Powered By Blogger

Sunday, November 28, 2010

కడప జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్చకండి...ప్లీజ్.

నా బ్లాగ్ లో ఒక పోల్ నిర్వహించాను. "కడప జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్చడం సమంజసమేనా?" అన్నది ప్రశ్న. పోల్ కు నేను పెట్టుకున్న గడువు దాదాపు 30 రోజులు. ఈ నెల రోజులుగా నా బ్లాగ్ ను సందర్శించిన మిత్రులు కొందరు ఆ పోల్ లో తమ ఓటు వేశారు. ఈ రోజు తో పోల్ గడవు ముగిసింది. ఫలితాలు మీ అందరితో పంచుకుందామని ఈ పోస్ట్ రాస్తున్నాను. 
నా ప్రశ్నకు :

        కాదు:    42 ( 89 %) 
        అవును:   4  (8 %)
        చెప్పలేం :  1  ( 2  %) 


ఓట్లు వచ్చాయి. నా బ్లాగ్ కు ఉన్న రీడర్ షిప్ ఎంతో, ఇలాంటి పోల్ ఇక్కడ నిర్వహించడం వల్ల, నేను సాధించే ఫలితం ఏమిటో , నాకు స్పష్టం గా తెలుసు. ఈ పోల్ చూడగానే ఏదో అద్భుతం జరుగుతుందనే అపోహ కూడా నాకు లేదు. కానీ, తమ లాభాల కోసం, ఎంతో చరిత్ర ఉన్న ఒక జిల్లా పేరును, బలప్రయోగం తో  ఒక వ్యక్తి పేరుకు మార్చడం ఎంత వరకూ సబబు అన్నది నా ప్రశ్న.


కడప వాసిగా ,దివంగత నేత రాజశేఖర్ రెడ్డి అంటే, నాకు వ్యక్తిగత వైరం గానీ, అయిష్టం గానీ ఏమీ లేవు కూడా.ముఖ్య మంత్రిగా రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన కొన్ని పథకాల వల్ల ప్రజలకు ప్రయోజనం కలిగి ఉండొచ్చు. కాదనలేని వాస్తవం. అడిగిన వారికి లేదనకుండా సాయం చేసి ఉండొచ్చు.శుభం.ఆయన ఆకస్మిక దుర్మరణం.. అత్యంత విషాదకరం. కానీ, ఆయన హయాం లో జరిగిన అధికార దుర్వినియోగం, బంధుప్రీతి, అవినీతి తవ్వే కొద్దీ బయట పడుతూనే ఉన్నాయి. 

ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పేరును కూడా నెల్లూరు జిల్లా పేరుకు ముందు తగిలించారు కానీ, నెల్లూరు జిల్లా పేరును పూర్తిగా చెరిపెయ్యలేదు. కేవలం కడప విషయం లోనే ఈ తొందరపాటు కనపడుతోంది.  మీడియా లో కూడా, కేవలం, రాజశేఖర్ రెడ్డి మానస పు(ప)త్రిక "సాక్షి" మాత్రమే కడప పేరు మార్చి వైఎస్ఆర్ అని జిల్లాల లిస్టులో రాస్తోంది. మిగతా పేపర్లు ఇంకా కడప అనే వాడుతున్నాయి.


ముఖ్యమంత్రి గా ఉన్న ఐదు సంవత్సరాల పైచిలుకు మాత్రమే, రాజశేఖర్ రెడ్డి శాంతంగా, ప్రజల మనిషిగా మెలిగారు గానీ, అంతకు ముందు ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితం అంతా అసమ్మతిమయమే.రాజశేఖర్ రెడ్డి ఆయన అభిమానులకు గొప్ప నాయకుడు అయితే అవ్వచ్చు గాక.
కలియుగ వైకుంఠం తిరుపతికి, గడప గా పేరు పొంది, బమ్మెర పోతన, వేమన, పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు వంటి మహోన్నత వ్యక్తులు జన్మించి/జీవించిన కడప పేరును, పూర్తిగా మార్చేసి ఆయన పేరు మీద పిలవాలనేంత గొప్ప వ్యక్తి అయితే మాత్రం కాదు అన్నది నా అభిప్రాయం.

అయితే, ఆయనలో ఒక్క సుగుణం ఉంది. తనను కలవడానికి వచ్చే వాళ్ళు ఎంత చిన్న వాళ్ళయినా, వారిని ఆప్యాయం గా పలకరించడం.వారి యోగక్షేమాలు విచారించడం. తన చిరునవ్వుతో, ఎదుటి వాళ్లకు నేనున్నాని భరోసా ఇవ్వడం. ఇలాంటి మానవీయ కోణం ఉన్న రాజకీయనాయకున్ని నా జీవితం లో ఇంతవరకు చూడలేదు.  అదే, మన ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిని చూడండి. ఆయన మొహం లో నవ్వు, తుమ్మల్లో  పొద్దు గ్రున్కినట్లు ఉంటుంది. నవ్వితే ఎక్కడ టాక్స్ కట్టాల్సి వస్తుందోనని భయమో ఏమిటో.

ప్రస్తుతం రాష్ట్రం లో అతి వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా, కడప పేరు మార్చరనే అనుకుంటాను. రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మరణం నేపథ్యం లో,ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పుడు జిల్లా పేరు మార్చాలని ఎగబడ్డ వాళ్ళంతా ఇప్పుడు పదవుల కోసం వెంపరలాడుతున్నారు. ఈ నాయకులకు కావాల్సిన పదవులు దక్కితే, జిల్లా పేరు మార్పిడి తర్వాత, తమ ఇంటి పేర్లు కూడా మార్చుకోవడానికి సిద్దంగా ఉన్నట్లున్నారు. 


చూద్దాం ...ఏమవుతుందో. 


~శశిధర్ సంగరాజు.

Thursday, November 25, 2010

దస్తగిరి - పార్ట్ 2 కువైట్ పెన్ను

దస్తగిరి తో నేను పడ్డ తిప్పలు పార్ట్ 1 లో చదివారు కదా...చిన్న, చిన్న సంఘటనలు మామూలే అయినా...నా వల్ల జరిగిన ఒక పొరపాటు, నాకు ప్రశాంతత అనేది లేకుండా చేసింది. అదేంటో, చదవండి మరి.


పదవ తరగతి మొదలైన కొత్తల్లో కూడా పరిస్థితి మామూలుగానే ఉండేది. ఆరు నెలల పరీక్షలు అయిపోయినప్పటి నుంచి  టెన్షన్ మొదలైంది. పలకరించిన ప్రతివాళ్ళు, "ఈ సారి పదోతరగతి..ఇంతకముందులా కాదు..పబ్లిక్ ...బ్రహ్మాండం గా చదవాలి..మంచి మార్కులు రావాలి " అని ఊదరగొట్టడం మొదలెట్టారు. మా నాన్నగారి ఫ్రెండ్ ఒకాయన, ఒక అడుగు ముందుకేసి "నువ్వు స్టేట్ ఫస్ట్ రావాలి " అని దీవించేసాడు. "ఏం ఈ సంవత్సరం మీరు గాని పేపర్లు దిద్దుతారా" అని అడగబోయి మాట మింగేసాను. ఇంట్లో తెలిస్తే తంతారని.  


ప్రతి గురువారం దూరదర్శన్ లో "చిత్రలహరి" అనే సినిమా పాటల కార్యక్రమం వచ్చేది. వాణిజ్యప్రకటనలు పోను, ఆ కార్యక్రమం వచ్చేది 15 నిమిషాలు.అది కూడా, చూడనిచ్చేవాళ్ళు కాదు. ఇంటికి వచ్చే వాళ్ళు కూడా, సరిగ్గా ఆ టైం కు రావడం, " "చిత్రలహరి" జీవితం లో ఎప్పుడైనా చూడొచ్చు నాయనా..ఈ సారి పదోతరగతి .." అంటూ మళ్లీ  రికార్డు మొదలెట్టడం.


ఈ గొడవలో కూడా, దస్తగిరి "డోన్ట్ కేర్" పద్దతిలో ఏ మార్పు లేదు. ఇక్కడ దస్తగిరి కి ఉన్న ఒక సుగుణం గురించి చెప్పుకోవాలి. కర్ణుడు (అవును, మహాభారతం లో ఉండే ఆయనే) అడిగిన వాళ్లకు మాత్రమే దానం చేస్తాడేమో, దస్తగిరి మాత్రం నోరు తెరచి అడక్కపోయినా, మన మనస్సు కనిపెట్టి మరీ దానాలు చేస్తాడు. చిక్కల్లా,మాట తేడా వస్తే, "నేను ఇచ్చింది తిరిగి ఇచ్చై"  అని హింసిస్తాడు . ఈ విచిత్ర వికారానికి  నేను బలైపోయాను. 

ఒక రోజు, స్కూల్ లో దస్తగిరి జేబులో ఒక కొత్త పెన్ను చూసాను. అది ఇంకు పెన్ను. పెన్ను కింది భాగం ముదురు ఆకు పచ్చ రంగులో ఉంది. లోపల ఇంకు లెవెల్ కనపడడానికి అటూ, ఇటూ సన్నటి విండోలు. బంగారు రంగు కేప్. కేప్ చుట్టూ దానిమ్మ రంగులో చెక్కిన లతల డిజైన్. మెరిసిపోతున్న పెన్ను క్లిప్.చూడగానే "పెన్నంటే ఇదిరా" అనిపించే లాగా ఉంది. నా దగ్గర కామెల్ ఇంకు పెన్ను ఉంది . కానీ, నా పెన్నుకు, దస్తగిరి దగ్గరుండే పెన్నుకు నక్కకు, నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. మెల్లగా, దస్తగిరిని  అడిగాను , "  కొత్త పెన్ను కొన్నావా"  అని.దస్తగిరి చెప్పిన జవాబు నన్ను ఇంకా ఆశ్చర్యంలో ముంచేసింది. దస్తగిరి వాళ్ళ బంధువులెవరో కువైట్ లో పనిచేస్తారట. (కడప, రాజంపేట ప్రాంతాలనుంచి గల్ఫ్ కు, ముఖ్యంగా   కువైట్ కు ఉపాధి కోసం వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది) వాళ్ళు సెలవల్లో వచ్చినప్పుడు తెచ్చారట. 


కొత్త పెన్ను, అందులో ఫారెన్ పెన్ను. నాకు కుతూహలం ఎక్కువైపోయింది. దస్తగిరిని అడిగాను, "ఈ రోజు పెన్నులు మార్చుకుందామా" అని. దాన కర్ణుడు కదా, వెంటనే ఇచ్చేసాడు. ఆరోజంతా ఆ పెన్నుతోనే నోట్స్ రాసుకున్నాను. ఉత్సాహం ఆపుకోలేక, దస్తగిరి నోట్స్ కూడా నేనే రాసి పెట్టాను. ఆ పెన్ను తో రాస్తుంటే , అక్షరాలు కూడా పొందిగ్గా కుదురుతున్నట్లు నాకు నమ్మకం గా అనిపించింది. సాయంత్రం పెన్ను తిరిగి ఇచ్చేటప్పుడు బాధగా కూడా అనిపించింది. " మళ్లీ రేపు తెస్తావా " అని అడిగితే సరేనన్నాడు. అలా రెండు, మూడు రోజులు జరిగిపోయింది. 


నాలుగో రోజు ఏ కళ నున్నాడో , ఏమో, "ఈ పెన్ను నువ్వే తీసుకో " అన్నాడు. నాకు ఒకవైపు ఆశ్చర్యం, మరో వైపు అనుమానం. "మీ ఇంట్లో ఏమీ అనరా" అని అడిగాను. "ఫర్వాలేదు, ఈసారి వచ్చినప్పుడు మళ్లీ తెమ్మని అడుగుతాన్లే, ఏమీ అనరు" అని చెప్పాడు.దస్తగిరి కి మరీ, మరీ థాంక్స్ చెప్తూ, గాల్లో తేలిపోతూ ఇంటికి వెళ్లాను. ఆరోజు నుంచి "కువైట్ పెన్ను" నా జీవితం లో ఒక భాగమైంది. ఎక్కడి కి వెళ్ళినా ఆ పెన్ను నాతో ఉండాల్సిందే. ఆ కృతజ్ఞతతో దస్తగిరికి అడిగినప్పుడల్లా నోట్స్ రాసి ఇచ్చేవాన్ని. 


కానీ, అన్ని రోజులు మనవి కావనే విషయం త్వరలోనే నిజమైంది. ఆ రోజుల్లో నేను ఎన్.సి.సి. కూడా వెలగబెట్టే వాణ్ని. ఒక రోజు ఎన్.సి.సి. డ్రెస్ మార్చుకుంటుంటే కువైట్ పెన్ను కింద పడడం, నేను చూసుకోకుండా ఎన్.సి.సి. బూటుతో పెన్ను మీద అడుగు పెట్టడం జరిగిపోయింది. ఇంకేముంది, ఇనుప నాడాలు బిగించిన బూట్ బరువుకి పెన్ను చిట్లి పోయింది. నాకు విపరీతమైన దుఃఖం .ఇక కువైట్ పెన్ను ఇంకు కారడం మొదలెట్టింది. ఎన్ని బట్టలు చుట్టినా, ఫలితం లేకుండా పోయింది. దస్తగిరి కి తెలియకుండా, ఇంకో ఫ్రెండ్ ని అడిగా , ఏం చేద్దామని. సన్నటి కొవ్వొత్తి సెగ లో పెన్ను ను ఉంచితే, పగిలిన భాగం అతుక్కుంటుందని సలహా ఇచ్చాడు. ఆ ప్రయోగం దారుణంగా ఫెయిల్ అయ్యింది. అంత వరకు బొచ్చు కుక్క పిల్ల లా అందంగా , ముచ్చటగా ఉండే కువైట్ పెన్ను, గజ్జి కుక్కలా తయారైంది. చేసేదేమీ లేక, విసుగొచ్చి పెన్ను ఎక్కడో పడేసాను. ఎలాగూ, పెన్ను లేదుకదా అని దస్తగిరికి నోట్స్ రాసిపెట్టడం కూడా మానేసాను. 


మరి ఎలా గమనించాడో, ఏమో, ఒక రోజు దస్తగిరి నన్ను అడిగాడు, కువైట్ పెన్ను స్కూల్ కి తీసుకురావడం లేదేమని. నసుగుతూ అసలు విషయం చెప్పేసాను. అప్పటికేమి అనలేదు, నేను కూడా ఆ విషయం మర్చిపోయాను. ఇక పరీక్షలు దగ్గర పడుతున్నప్పుడు ఒక రోజు దస్తగిరి ఉన్నట్లుండి బాంబు పేల్చాడు. " నా కువైట్ పెన్ను నా కిచ్చై" అని. పైగా దానికి మరో క్లాజ్ తోడైంది "ఎట్లిచ్చింది అట్లనే" అని. ( ఆంటే, As It Was అని అర్థం). నాకు గుండెల్లో రాయి పడింది. దస్తగిరికి ఉన్నట్లు , మా బంధువులెవరూ కువైట్ లో లేరు. నా పెన్ను సమస్య తీర్చడానికి , మా ఇంట్లో వాళ్లెవరికీ  కువైట్ కు వెళ్ళే ఉద్దేశ్యం కూడా లేదు. పైగా ఇంట్లో విషయం తెలిస్తే చీవాట్లు తప్పవు. వేరే పెన్ను ఇస్తానంటే దస్తగిరి ఒప్పుకోలేదు. చివరికి తనే పరిష్కారం కూడా చెప్పాడు.


పరీక్షల్లో (హిందీ, లెక్కలు )నేను తనకు ఆన్సర్ లు చూపిస్తే సరిపోతుందని.నేనేదో తనకన్నా మేధావినని కాదు, ఏదో గుడ్డిలో మెల్ల. అంతే.  హిందీ వరకు ఫర్వాలేదు. నేను అప్పటికే దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారు నిర్వహించే ప్రవేశిక పరీక్ష పాసయ్యాను. లెక్కలతోనే నాకు తిప్పలు. నాకు మాత్రికలు (Matrix), త్రికోణమితి (Trigonometry) లను చూస్తే, అమావాస్య అర్ధరాత్రి రెండు కొరివి దయ్యాలు జుగల్బంది చేసినట్లుండేది. కాకపొతే, వేరే మార్గం లేక పోవడం తో సంధికి ఒప్పుకోక తప్పలేదు.  ముందు జాగ్రత్తగా, నేను కూడా ఒక మెలిక పెట్టాను. 10 మార్కుల ప్రశ్నలు మాత్రమే సాయం చెయ్యగలననీ, బిట్స్ తనే రాసుకోవాలని. ఇంకో మొండి ధైర్యం కూడా ఏమిటంటే, మా ఇద్దరి నంబర్లు ఒకే దగ్గర వచ్చినప్పుడు చూద్దాం లే అని.దస్తగిరి కూడా ఒప్పుకున్నాడు.


నాకు దురదృష్టం  రామస్వామి రెడ్డి అనే డి.ఈ.ఓ. రూపం లో ఎదురైంది. ఆయనను ఆ సంవత్సరమే కడపకు ట్రాన్స్ఫర్ చేసారు. ఆయన బాగా స్ట్రిక్ట్. ఆయన చేసిన మొదటి పని, స్కూల్ సెంటర్ లు మార్చడం. అప్పటి వరకు ఎవరి పరీక్షల సెంటర్ వాళ్ళ స్కూల్ లోనే.తెలిసిన వాతావరణం, తెలిసిన టీచర్ ల మూలంగా పిల్లలకు కూడా ధైర్యం గా ఉండేది. కాపీలు కూడా విచ్చలవిడిగా జరిగేవి.  మునిసిపల్ హైస్కూల్ సెంటర్ ను, శారదా నిలయం అనే స్కూల్ కు మార్చారు. ప్రతి పరీక్ష కు రూం లు కూడా మార్చడం మొదలెట్టారు. ఈ కొత్త పద్దతి లో  హిందీ, లెక్కలు, సైన్సు పరీక్షలకు నేను, దస్తగిరి ఒకే క్లాసు లో పడ్డాం. హిందీ పరీక్షకు మాత్రం ఒకే క్లాసు అయినా బాగా దూరంగా కూర్చోవలసి వచ్చింది. పెద్ద గా సాయం చెయ్యలేక పోయాను. కానీ, పరీక్ష అయిపోయాక దస్తగిరి మాత్రం ఆనందంగానే ఉన్నాడు . ఎలా రాసావని అడిగాను. "ఏముంది, కొచ్చిన్ పేపర్ లో ఏముందో అదంతా చూసి ఆన్సర్ పేపర్లో రాసేసా" అన్నాడు. నాకు గుండెల్లో రాయి పడింది. పేపర్లు దిద్దే మాస్టార్లు హిందీ విషయం లో మాత్రం కొంచెం చూసీ, చూడనట్లు వెళ్ళేవారు. కాకపోతే, నాకు తెలిసి హిందీ లో ఫెయిల్ ఆయినా వాళ్ళెవరూ లేరు.  అయినా ఏదో అనుమానం. 

ఇక లెక్కల పరీక్షలో మాత్రం దస్తగిరి నంబర్ నాకు ఐమూలగా (ఆంటే, Diagonal అన్నమాట)వచ్చింది. ఇక కొచ్చిన్ పేపర్లు ఇచ్చిన 10 నిమిషాల నుంచి దస్తగిరి గొడవ మొదలైంది "చూపీ" అంటూ. ఏం చూపియ్యనూ, నా బొంద. పేపర్లో అడిగిన  ప్రశ్నలే అర్థం కాక నా పరిస్థితి  గందరగోళం గా ఉంది. ముందు రెండు మార్కుల ప్రశ్నలకు జవాబు రాసి, కొంత కుదుటబడ్డాక, పది మార్కుల ప్రశ్నలు అటెంప్ట్ చెయ్యాలన్నది నా ప్లాన్. దస్తగిరి మాత్రం ముందు పది మార్కుల ప్రశ్నలు ఆన్సర్ చెయ్యమనేవాడు, ఒక పని అయిపోతుందని. తర్వాత రాస్తానని సైగ చేస్తే, వెంటనే దెప్పిపొడవడం " ఏం, సరిగ్గా చదవలేదా" అని. దస్తగిరి గుసగుసల శబ్దానికి ఇన్విజిలేటర్ "ష్..." అంటూ హెచ్చరికలు. నాకు భయంగా ఉండేది ఎక్కడ పేపర్ లాక్కుని బయటకు పంపేస్తారో అని. మొత్తానికి ఆ మూడు గంటలూ కడప ఎండల్లో చెప్పులు లేకుండా నడిచినట్లనిపించింది. నోటికొచ్చిన ఈక్వేషన్లు, ఫార్ములాలతో పేపర్ నింపేసాను. దస్తగిరి, నా పైత్యం కొంత, తన పైత్యం కొంత కలిపి పేపర్లు నింపేసాడు. ఒకటి, రెండు అడిషనల్ పేపర్లు కూడా తీసుకున్నట్లు గుర్తు. బయటకు వచ్చాక "సూపర్ గా రాశాం  కదా! కనీసం 70 మార్కులన్నా వస్తాయి. కదా ?" అని అడిగాడు. నేనొక వెర్రి నవ్వు నవ్వాను. " అవును, ఇద్దరికీ కలిపి 70 మార్కులు వస్తే , పుణ్యం చేసుకున్నట్లే" అని మనసులో అనుకున్నాను. బయటకు ఆంటే మళ్ళీ అదో గొడవ.


మొత్తానికి పరిక్షలైపోయాయి. ఎండా కాలం సెలవల్లో, దస్తగిరి పాలిటెక్నిక్ కోచింగ్ లో చేరాడు. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్లాను, సెలవలు గడపడానికి, బావుల్లో ఈత కొట్టడానికి.
రిజల్ట్స్ రావడానికి ఒక వారం రోజుల ముందు మళ్లీ కడపకు వచ్చాను. రిజల్ట్స్ రోజు మా ఇంట్లో అందరూ నా నంబర్ కోసం వెతుకుతుంటే..నేను దస్తగిరి నంబర్ కోసం వెతికాను. అప్పటివరకు కడప లో, పదవ తరగతి ఉత్తీర్ణత 70  శాతానికి ఎప్పుడూ తగ్గేది కాదు. దానికి కారణం, మాస్ కాపీయింగ్. కానీ, ఆ సంవత్సరం, రామస్వామి రెడ్డి గారి పుణ్యమా అని 13 శాతానికి పడిపోయింది. అందులో అమ్మాయిలదే పైచెయ్యి.


నేను స్టేట్ ఫస్ట్ రావాలని ఆశీర్వదించిన మా నాన్నగారి ఫ్రెండ్ కు ఆశాభంగం కలిగిస్తూ నేను సెకండ్ క్లాసు లో పాసయ్యాను. దస్తగిరి కి థర్డ్ క్లాసు వచ్చింది. మామూలుగా అయితే, సెకండ్ క్లాసు వచ్చినందుకు మా ఇంట్లో నన్ను బాదేసేవాళ్ళు. కానీ, 13 పర్సెంట్ పాస్ అవ్వడంతో, పోన్లే, సంవత్సరం వేస్ట్ కాలేదని సంతోషించి, చీవాట్లతో సరిపెట్టారు.  లాంగ్వేజస్, సోషల్ స్టడీస్ లో వచ్చిన మార్కులు నన్ను కాపాడాయి. లెక్కలు, సైన్సు లో బొటాబొటి మార్కులతో గట్టెక్కాను.


మార్క్ షీట్లు తీసుకోడానికి వెళ్ళినప్పుడు దస్తగిరి కలిసాడు. తాను పాలిటెక్నిక్ లో చేరుతున్నట్లు చెప్పాడు. లెక్కల్లో మాత్రం 40 మార్కులు కూడా దాటకపోవడం పై బోల్డు ఆశ్చర్యం వ్యక్తం చేసాడు. ఈ మధ్య పేపర్లు సరిగ్గా దిద్దడం లేదనీ, లేకపోతే అన్ని పేపర్లు రాస్తే 40 కూడా దాటక పోతే ఎట్లా? అని విసుక్కున్నాడు. జరిగిందేమిటో నేను దస్తగిరికి వివరించి చెప్పలేదు. అనవసరం కూడా. తర్వాత మా దార్లు వేరైపోయాయి. మళ్లీ కలవలేదు.


అప్పట్నుంచి ఎవరితోనూ పెన్నులు మార్చుకునే ప్రయత్నం మాత్రం చెయ్యలేదు.


~శశిధర్ సంగరాజు.

Saturday, November 20, 2010

దస్తగిరి - పార్ట్ 1 : గురు పూజోత్సవము.

 నేను, కడప మునిసిపల్ హై స్కూల్ (మెయిన్) లో 9 , 10 తరగతులు  చదివే రోజుల్లో దస్తగిరి నా క్లాసుమేటు. దస్తగిరి వ్యవహారం కొంచెం విచిత్రం గా ఉండేది. దేనికీ తొణికే రకం కాదు. ఏం జరిగినా మనల్ని కాదు అన్నట్లు ఉండే దస్తగిరి నాకు త్వరగానే మిత్రుడయ్యాడు.

9  వ తరగతి మొదలైన కొన్ని నెలలకు దస్తగిరి సియస్ ఐ  స్కూల్ నుంచి మా స్కూల్ కు ట్రాన్స్ఫర్ మీద వచ్చాడు. స్కూల్ తెరిచిన రెండు నెలలకు రావడం మూలాన, మిగతా క్లాసు లలో అప్పటికే పూర్తి స్త్రెంగ్థ్ ఉండడం వల్ల, దస్తగిరి ని మా సెక్షన్ కు కేటాయించారు. 9  వ తరగతి లో 4 సెక్షన్లు ఉండేవి. ఎ,బి,సి,డి. ఎ సెక్షన్లో మాత్రం అమ్మాయిలు, అబ్బాయిలు కలసి ఉండేవారు. నాది సి సెక్షన్. 

దస్తగిరి పూర్తి పేరు "దస్తగిరి రెడ్డి". రాయలసీమ లో హిందువుల్లో కూడా "దస్తగిరి రెడ్డి, ఫకీరా రెడ్డి" లాంటి పేర్లు మామూలే. మొక్కుబడి ఉన్నవాళ్ళు అలాంటి పేర్లు పెట్టుకుంటారు. అప్పటివరకు స్క్వాడ్ లీడర్ (మా స్కూల్ కు ప్రతి సంవత్సరం బిఇడి ట్రైనీ టీచర్ లు వచ్చేవారు. ఈ స్క్వాడ్ లీడర్  ప్రయోగం వాళ్ళదే . లేకపోతే మునిసిపల్  హై స్కూల్ ఆటలకే కానీ, చదువుకు అంత ఫేమస్ కాదు.)గా ఉన్న నాకు, క్లాసు లీడర్ గా ప్రమోషన్ వచ్చింది. 

స్క్వాడ్ లీడర్ గా నేను ఉద్ధరించింది ఏమీ లేదు. నా స్క్వాడ్ లో ఉన్నవాళ్ళంతా కొంచెం అమాయకులు, నోట్లో నాలుక లేని బాపతు కావడం, వాళ్ళు హోం వర్క్ సరిగ్గా చేయడం, అల్లరి చెయ్యక పోవడం నా ప్రతిభే అని పొరపాటు పడి మా  లెక్కల సార్ నన్ను క్లాసు లీడర్ ను చేసారు. స్క్వాడ్ లీడర్ గా ఎలాగో నెట్టుకొచ్చిన నాకు , క్లాసు లీడర్ పోస్ట్ తల నొప్పి గానే తయారైంది.


అప్పటివరకు అల్లరి చేసే పిల్లల పేర్లు బోర్డు మీద రాయడం, టీచర్ లకు మొర పెట్టుకోవడం మినహా గత్యంతరం లేని నాకు దస్తగిరి తో స్నేహం కలిసొచ్చింది. 9  తరగతికే, దస్తాగిరిది భారీ విగ్రహం. మా అందరికన్నా పొడవు కూడా. కాస్త దుడుకుగా ఉన్న పిల్లలను దస్తగిరి కంట్రోల్ లో పెట్టేవాడు. చూడడానికి దిట్టంగా, ఎవరన్నా లెక్కలేనట్లు ఉండే దస్తగిరి ఆంటే వాళ్లకు భయం.   కొన్ని కొన్ని విషయాల్లో దస్తగిరి నాకు సలహాలు కూడా ఇచ్చేవాడు. ఆ సలహాల వల్ల కొన్ని సార్లు లాభాలు, మరి కొన్ని సార్లు నష్టాలు. కానీ, ఒక సారి దస్తగిరి ఇచ్చిన సలహా, నా మెడకు అనకొండ లా చుట్టుకుంది.


అదేమిటంటే, ప్రతి సంవత్సరం స్కూల్ లో గురుపూజోత్సవం (టీచర్స్ డే - సెప్టెంబర్ 5 న)బాగానే జరుపుకుంటారు. అన్ని సెక్షన్ల మధ్య ఒక అప్రకటిత పోటి  ఉండేది. ఎవరు బాగా టీచర్స్ డే జరిపారనే విషయం మీద. 'ఏ' సెక్షన్ తో మాకు ఎప్పుడూ పోటి ఉండేది కాదు. కారణం, ఆ సెక్షన్లో అమ్మాయిలు ఉండడం. వాళ్ళ క్లాసు ను వాళ్ళు బాగా అలంకరించడమే కాకుండా, ముగ్గులు, రంగవల్లులు వేసి మమ్మల్ని చిత్రహింసలు పెట్టేవారు.ఇక మా పోటి  బి,డి సెక్షన్ లతోనే. 


ఈ సంవత్సరం మనం గురుపూజోత్సవం ఎలా జరపాలన్న విషయం మీద చర్చలు మొదలైయ్యాయి. అందరి దగ్గరనుంచి డబ్బులు  వసూలు చేసే భాద్యత నేను తీసుకున్నాను.  తెలుగు సార్ ని పిలుద్దామని అనుకున్నాం. ఆయన కూడా వస్తానని చెప్పారు. 


క్లాసు మొత్తం రంగు కాగితాలతో అలంకరించడం, గురువు గారికి పూల దండ, ఆపిల్ పండ్లు సమర్పించడం వరకు అందరూ ఒప్పుకున్నారు. కానీ, మిగతా క్లాసులకన్నా మనం గొప్పగా చెయ్యడం ఎలా అన్న దగ్గర ఎవరికీ ఏమి తోచడం లేదు. ఇంతలో, దస్తగిరికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. పైన్నించి పూలు కురిపించాలని.  అదెలాగో కూడా దస్తగిరి చెప్పాడు. బెలూన్లలో పూలు నింపి, వాటిని పేల్చడం ద్వారా పూలు కురిపించొచ్చని . గత సంవత్సరం వాళ్ళ పాత స్కూల్ లో అలాగే చేసారట.ఇంకేం, ఆ భాద్యత తను తీసుకున్నాడు. 


సెప్టెంబర్ 5  రానే వచ్చింది. వసూలు చేసిన డబ్బులు ఆపిల్ పండ్లకు, రంగు కాగితాలకు, విడి పూలకు సరిగ్గా సరిపోయింది. ఇంకా బెలూన్లకు డబ్బులు అడిగితే, గురుపూజోత్సవం సంగతి దేవుడెరుగు, నాకు పూజ ఖాయం. అందుకని ఆ తిప్పలేవో దస్తాగిరినే పడమన్నాను. మా క్లాసు లోనే సురేష్ అనే అబ్బాయి ఉండేవాడు. "నేను, సురేష్ తెస్తాం లే" అని దస్తగిరి హామీ ఇచ్చాడు. నన్ను మాత్రం అగరుబత్తీలు తెమ్మని చెప్పాడు. బెలూన్లు పేల్చడానికీ, సార్ కుర్చీ ఎదురుగా ఉండే, టేబుల్ మీద పెట్టడానికీ. 


ముందు రోజు క్లాసు మొత్తం శుభ్రంగా చిమ్మి, రంగు కాగితాలతో అలంకరించడం వల్ల క్లాసు కు కూడా కొత్త కళ వచ్చింది. దస్తగిరి, సురేష్ బెలూన్లు, అందులో వేయడానికి బంతి పూలు తెచ్చారు. ఎరుపు, పసుపు రంగుల బంతి పూలు ముచ్చటగా ఉన్నాయి. పూల రేకులను జాగ్రత్తగా తుంచి బెలూన్లను నింపారు. మొత్తం మూడు బెలూన్లు తయారయ్యాయి. వాటిని టీచర్ కూర్చునే కుర్చీ పైన, రంగు కాగితాలు కట్టిన తాళ్ళకు ముడి వేసారు. అంతా సిద్దం అయ్యింది, నేను స్టాఫ్ రూం కు వెళ్ళాను గురువు గారిని పిలుచుకు రావడానికి. ఆయన పేరు సుబ్రమణ్య శర్మ. తెలుగు చాలా బాగా చెప్తారు.ముఖ్యంగా "విదురుని విందు" అనే పాటం ఆయన చెపితే మళ్లీ , మళ్లీ వినాలనిపించేది.


ఆయన క్లాసు లోకి రాగానే, అందరూ లేచి "గుడ్మార్నింగ్ సార్ "అని దీర్ఘాలు తీసారు. అందరినీ కూర్చోమని చెప్పి, శర్మ గారు కుర్చీలో కూర్చున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి, గురుపూజోత్సవం గురించి మరొక్క సారి చెప్పి, బాగా చదువుకోమని ఆశీర్వదించారు. ఇక మిగిలింది ఆయన్ను సన్మానించే కార్యక్రమం. క్లాసు లీడర్ను అయినందుకు నేను, ఈ కార్యక్రమంలో నాకు ఎక్కువగా సహకరించినందుకు దస్తగిరి, సురేష్ లు మాస్టారు కూర్చునే ప్లాట్ ఫారం మీద నించున్నాం. ఆయన మెడలో పూల దండ వేశాం. చిరునవ్వుతో స్వీకరించారు, ఇవన్నీ ఎందుకురా అంటూనే. ఇక బెలూన్లు పేల్చే పని నాది. నేను అగరుబత్తి తో బెలూన్లను పేల్చాను. పెద్ద శబ్దంతో రెండు బెలూన్లు పేలాయి.  పూలు జలజల మాష్టారు గారి మీద పడ్డాయి. బెలూన్లు పేలిన  శభ్దానికి, గాలి విసురుకూ అగరుబత్తి ఆరిపోయింది. మూడో బెలూన్ పేలలేదు.అదే మా కొంప ముంచింది. 


తన మీద పడ్డ పూలను చిరునవ్వుతో చూస్తూ, సార్ తల పైకెత్తి చూసారు . అంతవరకూ సాకేత రాముడిలా ప్రశాంతంగా ఉన్న ఆయన ఒక్కసారిగా పరశురాముడై పోయారు. "ఛీ..ఛీ" అంటూ, ఒక చేత్తో తనమీద పడ్డ పూలను విదిలించేస్తూ, మరో చేత్తో నా చెవి పట్టుకున్నారు. "వెధవల్లారా...ఎక్కడ్నుంచి తెచ్చారురా ఇవి, ఇది మీకు వచ్చిన ఆలోచనేనా " అంటూ. మాకందరికీ నిలువు గుడ్లు పడ్డాయి. బాధకు తట్టుకోలేక నేను సురేష్ వైపు, సురేష్  దస్తగిరి వైపు చూపించుకున్నాం. సురేష్ కు కూడా వీపు మీద ఒక దెబ్బ పడింది. రెండు చేతులతో మా ఇద్దరికీ సన్మానం జరగడం వల్ల దస్తగిరి మాత్రం బతికి పోయాడు.


జరిగిందేంటంటే, దస్తగిరి, సురేష్ లు తెచ్చిన బెలూన్లు,  "నిరోద్"లు. సురేష్ వాళ్ళ అమ్మగారు ప్రైమరీ హెల్త్ సెంటర్ లో నర్స్ గా పనిచేస్తారట. పేషంట్లకు పంపిణీ చెయ్యమని వాళ్లకు ఇచ్చిన పాకెట్లలోంచి వీళ్ళిద్దరూ కొన్ని నిరోద్ లు కొట్టుకొచ్చారు. డబ్బు ఖర్చుపెట్టక్కర లేదు కదా ని నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు . 
అయినా, ఇప్పటి పిల్లలకున్నంత లోకజ్ఞానం కూడా అప్పట్లో మాకెవ్వరికి ఉండేది కాదు కూడా. ఉచితంగా బెలూన్లు వస్తున్నాయన్న సంబరం తప్ప.


ఇప్పుడు గుర్తుచేసుకుంటే , ఆ దృశ్యం కూడా వికృతం గానే కనిపిస్తోంది. పగిలి వాలిపోయిన రెండు బెలూన్ల మధ్య, పేలని మూడో బెలూన్ గాలికి ఊగుతోంది. పాలిపోయిన మోఖాలతో నించున్న మమ్మల్ని చూసి ఏమనుకున్నారో ఏమో, "సరే, చేసింది చాలు, ఇక ఈ దరిద్రం అంతా శుభ్రం చెయ్యండి" అని ఆర్డరు వేసి శర్మ గారు క్లాసు లోంచి వెళ్లి పోయారు.


తర్వాత బిక్కు బిక్కు మంటూ, నేను, దస్తగిరి, సురేష్, ఇంకా క్లాసు లోని కొంతమంది పిల్లలు స్టాఫ్ రూం కు వెళ్లి, సార్ కు సారీ చెప్పి, ఆయన కోసం తెచ్చిన ఆపిల్ పండ్లు ఇచ్చి వచ్చాం. "ఇలాంటివి స్కూల్ లోకి తీసుకు రాకూడదు ..సరే వెళ్ళండి. పిచ్చి వేషాలు వెయ్యకుండా బాగా చదువుకోండి" అని అప్పటికి మమ్మల్ని వదిలేసారు. సార్ మమ్మల్ని చివాట్లు పెట్టిన బాధకన్నా, మిగతా సెక్షన్ల కు ఈ విషయం తెలియకుండా ఎలా దాచాలన్నది మా ముందున్న పెద్ద సమస్య. ఎలా చెయ్యడమా అని అందరం మల్ల గుల్లాలు పడుతుంటే, దస్తగిరి మాత్రం "అన్ని బెలూన్లు పగలలేదని సార్ కు కోపం వచ్చిందిరా...అంతే, ఇంకేమి కాదు" అని జరిగిన దారుణానికి ముక్తాయింపు పలికాడు. 
తర్వాత ఎక్కడ కనిపించినా, మా వైపు తెలుగు సార్ అనుమానంగా చూడడం, ఆయనను తప్పించుకు తిరగడంతో మా 9 తరగతి చదువు భారంగానే గడిచింది. 
ఇప్పుడు అమెరికా లో, పిల్లల పుట్టినరోజు ఫంక్షన్ లు చేసినప్పుడు, కాంఫెట్టి వేసిన బెలూన్లను పేలుస్తూనే ఉన్నాం. ప్రతిసారీ నాకు మేము చేసిన గురుపూజోత్సవమే గుర్తుకు వస్తుంది. 


దస్తగిరి తో నాకు ఎదురైన మరో అనుభవం రెండో భాగం లో వివరిస్తాను...అంత వరకూ సెలవ్.


~ శశిధర్ సంగరాజు. 







Friday, November 12, 2010

డే లైట్ సేవింగ్స్ టైం ....

అమెరికా లో నివసించే చాలామంది భారతీయుల లాగానే, నేను కూడా తరచూ ఇండియాలోని
బంధువులతో,  స్నేహితులతో ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాను. గత పదకొండు సంవత్సరాల్లో నేను గమనించిందేంటంటే, ఈ  సంభాషణల్లో  వాళ్ళు తప్పకుండా నన్ను అడిగే ఒక ప్రశ్న - "ఇప్పుడు అమెరికాలో టైం ఎంత అయింది?" అని. అమెరికా కు, ఇండియా కు ఉన్న ఈ టైం తేడా, గత ఆదివారం తో ఇంకొంచెం (ఆంటే, ఒక గంట) తగ్గింది.



అవును, ఆదివారం (నవంబర్ 7  తెల్ల వారు ఝామున, అంతే శనివారం అర్థరాత్రి తర్వాత)మేమంతా గడియారాల్లో టైం ఒక గంట వెనక్కు తిప్పుకున్నాం. అదేం పిచ్చి అనుకుంటున్నారా? అదంతే. అమెరికా లో, ఈ సంవత్సరానికి  నవంబర్ 7 తో "డే లైట్ సేవింగ్స్ టైం " ముగిసింది. ఈ "డే లైట్ సేవింగ్స్ టైం " మార్చి 14 న మొదలై, నవంబర్ 7 వరకు ఉంటుంది. 

అమెరికాలో స్ప్రింగ్ (వసంతకాలం)లో ఒక గంట ముందుకు, ఫాల్ (ఆకురాలేకాలం) లో ఒక గంట వెనక్కు టైం మార్చుకుంటాం.


"డే లైట్ సేవింగ్స్ టైం " ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఎండాకాలం లో సాయంకాలం ఎక్కువ సేపు వెలుతురును ఎంజాయ్ చెయ్యడం. వెలుతురు ఎక్కువ సేపు ఉంటుంది కాబట్టి,దూర ప్రాంతాలకు కార్లల్లో వెళ్ళే వాళ్లకు డ్రైవ్ చెయ్యడానికి కాస్త ఈజీ గా ఉంటుంది.

"డే లైట్ సేవింగ్స్ టైం " ముగిసిన తర్వాత అమెరికాలో ఈస్ట్ కోస్ట్ లో ఉండేవాళ్ళు, ఇండియా కన్నా పదిన్నర గంటలు వెనుక ఉంటాం. (ఈ విషయం లో మాత్రం అమెరికా ఇండియా కన్నా వెనకబడే వుంది.) ఉదాహరణకు, ఇప్పుడు అమెరికాలో శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నర అయితే, ఇండియా లో శనివారం ఉదయం ఎనిమిది గంటలు అవుతుంది. 

"డే లైట్ సేవింగ్స్ టైం " లో  అమెరికా కు , ఇండియా కు టైం లో ఉన్న తేడా తొమ్మిదిన్నర గంటలు. అప్పుడు అమెరికాలో శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నర అయితే, ఇండియా లో శనివారం ఉదయం ఏడు గంటలు అవుతుంది. 


అమెరికా లో మొత్తానికి 4 టైం జోన్స్ ఉన్నాయి. మీ సౌలభ్యం కోసం చార్ట్ కింద ఇస్తున్నాను. 





ఈస్టర్న్ టైంజోన్ కన్నా పసిఫిక్ టైంజోన్ 3 గంటలు వెనక్కు ఉంటుంది. 
ఈస్ట్ లో రాత్రి తొమ్మిది అయితే, సెంట్రల్ లో ఎనిమిది, మౌంటైన్ లో ఏడు, పసిఫిక్ లో ఆరు గంటలు అవుతుంది. 

చార్ట్ లో కింద అలాస్కా కనిపిస్తోంది కదా, అక్కడ ఇంకో విపరీతం. సంవత్సరం లో కొన్నిరోజులు 24 గంటలు వెలుతురు , కొన్ని రోజులు 24 గంటలు చీకటి ఉంటాయి. 24 గంటలు వెలుతురు ఉన్నప్పుడు అలాస్క కు వెళ్లి చూసి రావాలన్నది నాకున్న ఒక కోరిక. తీరుతుందనే ఆశ,నమ్మకం. 


అమెరికా కు వచ్చిన కొత్తలో ఈ గోల అర్థం కావడానికి నాకు ఒక సంవత్సరం పట్టింది. ఆమెరికా లోని తమ పిల్లల దగ్గరకు తరచూ వచ్చే వారికి ఈ విషయంలో కొంత అవగాహన ఉన్నా, ఇండియా లో ఉండే మిత్రులకు కొంత ఆసక్తికరంగా ఉంటుందనే భావిస్తాను. 

ఇండియా, అమెరికా కన్నా భౌగోళికంగా చిన్నదవ్వడం మూలాన, మనకు ఒక టైంజోన్ తో సరిపోయింది. పాకిస్తాన్ వాళ్ళు మాత్రం, ఈ టైం ముందుకు జరుపుకునే విషయం లో అమెరికాను చూసి వాతలు పెట్టుకోబోయి, ఆనక నాలుక కరుచుకున్నారని ఎక్కడో చదివాను. 


ఈ పోస్ట్ మీద మీ కామెంట్స్ తెలియజేయండి. 


~ శశిధర్ సంగరాజు.





 






Saturday, November 6, 2010

గరికిపాటి వారు....

నాకు,  రొటీన్ దినచర్య నుంచి కాస్త రిలీఫ్ కావాలనిపించినప్పుడు, లేదా ఎవరికోసమైనా ఎదురు చూడడమో, నా మినీ వ్యాన్ సర్విసింగ్ కు ఇచ్చినప్పుడో, ఆఖరికి ఆఫీసు లో లంచ్ బ్రేక్ లో సైతం,  కాలక్షేపానికి నేను  ఆశ్రయించే ఒకే ఒక సాధనం "యూ ట్యూబ్". నిజం గా "యూ ట్యూబ్" ద్వారా నేను పొందిన లాభాలు అన్నీ, ఇన్నీ కావు. టెక్నాలజీ నుంచి, సాహిత్యం దాకా అన్ని రంగాలను  "యూ ట్యూబ్" లో వెతికి పట్టుకుని, చూసి  ఆనందిస్తుంటాను. బోర్ కొట్టినప్పుడు టివి లో వచ్చే చెత్త ప్రోగ్రాములు చూడడం కన్నా,  "యూ ట్యూబ్" బ్రౌజ్ చెయ్యడం ఉత్తమం.

ఈ మధ్య, మా కార్ డీలర్ దగ్గర ఒక రెండు గంటల పాటు వెయిట్ చెయ్యాల్సి వచ్చింది ( నా మినీ వ్యాన్ సర్వీసింగ్ కోసం). వెయిటింగ్ లాంజ్ , ఫైవ్ స్టార్ హోటల్ రిసెప్షన్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉంది. చక్కటి రిక్లైనింగ్ సోఫాలు, పెద్ద పెద్ద  ఎల్సిడి టివి లు , కాఫీ మెషిన్ నుంచి తయారవుతున్న తాజా కాఫీ. ఇంకేమి కావాలీ, శుభ్రంగా కాళ్ళు జాపుకుని , ఐ-ఫోన్ లో  "యూ ట్యూబ్" వెతకడం మొదలు పెట్టాను.

మనసు సాహిత్యం వైపు మళ్ళింది. వెంటనే, నాకిష్టమైన పేరు టైపు చేసాను. "గరికిపాటి నరసింహారావు" అని సెర్చ్ మొదలెట్టగానే కొన్ని వీడియోలు  వచ్చాయి. నేను క్లిక్ చేసిన మొదటి లింక్ కింద ఇస్తున్నాను. గరికిపాటి వారి పేరు, సాహితీ ప్రియులకు చిర పరిచితమే అనుకుంటాను.  సహస్రావధానిగా,కవిగా, సాహితీ వేత్తగా, బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శించే గరికిపాటి వారు ఆంధ్రులవడం మన అద్రుష్టం .  మహానుభావుడు, సరస్వతీ కటాక్షం పుష్కలంగా పొందాడు. చతురతకు, భాష మీద పట్టుకు ఈయనే చిరునామా. మిగతా వారికి, ఈయనకు ఉన్న తేడా ఏమిటంటే, ఏ విషయాన్నైనా, సరళంగా, సరదాగా చెప్పడం ఈయన సొత్తు. సెల్ ఫోన్ల మీద గరికిపాటి వారి చమత్కారం చూడండి.  http://www.youtube.com/watch?v=jYyy6SVTPEY&feature=fvw

తెలుగు వన్ వెబ్ సైట్ లో ప్రసారమైన "సాహిత్యం లో హాస్యం" కార్యకమం లోనిది ఈ లింక్. ఈ సిరీస్ లోనే వచ్చిన మరికొన్ని ..
మిరపకాయ బజ్జి,
ఆంధ్రుల ఆవకాయ,
భోజరాజు సమక్షం లో కాళిదాసు చెప్పిన పద్యాలు, ఇంకా ఎన్నో, ఎన్నెన్నో...

మీకు వీలు దొరికితే "యూ ట్యూబ్" లో వెతకండి. మీ ఖాళీ సమయం తప్పకుండా సద్వినియోగం అవుతుంది.
ప్రయత్నిస్తారు కదూ,
మీ కేమైనా మంచి లింకు లు దొరికితే, నాకు కూడా పంపండి.

~శశిధర్ సంగరాజు.

Thursday, November 4, 2010

దీపావళి శుభాకాంక్షలు

బ్లాగ్ మిత్రులందరికీ,

మీకు, మీ కుటుంబసభ్యులకు 
దీపావళి శుభాకాంక్షలు. 

~ శశిధర్ సంగరాజు.