మొదలైనవికావు. కెంటకీ డర్బీ 1875 లో, ప్రీక్నెస్ స్టేక్స్ 1873 లో, బెల్మొంట్ స్టేక్స్ 1867 లో మొదలైయ్యాయి. లక్షలాది మంది చూసి ఆనందిస్తే, మిలియన్ల కొద్ది డాలర్లు చేతులు మారతాయి. ఈ రేసులన్నిట్లో మూడు సంవత్సరాల వయసున్న గుర్రాలే పాల్గొంటాయి. పేరుకు మూడు సంవత్సరాల వయసైనా, చూడడానికి ఎత్తుగా, పెద్దగా హుందాగా ఉంటాయి. ఫినిషింగ్ లైన్ వైపు దూసుకొచ్చే గుర్రాలు చూడడానికి అద్భుతంగా ఉంటాయి. 
దూసుకుపోతున్నజాకీలు 


ఇక్కడో విషయం గమనించాలి, లింగవివక్ష ఎక్కడైనా ఉందేమో గానీ గుర్రప్పందేల్లో మాత్రం లేదని చెప్పగలను. సరిగ్గా డర్బీ జరగడానికి ఒక రోజు ముందు, లూయివిల్ లో "కెంటకీ ఓక్స్" అనే రేసు జరుగుతుంది. ఇందులో అన్నీ ఆడ గుర్రాలే పాల్గొంటాయి.


 ప్రతి సంవత్సరం లాగే, ఈ సంవత్సరం కూడా కొన్ని గుర్రాలమీద పందెం కాసాను. గతంలో ఎంతో, కొంత అనాలిసిస్ చేసి, గుర్రాల గురించి తెలుసుకుని మరీ పందేలు పెట్టేవాన్ని. కొన్నిసార్లు కొంత చిల్లర కూడా వచ్చినట్లు గుర్తు. అదేం విచిత్రమో, నేను పందెంకాసిన గుర్రాలు, రేసు మొదట్లో గుర్రాలుగానే పరుగు మొదలెట్టినా, చివరకొచ్చేసరికి గాడిదల్లాగా రూపాంతరం చెందుతున్నాయి. ప్రతిసారి నాకు చేతి చమురు వదలడమే. ఆడిన ప్రతిసారి ఓడిపోయేటప్పుడు, పందేలు కట్టడ మెందుకు అంటారా? అదో తుత్తి.  

వచ్చేసంవత్సరానికైనా "ఆశ్వ హృదయం" గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతం లో నకులుడికో, సహదేవుడికో ఈ విద్య తెలుసని చదివాను. చూద్దాం అదృష్టం ఎలాఉందో. 
~శశిధర్ సంగరాజు.