Powered By Blogger

Sunday, December 12, 2010

నాగబాబు ఆవేదన - నిజమేనా?

ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు, సినీ రంగంలో నిర్మాతలకు విలువ లేదనీ, సినిమా నిర్మాణం లో తమ మాట చెల్లడం లేదనీ, అందరూ కలసి నిర్మాతను నాశనం చేస్తున్నారనీ ఆక్రోశం వెలిబుచ్చారు. కానీ, కొంచెం లోతుగా ఆలోచిస్తే, నాగాబాబుది నిజమైన ఆవేదనా?లేక మనసులో ఏదో పెట్టుకుని వెళ్ళగక్కిన కడుపు మంటా అన్న అనుమానం కలుగుతోంది. 

పెద్ద నిర్మాతలమైన తమ పరిస్థితే ఇలా ఉంటే, చిన్న నిర్మాతల గతి ఏమిటని ఆయన వాక్రుచ్చారు. కాకపోతే, ఒకటి ఆయన ఈమధ్యన తీసిన "ఆరంజ్" అనే కళాఖండం బాక్సాఫీస్ దగ్గర బోర్లా పడ్డం, తద్వారా కోట్ల రూపాయలు నష్టం రావడంతో, ఆ బాధ తట్టుకోలేక, ఇలా చిన్న నిర్మాతల సంక్షేమం అన్న అంశాన్ని తెరపైకి తెచ్చారనేది నిర్వివాదాంశం.  

రాష్ట్రం లోని మెజారిటీ థియేటర్లను తమ గుప్పిట్లో పెట్టుకుని, చిన్న సినిమాలను కనీసం విడుదల చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా, చిన్న నిర్మాతల ఉసురు పోసుకుంటున్నది  ఈయన లాంటి పెద్దచేపలే అన్న విషయం మరచిపోయి ఎవరిమీదో అభాండాలు వెయ్యడం ఎంతవరకు సబబు?

నాగబాబు ఒక టివి ఛానల్ చర్చాకార్యక్రమం లో పాల్గొన్నారు. తాను ఎవరినీ విమర్శించడం లేదంటూనే, టెక్నీషియన్ల వల్లనే సినిమా నిర్మాణం ఆలస్యం అవుతోందని, బడ్జెట్ అదుపు తప్పి పోతోందనీ చెప్పారు. అసలు క్రేజీ కాంబినేషన్ కోసం పాకులాడి (ఆంటే, ఎలక హీరో, పిలక హీరోయిన్, తోక డైరెక్టర్ ) అవసరం ఉన్నా, లేకున్నా కోట్లు కుమ్మరించి నిర్మాణ వ్యయం పెంచుకునేది వీళ్ళే. ఆ కార్యక్రమ చూసాక, "ఆరంజ్" సినిమా చూసాను. అంతవరకూ చూసే సాహసం చెయ్యలేదు. సినిమా చూసాక అనిపించింది, ఇది మామూలు మనుషులకు ఎక్కే సినిమా కాదని. ఇంతోటి సినిమా ఇందిరా పార్క్ లో తీసినా సరిపొయ్యేది. ఆస్ట్రేలియా కు వెళ్ళడం ఎందుకు? 


ఈ సినిమా అనేకాదు, విదేశాల్లో సినిమా షూటింగ్ చెయ్యడం ఒక అంటురోగంలా తయారైంది. కథకు సంబంధం ఉంటే అదో విషయం.హీరోయిన్ ముగ్గుపిండి, హీరో తాటిముంజెలు అమ్ముకుంటుంటారు. వీళ్ళిద్దరి డ్రీంసాంగ్ ఆల్ఫ్ పర్వతాల్లోనో, నయాగరా జలపాతం పక్కనో చిత్రీకరిస్తారు. పైగా జిగేల్మనే డ్రెస్సులు (ఇవి కేవలం హీరో కాస్ట్యుం లు మాత్రమే, హీరోయిన్ కు ఎప్పుడూ గుడ్డ పేలికలే, అదృష్టం బాగుండి, వీళ్ళ షూటింగ్ లు జరిగే ప్రదేశంలో కాస్త చలి ఎక్కువగా ఉంటే, ఇంకొన్ని గుడ్డ పేలికలు చుట్టబెడతారు అంతే). కలలు గొప్పగా ఉండొచ్చు, తప్పు లేదు కానీ, మరి అన్ని కోట్లు ఖర్చు చేసి రిచ్ గా తియ్యాలనుకున్నప్పుడు రిస్క్ కూడా ఉంటుంది. కేవలం డైరెక్టర్ ను విమర్శించడం మంచిది కాదు. కథ అద్భుతం గా ఉంటే, విదేశాల్లో చిత్రీకరించే పాటలు అదనపు ఆకర్షణ అవుతాయి కానీ, అసలు కథ లో పట్టులేకపోతే ఆస్ట్రేలియా లో తీసినా, ఆముదాలవలస లో తీసినా ఒకటే.


అదే, "ఆరంజ్" ఘనవిజయం సాదించి ఉంటే అప్పుడు కూడా నిర్మాణ వ్యయం పెరిగిందనీ, ఆలస్యం చేసారనీ, అనేవాళ్ళా? మెగా పవర్ స్టార్ కు హ్యాట్రిక్ విజయం అని విజయోత్సవాలు నిర్వహించే వాళ్ళేగా?మగధీర కూడా కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా.విజయం కూడా అదే స్థాయిలో దక్కింది కదా?


చిత్ర నిర్మాణం,  నిర్మాతగా మీకు నిజంగా సంత్రుప్తినివ్వకపోతే, ఆ డైరెక్టర్ ను మార్చడమో, అనవసరమైన ఖర్చును అదుపు చెయ్యడమో ఎంత పని?ఏమో, ఆడుతుందేమో అన్న ఆశ. ఫలితం మాడు పగిలేలా ఉంటే మాత్రం ఓర్చుకోలేరు.

మీరూ గాంబ్లింగ్ ఆడుతున్నారు, దానికి నిర్మాతలను బతకనివ్వడం లేదని మీడియా ముందు గొంతు చించుకోవడం దేనికి?

~శశిధర్ సంగరాజు. 

4 comments:

Anonymous said...

Orange ghana vijayam sadhinchakapoyina manchi vijayam sadhinchindi


Ika nagababu cheppindi correct ehh kaani wrong time lo cheppadu..ade 3 months taruvtha chebite bagundedi

Anonymous said...

Good post. Agree with you.

జర్నో ముచ్చట్లు said...

గొంగట్లో తింటూ ఎంట్రుకలు ఏరుతున్నట్లుంది నాగబాబు వ్యవహారం. హీరో, స్వయానా అన్నయ్య గారి అబ్బాయి.. డైరెక్టర్‌ చెప్పుచేతల్లో ఉండే భాస్కర్‌.. పైగా స్వీయ నిర్మాణం. బుద్దుండొద్దూ.. నిర్మాణ వ్యయాన్ని అదుపులో ఉంచుకోవాలని.? బావగారు మగధీరను ఘనంగా తీశారని.. తనూ అదే రేంజ్‌లో ఖర్చు చేయాలన్న ప్రిస్టేజీకి పోవడం వల్ల కాదూ.. ఇలా చేతులు కాల్చుకుంది. ఇప్పుడు టెక్నీషియన్ల మీద విరుచుకుపడడం నష్ట నివారణ చర్యగానే కనిపిస్తుంది. శశీ, మంచి పోస్ట్‌ వేశావ్‌. అభినందనలు.

Sasidhar said...

@గంగాధర్ -- మీరు చెప్పింది కూడా నిజమే. కొంత కాలం ఆగినతర్వాత ఈ స్టేట్మెంట్ ఇచ్చిఉంటే బాగుండేది.
వెంటనే బయటపడ్డంవల్ల, ఆయన సినిమా ఆడలేదన్న ఉక్రోషమే ఎక్కువగా కనపడుతోంది. మీ కామెంట్స్ కు థ్యాంక్స్ .

@anonymous -- థ్యాంక్స్

@జర్నో...విజయ్ గారు, థ్యాంక్స్ ఫర్ ది కామెంట్స్. మీ దీక్ష, యాత్ర శుభప్రదంగా జరగాలని భగవంతున్ని ప్రార్ధిస్తాను.