Powered By Blogger

Thursday, November 25, 2010

దస్తగిరి - పార్ట్ 2 కువైట్ పెన్ను

దస్తగిరి తో నేను పడ్డ తిప్పలు పార్ట్ 1 లో చదివారు కదా...చిన్న, చిన్న సంఘటనలు మామూలే అయినా...నా వల్ల జరిగిన ఒక పొరపాటు, నాకు ప్రశాంతత అనేది లేకుండా చేసింది. అదేంటో, చదవండి మరి.


పదవ తరగతి మొదలైన కొత్తల్లో కూడా పరిస్థితి మామూలుగానే ఉండేది. ఆరు నెలల పరీక్షలు అయిపోయినప్పటి నుంచి  టెన్షన్ మొదలైంది. పలకరించిన ప్రతివాళ్ళు, "ఈ సారి పదోతరగతి..ఇంతకముందులా కాదు..పబ్లిక్ ...బ్రహ్మాండం గా చదవాలి..మంచి మార్కులు రావాలి " అని ఊదరగొట్టడం మొదలెట్టారు. మా నాన్నగారి ఫ్రెండ్ ఒకాయన, ఒక అడుగు ముందుకేసి "నువ్వు స్టేట్ ఫస్ట్ రావాలి " అని దీవించేసాడు. "ఏం ఈ సంవత్సరం మీరు గాని పేపర్లు దిద్దుతారా" అని అడగబోయి మాట మింగేసాను. ఇంట్లో తెలిస్తే తంతారని.  


ప్రతి గురువారం దూరదర్శన్ లో "చిత్రలహరి" అనే సినిమా పాటల కార్యక్రమం వచ్చేది. వాణిజ్యప్రకటనలు పోను, ఆ కార్యక్రమం వచ్చేది 15 నిమిషాలు.అది కూడా, చూడనిచ్చేవాళ్ళు కాదు. ఇంటికి వచ్చే వాళ్ళు కూడా, సరిగ్గా ఆ టైం కు రావడం, " "చిత్రలహరి" జీవితం లో ఎప్పుడైనా చూడొచ్చు నాయనా..ఈ సారి పదోతరగతి .." అంటూ మళ్లీ  రికార్డు మొదలెట్టడం.


ఈ గొడవలో కూడా, దస్తగిరి "డోన్ట్ కేర్" పద్దతిలో ఏ మార్పు లేదు. ఇక్కడ దస్తగిరి కి ఉన్న ఒక సుగుణం గురించి చెప్పుకోవాలి. కర్ణుడు (అవును, మహాభారతం లో ఉండే ఆయనే) అడిగిన వాళ్లకు మాత్రమే దానం చేస్తాడేమో, దస్తగిరి మాత్రం నోరు తెరచి అడక్కపోయినా, మన మనస్సు కనిపెట్టి మరీ దానాలు చేస్తాడు. చిక్కల్లా,మాట తేడా వస్తే, "నేను ఇచ్చింది తిరిగి ఇచ్చై"  అని హింసిస్తాడు . ఈ విచిత్ర వికారానికి  నేను బలైపోయాను. 

ఒక రోజు, స్కూల్ లో దస్తగిరి జేబులో ఒక కొత్త పెన్ను చూసాను. అది ఇంకు పెన్ను. పెన్ను కింది భాగం ముదురు ఆకు పచ్చ రంగులో ఉంది. లోపల ఇంకు లెవెల్ కనపడడానికి అటూ, ఇటూ సన్నటి విండోలు. బంగారు రంగు కేప్. కేప్ చుట్టూ దానిమ్మ రంగులో చెక్కిన లతల డిజైన్. మెరిసిపోతున్న పెన్ను క్లిప్.చూడగానే "పెన్నంటే ఇదిరా" అనిపించే లాగా ఉంది. నా దగ్గర కామెల్ ఇంకు పెన్ను ఉంది . కానీ, నా పెన్నుకు, దస్తగిరి దగ్గరుండే పెన్నుకు నక్కకు, నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. మెల్లగా, దస్తగిరిని  అడిగాను , "  కొత్త పెన్ను కొన్నావా"  అని.దస్తగిరి చెప్పిన జవాబు నన్ను ఇంకా ఆశ్చర్యంలో ముంచేసింది. దస్తగిరి వాళ్ళ బంధువులెవరో కువైట్ లో పనిచేస్తారట. (కడప, రాజంపేట ప్రాంతాలనుంచి గల్ఫ్ కు, ముఖ్యంగా   కువైట్ కు ఉపాధి కోసం వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది) వాళ్ళు సెలవల్లో వచ్చినప్పుడు తెచ్చారట. 


కొత్త పెన్ను, అందులో ఫారెన్ పెన్ను. నాకు కుతూహలం ఎక్కువైపోయింది. దస్తగిరిని అడిగాను, "ఈ రోజు పెన్నులు మార్చుకుందామా" అని. దాన కర్ణుడు కదా, వెంటనే ఇచ్చేసాడు. ఆరోజంతా ఆ పెన్నుతోనే నోట్స్ రాసుకున్నాను. ఉత్సాహం ఆపుకోలేక, దస్తగిరి నోట్స్ కూడా నేనే రాసి పెట్టాను. ఆ పెన్ను తో రాస్తుంటే , అక్షరాలు కూడా పొందిగ్గా కుదురుతున్నట్లు నాకు నమ్మకం గా అనిపించింది. సాయంత్రం పెన్ను తిరిగి ఇచ్చేటప్పుడు బాధగా కూడా అనిపించింది. " మళ్లీ రేపు తెస్తావా " అని అడిగితే సరేనన్నాడు. అలా రెండు, మూడు రోజులు జరిగిపోయింది. 


నాలుగో రోజు ఏ కళ నున్నాడో , ఏమో, "ఈ పెన్ను నువ్వే తీసుకో " అన్నాడు. నాకు ఒకవైపు ఆశ్చర్యం, మరో వైపు అనుమానం. "మీ ఇంట్లో ఏమీ అనరా" అని అడిగాను. "ఫర్వాలేదు, ఈసారి వచ్చినప్పుడు మళ్లీ తెమ్మని అడుగుతాన్లే, ఏమీ అనరు" అని చెప్పాడు.దస్తగిరి కి మరీ, మరీ థాంక్స్ చెప్తూ, గాల్లో తేలిపోతూ ఇంటికి వెళ్లాను. ఆరోజు నుంచి "కువైట్ పెన్ను" నా జీవితం లో ఒక భాగమైంది. ఎక్కడి కి వెళ్ళినా ఆ పెన్ను నాతో ఉండాల్సిందే. ఆ కృతజ్ఞతతో దస్తగిరికి అడిగినప్పుడల్లా నోట్స్ రాసి ఇచ్చేవాన్ని. 


కానీ, అన్ని రోజులు మనవి కావనే విషయం త్వరలోనే నిజమైంది. ఆ రోజుల్లో నేను ఎన్.సి.సి. కూడా వెలగబెట్టే వాణ్ని. ఒక రోజు ఎన్.సి.సి. డ్రెస్ మార్చుకుంటుంటే కువైట్ పెన్ను కింద పడడం, నేను చూసుకోకుండా ఎన్.సి.సి. బూటుతో పెన్ను మీద అడుగు పెట్టడం జరిగిపోయింది. ఇంకేముంది, ఇనుప నాడాలు బిగించిన బూట్ బరువుకి పెన్ను చిట్లి పోయింది. నాకు విపరీతమైన దుఃఖం .ఇక కువైట్ పెన్ను ఇంకు కారడం మొదలెట్టింది. ఎన్ని బట్టలు చుట్టినా, ఫలితం లేకుండా పోయింది. దస్తగిరి కి తెలియకుండా, ఇంకో ఫ్రెండ్ ని అడిగా , ఏం చేద్దామని. సన్నటి కొవ్వొత్తి సెగ లో పెన్ను ను ఉంచితే, పగిలిన భాగం అతుక్కుంటుందని సలహా ఇచ్చాడు. ఆ ప్రయోగం దారుణంగా ఫెయిల్ అయ్యింది. అంత వరకు బొచ్చు కుక్క పిల్ల లా అందంగా , ముచ్చటగా ఉండే కువైట్ పెన్ను, గజ్జి కుక్కలా తయారైంది. చేసేదేమీ లేక, విసుగొచ్చి పెన్ను ఎక్కడో పడేసాను. ఎలాగూ, పెన్ను లేదుకదా అని దస్తగిరికి నోట్స్ రాసిపెట్టడం కూడా మానేసాను. 


మరి ఎలా గమనించాడో, ఏమో, ఒక రోజు దస్తగిరి నన్ను అడిగాడు, కువైట్ పెన్ను స్కూల్ కి తీసుకురావడం లేదేమని. నసుగుతూ అసలు విషయం చెప్పేసాను. అప్పటికేమి అనలేదు, నేను కూడా ఆ విషయం మర్చిపోయాను. ఇక పరీక్షలు దగ్గర పడుతున్నప్పుడు ఒక రోజు దస్తగిరి ఉన్నట్లుండి బాంబు పేల్చాడు. " నా కువైట్ పెన్ను నా కిచ్చై" అని. పైగా దానికి మరో క్లాజ్ తోడైంది "ఎట్లిచ్చింది అట్లనే" అని. ( ఆంటే, As It Was అని అర్థం). నాకు గుండెల్లో రాయి పడింది. దస్తగిరికి ఉన్నట్లు , మా బంధువులెవరూ కువైట్ లో లేరు. నా పెన్ను సమస్య తీర్చడానికి , మా ఇంట్లో వాళ్లెవరికీ  కువైట్ కు వెళ్ళే ఉద్దేశ్యం కూడా లేదు. పైగా ఇంట్లో విషయం తెలిస్తే చీవాట్లు తప్పవు. వేరే పెన్ను ఇస్తానంటే దస్తగిరి ఒప్పుకోలేదు. చివరికి తనే పరిష్కారం కూడా చెప్పాడు.


పరీక్షల్లో (హిందీ, లెక్కలు )నేను తనకు ఆన్సర్ లు చూపిస్తే సరిపోతుందని.నేనేదో తనకన్నా మేధావినని కాదు, ఏదో గుడ్డిలో మెల్ల. అంతే.  హిందీ వరకు ఫర్వాలేదు. నేను అప్పటికే దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారు నిర్వహించే ప్రవేశిక పరీక్ష పాసయ్యాను. లెక్కలతోనే నాకు తిప్పలు. నాకు మాత్రికలు (Matrix), త్రికోణమితి (Trigonometry) లను చూస్తే, అమావాస్య అర్ధరాత్రి రెండు కొరివి దయ్యాలు జుగల్బంది చేసినట్లుండేది. కాకపొతే, వేరే మార్గం లేక పోవడం తో సంధికి ఒప్పుకోక తప్పలేదు.  ముందు జాగ్రత్తగా, నేను కూడా ఒక మెలిక పెట్టాను. 10 మార్కుల ప్రశ్నలు మాత్రమే సాయం చెయ్యగలననీ, బిట్స్ తనే రాసుకోవాలని. ఇంకో మొండి ధైర్యం కూడా ఏమిటంటే, మా ఇద్దరి నంబర్లు ఒకే దగ్గర వచ్చినప్పుడు చూద్దాం లే అని.దస్తగిరి కూడా ఒప్పుకున్నాడు.


నాకు దురదృష్టం  రామస్వామి రెడ్డి అనే డి.ఈ.ఓ. రూపం లో ఎదురైంది. ఆయనను ఆ సంవత్సరమే కడపకు ట్రాన్స్ఫర్ చేసారు. ఆయన బాగా స్ట్రిక్ట్. ఆయన చేసిన మొదటి పని, స్కూల్ సెంటర్ లు మార్చడం. అప్పటి వరకు ఎవరి పరీక్షల సెంటర్ వాళ్ళ స్కూల్ లోనే.తెలిసిన వాతావరణం, తెలిసిన టీచర్ ల మూలంగా పిల్లలకు కూడా ధైర్యం గా ఉండేది. కాపీలు కూడా విచ్చలవిడిగా జరిగేవి.  మునిసిపల్ హైస్కూల్ సెంటర్ ను, శారదా నిలయం అనే స్కూల్ కు మార్చారు. ప్రతి పరీక్ష కు రూం లు కూడా మార్చడం మొదలెట్టారు. ఈ కొత్త పద్దతి లో  హిందీ, లెక్కలు, సైన్సు పరీక్షలకు నేను, దస్తగిరి ఒకే క్లాసు లో పడ్డాం. హిందీ పరీక్షకు మాత్రం ఒకే క్లాసు అయినా బాగా దూరంగా కూర్చోవలసి వచ్చింది. పెద్ద గా సాయం చెయ్యలేక పోయాను. కానీ, పరీక్ష అయిపోయాక దస్తగిరి మాత్రం ఆనందంగానే ఉన్నాడు . ఎలా రాసావని అడిగాను. "ఏముంది, కొచ్చిన్ పేపర్ లో ఏముందో అదంతా చూసి ఆన్సర్ పేపర్లో రాసేసా" అన్నాడు. నాకు గుండెల్లో రాయి పడింది. పేపర్లు దిద్దే మాస్టార్లు హిందీ విషయం లో మాత్రం కొంచెం చూసీ, చూడనట్లు వెళ్ళేవారు. కాకపోతే, నాకు తెలిసి హిందీ లో ఫెయిల్ ఆయినా వాళ్ళెవరూ లేరు.  అయినా ఏదో అనుమానం. 

ఇక లెక్కల పరీక్షలో మాత్రం దస్తగిరి నంబర్ నాకు ఐమూలగా (ఆంటే, Diagonal అన్నమాట)వచ్చింది. ఇక కొచ్చిన్ పేపర్లు ఇచ్చిన 10 నిమిషాల నుంచి దస్తగిరి గొడవ మొదలైంది "చూపీ" అంటూ. ఏం చూపియ్యనూ, నా బొంద. పేపర్లో అడిగిన  ప్రశ్నలే అర్థం కాక నా పరిస్థితి  గందరగోళం గా ఉంది. ముందు రెండు మార్కుల ప్రశ్నలకు జవాబు రాసి, కొంత కుదుటబడ్డాక, పది మార్కుల ప్రశ్నలు అటెంప్ట్ చెయ్యాలన్నది నా ప్లాన్. దస్తగిరి మాత్రం ముందు పది మార్కుల ప్రశ్నలు ఆన్సర్ చెయ్యమనేవాడు, ఒక పని అయిపోతుందని. తర్వాత రాస్తానని సైగ చేస్తే, వెంటనే దెప్పిపొడవడం " ఏం, సరిగ్గా చదవలేదా" అని. దస్తగిరి గుసగుసల శబ్దానికి ఇన్విజిలేటర్ "ష్..." అంటూ హెచ్చరికలు. నాకు భయంగా ఉండేది ఎక్కడ పేపర్ లాక్కుని బయటకు పంపేస్తారో అని. మొత్తానికి ఆ మూడు గంటలూ కడప ఎండల్లో చెప్పులు లేకుండా నడిచినట్లనిపించింది. నోటికొచ్చిన ఈక్వేషన్లు, ఫార్ములాలతో పేపర్ నింపేసాను. దస్తగిరి, నా పైత్యం కొంత, తన పైత్యం కొంత కలిపి పేపర్లు నింపేసాడు. ఒకటి, రెండు అడిషనల్ పేపర్లు కూడా తీసుకున్నట్లు గుర్తు. బయటకు వచ్చాక "సూపర్ గా రాశాం  కదా! కనీసం 70 మార్కులన్నా వస్తాయి. కదా ?" అని అడిగాడు. నేనొక వెర్రి నవ్వు నవ్వాను. " అవును, ఇద్దరికీ కలిపి 70 మార్కులు వస్తే , పుణ్యం చేసుకున్నట్లే" అని మనసులో అనుకున్నాను. బయటకు ఆంటే మళ్ళీ అదో గొడవ.


