Powered By Blogger

Tuesday, January 11, 2011

రుద్రాక్షలు - సద్గురు జగ్గీ వాసుదేవ్

గత సంవత్సరం (జూలై 2010 ) ఇండియా కు వెళ్ళినప్పుడు, టివీల్లో రుద్రాక్షల గురించి ప్రకటనలు చూసాను. హైదరాబాద్, అమీర్ పేట్ ప్రాంతంలో ఏకంగా ఒక షాపే ఉంది(ట). నేను వెళ్ళలేదు. అంతకముందు రుద్రాక్షల గురించి కొంత అవగాహన ఉన్నా, పెద్దగా ఎప్పుడూ పట్టించుకోలేదు. ఈ ప్రకటనలు, అందులో వాళ్ళు చెప్పే విషయాలు విన్న తర్వాత, కొంత ఆసక్తి  పెరిగింది. 

 ఇండియా ట్రిప్ లో ఉన్నప్పుడే, అమెరికాలోని మిత్రుడొకరు,  "మా  బంధువులు  "ఏకముఖి రుద్రాక్ష" ఇస్తారు, తీసుకురాగలరా?"  అని అడిగారు. "దానికేం భాగ్యం, తప్పకుండా" అని నేను కూడా ఒప్పుకున్నాను. ఆ రకంగా "ఏకముఖి రుద్రాక్ష" ప్రత్యక్షంగా చూసే అద్రుష్టం కలిగింది. 


సరే, రుద్రాక్షలు ధరించడం వల్ల లాభాలు, నష్టాలు పక్కన పెడితే, ఈ మధ్య "యూట్యుబ్" లో వెతుకుతుంటే, సద్గురు జగ్గీ వాసుదేవ్ గారు రుద్రాక్షల గురించి చెప్పిన వీడియో కనిపించింది. రెండు భాగాలుగా ఉన్న ఈ వీడియో, రుద్రాక్షల గురించి నాకు తెలియని కొన్ని విషయాలు చెప్పింది. 

ముఖ్యంగా, రెండవ లింక్ లో, రుద్రాక్షమాలను ఉపయోగించి మనం తాగే నీళ్లు మంచివో, కాదో తెలుసుకునే విధానం నన్ను ఆకట్టుకుంది. అడవుల్లో సంచరించే సాధువులు, సన్యాసులు రుద్రాక్షమాలను ఉపయోగించి, నీటిచెలమల్లోని నీరు తాగడానికి శ్రేయస్కరమో, కాదో తెలుసుకునేవాళ్ళట. ప్రస్తుతం నా దగ్గర రుద్రాక్షమాల లేదు కాబట్టి పరీక్షించి చూడలేను. 

రుద్రాక్షలు వాడమనో, వాడితే మంచిదనో, మరోటో ప్రచారం చెయ్యడం నా ఉద్దేశ్యం కాదు. ఎవరిష్టం వారిది. 
నా ఆసక్తి అంతా, రుద్రాక్షమాల టెక్నిక్ ఉపయోగించి ఈ మధ్యకాలంలో మినరల్ వాటర్ అని చెప్పి మురికి నీళ్ళు  అంటగడుతున్న దొంగ వెధవల ఆటకట్టించొచ్చు కదా అనే. (సాధ్యమో కాదో తెలియదు..ఒక ఆలోచన మాత్రమే)


వీడియో లింకులు కింద ఇస్తున్నాను. మీరు రుద్రాక్షలు వాడుతున్నట్లయితే మీ అనుభవాలు నాతో పంచుకోండి (అభ్యంతరం లేకపోతేనే సుమా!)


Rudhraksha - Part 1

Rudhraksha - Part 2 


~శశిధర్ సంగరాజు

No comments: