Powered By Blogger

Friday, December 24, 2010

చంద్రబాబు...జగన్.. ఓ పేదరైతు

ఎలాగైతేనేం, మొత్తానికి, రాష్ట్ర ప్రభుత్వం,  చంద్రబాబు దీక్ష భగ్నం చెయ్యగలిగింది. విజయవాడలో జగన్ చేపట్టిన దీక్ష 48 గంటలు మాత్రమే అని ముందుగానే చెప్పడం వల్ల అక్కడ అరెస్టులు లాంటి హడావిడి ఏమి లేకుండానే, ఆయనే దీక్ష ముగించేసారు. ఈ మొత్తం దీక్షా కార్యక్రమాలను, అమెరికాలో నాకు వీలున్నంతవరకు పేపర్లు, టీవీ ల ద్వారా ఫాలో అయ్యే ప్రయత్నం చేసాను .నాకొక విషయం అర్థం కాలేదు. నాయకుల దీక్షలు, వాటికైయ్యే బందోబస్తు, రక్షణకు వచ్చే పొలీసుల జీతభత్యాలు, ఈ నాయకులు, వారి అనుచరగణం చేసే ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, మళ్లీ వాటిని బాగు చెయ్యడానికయ్యే  ఖర్చు. ఇదంతా కలసి కొన్ని కోట్ల రూపాయలు ఉంటుంది. వీళ్ళంతా చేసే దీక్షలు రైతులకోసమే అయినప్పుడు, ఆ డబ్బేదో రైతులకిచ్చే ప్యాకేజ్ లోనే కలిపి ఇస్తే, పాపం రైతులకు కొంతైనా ప్రయోజనం ఉంటుంది కదా అనిపించింది. సరే, ఈ దీక్షలవల్ల రైతులకు ఏం ఒరిగింది అనే విషయం పక్కనపెడితే, రాజకీయ నాయకులకు ఎవరికెంత లాభమొచ్చిందో చూద్దాం. 


చంద్రబాబు (ఎంతైనా సీనియర్ కదా, ముందు ఆయన గురించే చెప్పుకుందాం): తెలంగాణా, సీమాంధ్ర రెండూ, రెండు కళ్ళు అనిచెప్పి దాదాపు చూపు పోగొట్టుకుంటున్న తరుణంలో, చంద్రబాబుకు ఈ దీక్ష భలే ఉపయోగపడింది. జాతీయ స్థాయిలో మీడియా కవరేజ్, జాతీయ నాయకుల పలకరింపులు మాత్రమే కాకుండా, సామాన్య ప్రజల్లో కూడా సానుభూతి కూడా పెరిగింది. దీనికి అధిష్టానం నిర్లక్ష్య, నిరంకుశ ధోరణి కూడా తోడైంది. అది వేరే విషయం. చంద్రబాబు పేరు చెపితే చిందులేసే అమెరికాలోని తెలుగు మిత్రుడు కూడా "పాపం, అరవై ఏళ్ళ వయసులో, బాగానే కష్టపడ్డాడు" అనేసాడు. సాక్షాత్తు, అధికార పార్టీ ఆరోగ్య మంత్రి డి.ఎల్.రవీంద్రారెడ్డి, జగన్ పెట్టబోయే పార్టీ కన్నా, తెలుగుదేశం వందరెట్లు మేలు అన్నాడంటే, బాబు దీక్ష ఫలప్రదమైనట్లే. మన టైంబాలేక మధ్యంతరం వస్తే, బాబును రైతు జనభాంధవుడు గా ప్రొజెక్ట్ చెయ్యడానికి తెదేపా శ్రేణులు కదం తొక్కుతాయి. సందేహం లేదు. 

జగన్: ప్రత్యక్ష రాజకీయాల్లో, నిండా రెండు సంవత్సరాల సీనియారిటీ కూడా లేని బుడ్డోడు, 125  సంవత్సరాల (వాళ్ళే చెప్పుకున్నారు) వయసున్న కాంగ్రెస్ పార్టీ కి సినిమా చూపించేసాడు. అంతవరకూ, "అబ్బే, ఇప్పుడు జగన్ వెనకాల పదిమంది కంటే ఎక్కువమంది లేరని" చప్పరించేసిన సీనియర్లకు, దాదాపు పాతిక పైచిలుకు ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు ఎంపీలు, వందల సంఖ్యలో వచ్చిన కార్యకర్తలను చూసి పొలమారి ఉంటుంది. ఇంతవరకూ అటూ, ఇటూ గా ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు, ఈ దీక్ష పుణ్యమా అని తెరముందుకొచ్చి తొడలు కొట్టేస్తున్నారు. జీవిత, రాజశేఖర్ లాంటి పక్క వాయిద్యాలు మామూలే. ఈ సారి తానుకూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేస్తానని రాజశేఖర్ వార్నింగ్ కూడా ఇచ్చేసాడు. ఇక మీ ఇష్టం. ఈ లెక్కన దీక్ష, జగన్ కు కూడా బ్రంహాండంగా కలిసొచ్చింది.


పేదరైతు: ఆంబోతుల కుమ్ములాటలో నలిగిపోయిన లేగదూడలా, పాపం, ఒకవైపు పంట నష్టం, మరోవైపు కౌలుదారుల ఒత్తిడి, కోతకొచ్చిన పంట పొలంలోనే కుళ్ళిపోతూఉంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఈ మొత్తం ప్రహసనం లో పూర్తిగా నష్టపోయింది రైతే. ఈ పరిస్థితే కొనసాగితే, ఇక ముందు ముందు, నాట్లు వెయ్యడానికికూడా ఎవరూ ముందుకు రారేమో.


అదేదో సినిమాలో సాయికుమార్ డైలాగు చెప్పినట్లు, ప్రస్తుతం రాష్ట్రం లో కనపడని నాలుగో సింహం ఒకటి తిరుగుతోంది. అదే, చిరంజీవి..రంజీవి..జీవి..వి..(ఇక్కడ కావాలంటే, మీరు స్పెషల్ ఎఫ్ఫెక్ట్స్ వేసుకోవచ్చు) .తాజా రాజకీయ పరిణామాలవల్ల ఈయనకు కూడా ఒక లాభం జరిగింది. అదెలాగంటే, ఇంతకుముందు, ప్రెస్ మీట్లలో విలేఖర్లు "ఫలానా వారు మీ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారట కదా?" అని అడిగితే , "అవునా?" అంటూ అముల్ బేబీ పేస్ పెట్టేవాడు. ఇంక లెక్క చూసుకోక తప్పేట్లు లేదు. ముగ్గురు బహిరంగంగానే జగన్ దీక్షలో పాల్గొని మద్దతిచ్చేసారు. మిగిలిన వాళ్ళు ఎప్పుడు జంప్ జిలాని అవుదామా అని ఎదురుచూస్తున్నారు. పోన్లెండి, ఈ రకంగానైనా తనవాళ్ళెవరో , పైవాళ్ళెవరో తెలిసొస్తుంది.


~శశిధర్ సంగరాజు.

8 comments:

Anonymous said...

ha ha ..

రాజకీయమా మజాకా !

karlapalem Hanumantha Rao said...

మీ విశ్లేషణ బాగుంది .ముఖ్యంగా కనబడని ఆ నాలుగో సింహాన్ని గురించి ...

జర్నో ముచ్చట్లు said...

రాష్ట్రంలో రాజకీయం అంతా రచ్చ రచ్చగా ఉంది. రాష్ట్రం ఏమిలే.. ఖర్మ! దేశ పరిస్థితీ అలాగే ఉంది. అన్నం పెట్టేవాడిని ఎవరూ పట్టించుకోవడం లేదు. మొత్తానికి.. ఏదో అమెరికాలో ఉన్నాను.. సంతోషంగా సాఫ్టువేర్‌ ఉద్యోగం చేస్తున్నాను.. రాష్ట్రం ఏమైతే నాకేంటి..? అనుకోకుండా.. తరచూ రాష్ట్రం గురించి, ఇక్కడి పరిస్థితుల గురించీ ఆలోచిస్తున్నందుకు నిన్ను అభినందించాలి.
విజయ్‌

dinesh mynampati said...

Good analysis. U forgot to mention first and official lion(present cm). all show’s of babu and jagan was to get CM assurance for farmers. Unfortunately,he did’t not receive his speech from 10 janpath. This the fate of the state if you have a remote controls instead of a CM.

Sasidhar said...

@a2zdreams --
@vcvenkatapathy --

Thanks for the comments.

@kalapalem hanumantharao --
Thanks sir for the comments. ఈనాడులో ప్రచురితమైన మీ "యాత్రారాజకీయాలు" చదివాను. చాలా బాగుంది. మీరు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారా?


@జర్నో.. - మీరు చెప్పింది నిజం. రాష్ట్రం / దేశం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మీ కామెంట్స్ కు ధన్యవాదాలు.

@AMPIAPCON2007 --
You are right. But, I didnt spare the present CM...I probably write a separate post about him. Anyway, Appreciate your comments. Thanks

~Sasidhar

Unknown said...

శశిధర్ గారికి ,
చాలా బాగా చెప్పారు అండి . మేము కూడా ఇక్కడే అమెరికా లో Sr Software Engineer గా ఉద్యోగం చేస్తున్నాము అండి . నాకు మీ నుండి ఒక చిన్న సహాయం ( నాకు అది పెద్ద సహాయమే సుమండీ ) కావాలి అండి .. వివరాలు ఈ మెయిల్ లో వివరిస్తాను . కొంచెం మీరు నాకొక టెస్ట్ ఈమెయిలు నా ఈమెయిలు harshithkumar321@gmail.com కి కొట్టగలుగుతరా మీకు ఈమెయిల్ లో వివరిస్తాను అండి

Sasidhar said...

@harshith--
How are you. Please give me your phone number here in the comments box..I will call u...that would be easy

~Sasidhar

MALLI said...

శశిధర్ గారు, మీ వ్యాసం బాగుంది. సమకాలీన పరిస్థితులపై స్పందించినందుకు కృతఙ్ఞతలు. ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు ప్రజా శ్రేయస్సుపై చిత్త శుద్ధి ఉంటే, ఈ ధర్నాలు, గర్జనలు, ఆమరణ నిరాహార దీక్షలు ఎందుకు అవసరం అవుతాయి? ఇదంతా కుర్చీలాట తప్ప ఇంకోటి కాదు. అంటే అధికారంలో ఉన్నవారు స్పందించలేదని, ప్రతిపక్షాలు ఆరోపిస్తే, మీకంటే మెరుగ్గా పనిచేస్తున్నామని అధికారంలో ఉన్నవారు చెప్పటం వంటివి, రాజకీయ లాభం పొందటం వంటివి వగైరా. రోజు రోజుకీ బయల్పడుతున్న కుంభకోణాలలో, మన దేశం నష్ట పోతున్న ధనంతో పోలిస్తే, రైతులకు వీరు ఇచ్చే నష్ట పరిహారం ఏపాటి? రైతులు ఎవరినీ బిచ్చం అడగటం లేదు. వారు స్వయం సమృద్ధి సాధించేందుకు తోడ్పాటు అందించమని అడుగుతున్నారు. దీనిని వదిలేసి, తాత్కాలిక పరిష్కారాలు ఆలోచిస్తే రైతు పరిస్థితి ఎప్పటికీ బాగుపడదు. నాకు తెలిసి, ఎన్ని సార్లు రుణాలు మాఫీ చెయ్యలేదు? నష్ట పరిహారం ఇవ్వలేదు? కాని ఇవన్నీ చేసాక కూడా ఇంకా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది? ఇవన్నీ ఆలోచిస్తే తాత్కాలిక పరిష్కారాలు చూపే స్థితి నుంచి మనం ఇంకా ఎదగలేదోమోనని అనిపిస్తుంది. మీకు వీలయితే, నేను వ్రాసిన "దేశానికి వెన్నెముక ఈ రైతేనా" చదవండి. నచ్చితే చెప్పండి.