Powered By Blogger

Thursday, December 16, 2010

దస్తగిరి పార్ట్ 3 : బ్లాక్ బోర్డ్

నేను దస్తగిరి పార్ట్ I , పార్ట్ II  రాసిన తర్వాత, మిత్రులనుంచి అందిన ప్రోత్సాహం, అభినందనలు మరువలేనివి.  9  వతరగతిలో జరిగిన మరో చిన్న జ్జ్ఞాపకాన్ని మీ అందరితో పంచుకోవాలని ఈ పోస్ట్ రాస్తున్నాను. చదవండి మరి. 
****************************
9 వ తరగతిలో ఉన్నప్పుడు, మేము మహా సరదాగా, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే అంశం, బ్లాక్ బోర్డుకు ఆకు పూయడం. అదెలాగంటే, మా మునిసిపల్ హైస్కూల్ 1857 లో స్థాపించారు. బ్రిటిష్ కాలం లో కట్టిన బిల్డింగ్ అవ్వడం మూలాన తరగతి గదులు విశాలంగా, గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలాగా ఉండేవి. మా క్లాసు లోకి ఎంటర్ అవ్వగానే, తలుపుకు ఎదురుగా, ఎత్తైన అరుగు (ప్లాట్ ఫాం) ,దానిపైన, టీచర్ కూర్చోడానికి ఒక చైర్, చైర్ కు ఎదురుగా ఒక టేబుల్ ఉండేవి. సరిగ్గా, టీచర్ కూర్చునే చైర్ కు వెనకాల బ్లాక్ బోర్డు ఉండేది. ప్లాట్ ఫాం కు ఎదురుగా, గదికి అటువైపున రెండు పెద్ద, పెద్ద కిటికీలు ఉండేవి. కిటికీల వల్ల మా కొచ్చిన నష్టం ఏమీ లేదుకానీ, కిటికీ లోంచి వచ్చే సూర్యరశ్మి, బోర్డు మీద పడి, పరావర్తనం చెంది, బోర్డు మీద రాసే అక్షరాలు కనిపించేవి కావు. బోర్డు కూడా బాగా వాడడం వల్ల, నునుపుగా తయారై, దాదాపు, సగం బోర్డు మీద ఏమి రాస్తున్నారో కింద కూర్చున్న వాళ్లకు కనిపించేది కాదు.


నోట్స్ లు రాసుకోవడానికి బద్దకించేవాళ్ళు మాత్రం ఒకటి, రెండు సార్లు గట్టిగా "అక్షరాలు కనిపించడం లేదు సార్" అనేసి, తర్వాత నోట్స్ లు బ్యాగ్ లలో సర్దేసి కబుర్లు చెప్పుకునేవారు. ముందువరస లో కూర్చునే మాకు మాత్రం మహా ఇబ్బందిగా ఉండేది. మా లెక్కల సార్, మా పుస్తకాల్లోకి తొంగి చూసి మరీ "రాసుకున్నారా?" అని రెట్టించి అడిగేవారు. కొంతమంది, బోర్డు మీద రాసింది సరిగ్గా కనపడక, నోట్స్ లు చేతిలో పట్టుకుని క్లాసు మొత్తం అటూ, ఇటూ తిరుగుతూ రాసుకునే వాళ్ళు. 


మా తిప్పలు గమనించిన మా లెక్కల సార్, "మీకు, SUPW కానీ, వీవింగ్ కానీ ఉన్నప్పుడు, కొంచెం బోర్డు కు ఆకు పుయ్యండ్రా, అక్షరాలు సరిగ్గా కనపడతాయి." అనే వారు. SUPW సెక్షన్ లో మాకు ఎప్పుడూ, ఏమీ చెప్పిన పాపాన పోలేదు. నోట్ పుస్తకాల్లో, పిచ్చి బొమ్మలు వేసుకోవడమో, సినిమా కథలు చెప్పుకోవడమో చేసేవాళ్ళం.అసలు, ఏమి నేర్పించే ఉద్దేశ్యం తో ఆ సెక్షన్ పెట్టారో, అప్పుడే కాదు, ఇప్పుడు కూడా నాకు తెలియదు. వీవింగ్ క్లాసులు మాత్రం, మెయిన్ బిల్డింగ్ కు పక్కన ఉన్న ఇంకో చిన్న బిల్డింగ్ లో జరిగేవి. జరగడం అంటే, వీవింగ్ సార్ మమ్మల్ని వరండాలో కూర్చోపెట్టేవారు. లోపల గదిలో మగ్గాలు, వాటికి వేలాడుతూ రకరకాల దారాలు ఉండేవి. ఎందుకో తెలియదు కానీ, ఆ రూం కు తాళం కూడా ఉండేది. మమ్మల్ని ఒక్కరోజు కూడా మగ్గం ముట్టుకోనిచ్చేవాళ్ళు కాదు. మేము బయట వరండాలో కూర్చుని,  లోపల ఉన్న మగ్గాల్ని, బోనులో ఉన్న జంతువుల్ని చూసినట్లు చూస్తూ ఉండేవాళ్ళం. ఈ రెండు క్లాస్సుల్లో మేము నేర్చుకుని ఉద్ధరించేది ఏమీ లేదు కాబట్టి, బోర్డు కు ఆకు పూసే కార్యక్రమం అప్పగించారు, మా లెక్కల సార్. 


బోర్డు కు ఆకు పూయడం వెనుక ముఖ్య ఉద్దేశ్యం, బోర్డు ను నల్లగా, గరుకుగా తయారు చెయ్యడం. దీనికి కావాల్సిన ముడి పదార్థాలు - సుంకేసుల చెట్ల ఆకులు (ఏ చెట్టు ఆకు అయినా సరిపోతుందేమో, ఆ చెట్లు మా స్కూల్ కాంపౌండ్ లో ఉండడం వల్ల, ఆ ఆకులు వాడేవాళ్ళం.), బొగ్గులు. దస్తగిరి, దాదాపు తొమ్మిదో తరగతి మధ్యలో మా క్లాసు కు వచ్చాడు. అంతవరకూ, మేము బోర్డులో మూడొంతులు మాత్రమే నలుపు చెయ్యగలిగే వాళ్ళం. అందరికీ, చేతులు అంతవరకే అందేవి. దస్తగిరి పొడవు కాబట్టి మాకు ఆ సమస్య కూడా తీరిపోయింది. ఇక రెండో సమస్య బొగ్గులు. 

ఈ కార్యక్రమానికి బొగ్గులు చాలానే కావలసి వచ్చేవి. బోర్డు కు నలుపు రంగు వచ్చేది బొగ్గుల వాడకం వల్లనే. ఆకు, కేవలం గరుకుదనానికి వాడేవాళ్ళం. స్కూల్ బయట మొక్కజొన్న పొత్తుల బండ్ల దగ్గర కొన్ని బొగ్గులు సంపాదించినా, ఇంకా కావాల్సి వచ్చేవి. దీనికీ, దస్తగిరి ఒక ఉపాయం చెప్పాడు. మా స్కూల్ వెనకవైపున (స్టేడియం దగ్గర) ఒక లాండ్రీ షాప్ ఉండేది. వాళ్ళ దగ్గరికి వెళ్లి అడుగుదామని.అలాగే, కొంతమందిమి వెళ్లి అడిగాము కూడా. స్కూల్ పిల్లలు అడిగేసరికి వాళ్ళు కూడా వెంటనే ఇచ్చేవాళ్ళు. 


సుంకేసుల చెట్లు మా స్కూల్ లోనే ఉండడం వల్ల వాటికేమి ఇబ్బంది లేదు. ఆ చెట్టు ఆకులు పలుచగా, చిన్నగా ఉండేవి. చెట్టుకు కాసే కాయలు (అవును, కాయలే) మాత్రం లోపల గింజలతో  మోచేతి పొడవు, రెండు, మూడు వేళ్ళ వెడల్పు ఉండేవి. ఎండి రాలిపోయిన కాయలు, అటూ, ఇటూ కదిపితే, ఎండిన గింజల వల్ల గల, గలా శభ్దం వచ్చేది. ఎన్టీఆర్, కాంతారావు జానపద సినిమాలు చూసిన ప్రభావంతో   ఇంటర్వల్ లో, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో ఈ కాయలతో మేము కత్తియుద్ధం చేసేవాళ్ళం. ఎవరి చేతిలోని కాయ విరిగిపోతే, వాళ్ళు ఓడిపోయినట్లు లెక్క.


బోర్డు కు ఆకు పుయ్యాలంటే, కనీసం నలుగురైదుగురు కావాల్సి వచ్చేది. ఇది నాజూకుగా చేసే పని కాకపోవడం, పని పూర్తైన తర్వాత అందరి చేతులు నల్లగా, అసహ్యం గా తయారవడంతో ఎవరూ ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అందరిని కూడగట్టే పని దస్తగిరికి అప్పగించేవాన్ని. ఏం మంత్రం వేసేవాడో కానీ, నేను పిలిస్తే మొహమాటానికైనా వస్తామని అనని వాళ్ళు, కనీసం ఇంకో నలుగురైనా వచ్చేవాళ్ళు. తర్వాత తెలిసింది, మర్యాదగా ఒప్పుకోని వాళ్ళను, దస్తగిరి బెదిరించేవాడట. "వచ్చి బోర్డుకు ఆకు పూస్తారా? లేకపోతే మీ సైకిల్ టైర్ లలో గాలి తీసేసి, వాల్ట్యూబ్ లు తీసుకెళ్ళాలా? అని". టైర్లలో గాలి పోతే, పదిపైసలిస్తే గాలికొడతారు కానీ, వాల్ట్యూబ్ పోతే మాత్రం అర్ధరూపాయి దాకా ఛార్జ్ చేసేవాళ్ళు. ఈ హింస భరించలేక చచ్చినట్లు ఒప్పుకునేవాళ్ళు. 


బొగ్గులు, సుంకేసుల ఆకులు కలిపి ముద్దగా నూరి, ఆ ముద్దను, బోర్డు కు పూసే వాళ్ళం. మరుసటిరోజు ఉదయం స్కూల్ కు వచ్చేసరికి నిగ,నిగలాడుతూ బ్లాక్ బోర్డు రెడీ. నోట్స్ రాసుకోకుండా తిరిగే వాళ్లకు మాత్రం, తప్పించుకునేందుకు మరో సాకు దొరికేది కాదు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం మాకు భలే సరదాగా ఉండేది. 


ఈమధ్యన మా ఆఫీసు లో మీటింగ్ లు, ప్రెజంటేషన్లు బాగా ఎక్కువైపోయాయి. ప్రస్తుతం ఆఫీసుల్లో వాడే వైట్ బోర్డులు, ప్రొజెక్టర్ లు, వాటి హడావిడి చూసినప్పుడు, మేము బ్లాకుబోర్డును నలుపు చెయ్యడానికి పడ్డ కష్టాలు గుర్తుకొస్తుంటాయి.





జూలై లో ఇండియాకు వెళ్ళినప్పుడు, మా స్కూల్ బోర్డు ఫోటో తీసుకున్నాను. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా చేర్చారట. కానీ, మా క్లాసురూంలన్నీ పడగొట్టి, కొత్త బిల్డింగ్లు కట్టించారు. పాత జ్జ్ఞాపకంగా   మిగిలింది ఈ బోర్డు ఒక్కటే.

~శశిధర్ సంగరాజు.

6 comments:

budugoy said...

a school establised in 1857.. wow. imagine this..cp brown must have visited ur school at some point since he stayed in the vicinity :-)

జర్నో ముచ్చట్లు said...

శశీ,
నీలాగే నాకూ ఇప్పటికీ అనుమానమే.. అసలా వీవింగ్ పీరియడ్‌ ఎందుకు ఉండేదా... అని. దస్తగిరి పార్ట్‌-3 ద్వారా మళ్లీ నన్ను ప్రాథమికోన్నత విద్యాభ్యాస కాలానికి తీసుకు వెళ్లావ్.. థ్యాంక్యూ.
విజయ్‌

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగున్నాయండి కబుర్లు, మేము మా స్కూల్ బోర్డ్ కి బ్లాక్ పెయింట్ వేసిన రోజులు గుర్తొచ్చాయి.

Sasidhar said...

@budugoy - T

hanks for the comments. As of I know, our school is the oldest in kadapa. Dont know about CP Brown, but heard that Sir Thomas Manroe, who happens to be Kadapa's collector under British rule certainly visited our school. But, dont know how far it is true.

@ జర్నో...
విజయ్ గారు, నాకు S.U.P.W కి పూర్తి అర్థం కూడా తెలియదు. మీకు తెలిస్తే చెప్పరూ? మీ కామెంట్స్ కి ధన్యవాదాలు.


@వేణూ శ్రీకాంత్ -
మీరు చాలా అదృష్టవంతులండీ బాబూ, బోర్డుకు పెయింట్ వేయడంతో సరిపొయ్యింది. మాది అసలే గవర్నమెంట్ స్కూల్, మరి ఫండ్స్ లేకో, ఉన్నా ఖర్చు చేయడం ఇష్టం లేకో, ఇలాంటి పనులు చేయించేవారు. బోర్డు తుడిచే డస్టర్ కూడా మేమే టైలర్ దగ్గర కుట్టించి తెచ్చేవాళ్ళం.
మీ కామెంట్స్ కు ధన్యవాదాలు.

~ శశిధర్

సుజాత వేల్పూరి said...

చాలామందికి SUPW కి అర్థం ఏమిటో తెలీకుండానే చదువు పూర్తయిపోతుంది. నాకు తెలుసు గానీ అది కరెక్టా కాదా అని సందేహం ఉండేది. అందుకే మా అత్తగారికి (వాళ్ళిద్దరూ హెడ్ మాస్టారు, హెడ్ మిస్ట్రెస్ లుగా చేసి రిటైర్ అయ్యారు) ఫోన్ చేసి కన్ ఫర్మ్ చేసుకుని రాస్తున్నా!

Socially useful and productive work ఈ SUPW కి విస్తరణ పదం! ఇందులో గ్రామర్ వెదక్కండి మరి!

ఇకపోతే మా స్కూల్లో బ్లాక్ బోర్డు గరుకుగా నల్లగా ఉండటానికి దోస ఆకులు, బొగ్గు పొడి కలిపి నూరి రుద్దేవాళ్లు. :-))

Sasidhar said...

సుజాతగారు,

S.U.P.W కు విస్తరణ పదం తెలియజేసినందుకు మిలియన్ థ్యాంక్స్ . మీరు చెప్పింది నిజం, చాలా మందికి ఈ పదానికి అర్థం తెలుసుకోకుండానే చదువు అయిపోతుంది, నాలాగా.
మీ స్కూల్ లో కూడా బోర్డును నలుపు చేయడానికి ఆకు రుద్దేవాళ్ళని తెలుసుకుని చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకించి, మీ అత్తగారికి నా ధన్యవాదాలు తెలియజేయండి.

~శశిధర్