Powered By Blogger

Friday, February 25, 2011

నిష్కల్మష మూర్తి కి అశ్రునివాళి

ఈ మధ్య పనిఒత్తిడితో తరచూ బ్లాగ్ లో రాయడం కుదరలేదు. కానీ ఆంధ్ర రాజకీయాలు మాత్రం కొద్దో గొప్పో ఫాలో అవుతున్నాను. రాజకీయాలు పక్కన పెడితే, నన్ను బాగా కదిలించింది ముళ్ళపూడి గారి మరణం.

ఇండియా ట్రిప్ కు వెళ్ళినప్పుడు తెలుగు పుస్తకాలు కొని తెచ్చుకోవడం మామూలే. ఇటీవల ఇండియాకు వెళ్ళినప్పుడు కూడా కోతికొమ్మచ్చి - 2  కొన్నాను. మొదటి భాగం స్టాక్ లేకపోవడం వల్ల దొరకలేదు. పనిఒత్తిడి ఎక్కువైనా, మనసు బాలేకపోయినా బుడుగు - సీగానపెసూనంబలు, కోతికొమ్మచ్చులు నాలో మళ్లీ ఉత్సాహాన్ని నింపుతుంటాయి. అలాంటి మంచి  మనిషి మన మధ్య లేరనే విషయం నిజం కాకపొతే బాగుండనిపిస్తోంది.

టివి కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించినా, సభల్లో ప్రసంగించినా ఒక్క పొల్లు మాట ఆయన నోటి నుంచి దొర్లిన సందర్భం లేదంటే అతిశయోక్తి కాదు. మాటల విలువ తెలిసిన మహనీయుడు. తమకు అవార్డులు రాకపోతే ఎదుటివాళ్ళ మీద దుమ్మెత్తి పోసే సినీరంగంలో ఉంటూ కూడా, తమకు "పద్మాలు" రాలేదని పన్నెత్తు మాట కూడా అనని సంస్కారి. ప్రాణ మిత్రుడు బాపుగారితో కలసి ఎన్నో సిల్వర్ జూబిలీ హిట్లు ఇచ్చినా, ఏనాడూ, ప్రచార ఆర్భాటానికి వెళ్ళని నిగర్వి.

"జాతస్య మరణం.." నిజమైనప్పటికీ, మరణం ఇలాంటి వారి విషయంలో వీలున్నంత నిదానంగా వస్తే బాగుంటుందేమో.  జీవించినంత కాలం అందరినీ నవ్వించిన పెద్దాయన ఆత్మకు శాంతి కలగాలనీ, ఆయన బహిప్రాణం బాపుగారికి ఈ కష్టకాలంలో  వీలున్నంత త్వరగా స్వాంతన చేకూరాలని ఈ బ్లాగ్ ముఖంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. 

~శశిధర్ సంగరాజు. 

No comments: