Powered By Blogger

Friday, December 3, 2010

" ధర్నాంధ్ర" ప్రదేశ్

టైటిల్ చూసి కంగారు పడకండి, దేవుడి దయవల్ల ఆంధ్ర ప్రదేశ్ ఇంకా పేరు మార్చుకోలేదు. కానీ, ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఆ రోజు కూడా ఎక్కువ దూరంలో లేదు. 

అవును, ప్రస్తుతం రాష్ట్రం లో పలు సంఘాలు/గ్రూపులు/రాజకీయ పక్షాలు/జేఏసి లు కలసి గానీ, విడివిడిగా కానీ  ధర్నాలకు పిలుపునిచ్చాయి. అధికారిక లెక్కల ప్రకారం ఈ ధర్నాలు దాదాపు 17 దాకా ఉన్నాయి. వాళ్ళు , వీళ్ళు అని తేడా లేకుండా, దాదాపు అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదే ఉన్నారు. అప్పటికీ, కొత్త ముఖ్యమంత్రి (ప్రతిపక్షాల భాషలో మూడో కృష్ణుడు)ఉద్యోగసంఘాలను బతిమాలో, బామాలో కొంత (ఆంటే 15 రోజులు ) గడువు   పొందారు. కొత్త ప్రభుత్వం కాబట్టి సర్దుకోడానికి కాస్త టైం ఇస్తామనీ, తర్వాత కూడా డిమాండ్లు తీర్చక పొతే, మళ్లీ ధర్నాలు మొదలెట్టి ఇంకా ఉధృతం చేస్తామనీ ఉద్యోగ సంఘాలు ఆల్టిమేటం ఇచ్చాయి. 

సరే, ప్రజాస్వామ్యంలో తమ నిరసనలు తెలియ చేయడానికి ధర్నా చెయ్యడం ఒక విధానం. ఒప్పుకుంటాం. కానీ, ఈ మధ్య ధర్నాలు కొన్ని సందర్భాల్లో మరింత చికాకు కలిగిస్తున్నాయి. ధర్నాల వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నా, ఎవరికి చెప్పుకోవాలో తెలియని వర్గం ఒకటుంది. వాళ్ళే , స్కూల్ పిల్లలు.  

ఈ మధ్య టీవీ లో చూసాను.కొన్ని విద్యార్ధి సంఘాలు ధర్నాల పేరిట స్కూల్లకు వెళ్లి పిల్లలను క్లాసు లు బహిష్కరించమని ఇబ్బంది పెడుతున్నాయట. ఆ టీవీ వాళ్ళు, పిల్లల ఇంటర్వ్యూ లు కూడా ప్రసారం చేసారు. ఆ పిల్లల తిప్పలు చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. 

ఒక అబ్బాయైతే, ఈ సంవత్సరం తనది పదో తరగతి అనీ, ఈ ధర్నాల మూలంగా క్లాసు లు సరిగ్గా జరగడం లేదనీ, ఇలాగైతే పరీక్షలకు ఎలా ప్రిపేర్ కావాలో తెలియడం లేదనీ వాపోయాడు. ఇంకో అమ్మాయిది మరీ ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులట. ఉదయం పిల్లలను స్కూల్ల కు  పంపి వాళ్ళు ఇంటికి తాళం వేసేసి తమ ఉద్యోగ నిమిత్తం  బయటకు వెళ్లి పోతారట. మళ్లీ తిరిగిరావడం, పిల్లలు స్కూల్ నుంచి తిరిగి వచ్చే సమయానికి.ధర్నాల మూలంగా, స్కూల్ అర్ధాంతరంగా అయిపోవడంతో, ఇంటికి తిరిగి వెళ్ళే తాము ఒంటరిగా ఉండాల్సి వస్తోందనీ  తద్వారా మానసిక ఒత్తిడికి గురవుతున్నామనీ చెప్పింది. మహానగరాల్లో తల్లి ఒకవైపు, తండ్రి ఒకవైపు ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు వెంటనే పనులు మానుకుని ఇంటికి రావడం కూడా సాధ్యం అయ్యే పని కాదు. చాలామంది విద్యార్థులు, ఈ ధర్నాల మూలంగా విద్యాసంవత్సరం కోల్పోయే పరిస్థితి కూడా ఎదురవుతుంది.


మా బంధువులబ్బాయి హైదరాబాద్ లో ఒక కార్పోరేట్ విద్యా సంస్థలో చదువుతున్నాడు. అన్నివిద్యా సంస్థలలో ఉన్నట్లే, వాళ్ళ కాలేజ్ లో కూడా ఎక్కువగా యూనిట్ టెస్ట్ లు వగైరా జరుపుతుంటారు. కానీ, ఈ సారి మాత్రం, డిసెంబర్ 6  (బ్లాక్ ఫ్రైడే ) న  , డిసెంబర్ 31  (తెలంగాణా పై శ్రీ కృష్ణ కమిటి ప్రకటన) తర్వాత  జరిగే ఆందోళనల్లో క్లాసులు  ఎలాగూ జరగనివ్వరు కాబట్టి, ప్రస్తుతానికి టెస్ట్ లు పక్కన పెట్టి, హడావిడిగా సిలబస్ పూర్తి చెయ్యడం పై దృష్టి పెట్టారట. 

ధర్నాలు, రాస్తారోకోలవల్ల సామాన్య ప్రజానీకం ఎలాగూ ఇబ్బందులు పడుతున్నారు. కనీసం, స్కూల్ పిల్లలనైనా మినహాయించాలని నా అభిప్రాయం. 

మీరేమంటారు.

~ శశిధర్ సంగరాజు.

4 comments:

Indian Minerva said...

ధర్నాలు చేసే హక్కు నిస్సందేహంగా వుంది కానీ అది ఏదైనా ఒక grounds ని అద్దెకి తీసుకొని ఇతరులకిబ్బంది కలగకుండా చేసుకున్నంతవరకే. ఎంత మానవీయ కారణాలైనా, ఆచేసేది ఎవ్వరైనా ధర్నాలు/రాస్తారోకోల పేరుతో జనజీవనానికి ఇబ్బంది కలిగించేవాళ్ళకు కనీసం మూణ్ణెళ్ళకు తక్కువకాకుండా జైలుశిక్ష విధిస్తే సరి ఆఖరికి రైతులు, ప్రజలైనా కూడా. ఎవడికో ఏదో ఐతే మిగతా వాళ్ళ కడుపులెందుకు కాలాలి? వాళ్ళెందుకు చావాలి?

ఇదే విధానాల్ని అసెంబ్లీల్లోనూ, పార్లమెంటుల్లోనూ అవలంభించామనుకోండి పోడియంల దగ్గర బైఠాయింపులు, దూషణ పర్వాలు, గుద్దులాటలూ మాయమవుతాయి. కొంతవరకైనా హుందాగా వ్యవహరించడం నేర్చుకుంటారు మన నేతలు.

ఆ విధంగా ఏదైనా రాజ్యాంగ సవరణ చేయగలిగితే బాగుండు.

SatyaMurthyABN said...

శ‌శి, ద‌స్తగిరి మూడో భాగం కోసం ఎదురు చూస్తున్నాను.

Sasidhar said...

@Indian Minerva
Thank you very much for your comments. I totally agree with you. There should be a check for this meaningless dharnaa/harthals

~Sasidhar

Sasidhar said...

@మూర్తి

తప్పకుండా, దస్తగిరితో నా అనుభవాలు మీ అందరితో పంచుకుంటాను. దస్తగిరి 1, 2 వెంటనే గుర్తుకు వచ్చేవి.వీలువెంట గుర్తుకు తెచ్చుకుని రాస్తాను.

~శశిధర్