మొత్తానికి పరిక్షలైపోయాయి. ఎండా కాలం సెలవల్లో, దస్తగిరి పాలిటెక్నిక్ కోచింగ్ లో చేరాడు. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్లాను, సెలవలు గడపడానికి, బావుల్లో ఈత కొట్టడానికి.
రిజల్ట్స్ రావడానికి ఒక వారం రోజుల ముందు మళ్లీ కడపకు వచ్చాను. రిజల్ట్స్ రోజు మా ఇంట్లో అందరూ నా నంబర్ కోసం వెతుకుతుంటే..నేను దస్తగిరి నంబర్ కోసం వెతికాను. అప్పటివరకు కడప లో, పదవ తరగతి ఉత్తీర్ణత 70  శాతానికి ఎప్పుడూ తగ్గేది కాదు. దానికి కారణం, మాస్ కాపీయింగ్. కానీ, ఆ సంవత్సరం, రామస్వామి రెడ్డి గారి పుణ్యమా అని 13 శాతానికి పడిపోయింది. అందులో అమ్మాయిలదే పైచెయ్యి.


నేను స్టేట్ ఫస్ట్ రావాలని ఆశీర్వదించిన మా నాన్నగారి ఫ్రెండ్ కు ఆశాభంగం కలిగిస్తూ నేను సెకండ్ క్లాసు లో పాసయ్యాను. దస్తగిరి కి థర్డ్ క్లాసు వచ్చింది. మామూలుగా అయితే, సెకండ్ క్లాసు వచ్చినందుకు మా ఇంట్లో నన్ను బాదేసేవాళ్ళు. కానీ, 13 పర్సెంట్ పాస్ అవ్వడంతో, పోన్లే, సంవత్సరం వేస్ట్ కాలేదని సంతోషించి, చీవాట్లతో సరిపెట్టారు.  లాంగ్వేజస్, సోషల్ స్టడీస్ లో వచ్చిన మార్కులు నన్ను కాపాడాయి. లెక్కలు, సైన్సు లో బొటాబొటి మార్కులతో గట్టెక్కాను.


మార్క్ షీట్లు తీసుకోడానికి వెళ్ళినప్పుడు దస్తగిరి కలిసాడు. తాను పాలిటెక్నిక్ లో చేరుతున్నట్లు చెప్పాడు. లెక్కల్లో మాత్రం 40 మార్కులు కూడా దాటకపోవడం పై బోల్డు ఆశ్చర్యం వ్యక్తం చేసాడు. ఈ మధ్య పేపర్లు సరిగ్గా దిద్దడం లేదనీ, లేకపోతే అన్ని పేపర్లు రాస్తే 40 కూడా దాటక పోతే ఎట్లా? అని విసుక్కున్నాడు. జరిగిందేమిటో నేను దస్తగిరికి వివరించి చెప్పలేదు. అనవసరం కూడా. తర్వాత మా దార్లు వేరైపోయాయి. మళ్లీ కలవలేదు.


అప్పట్నుంచి ఎవరితోనూ పెన్నులు మార్చుకునే ప్రయత్నం మాత్రం చెయ్యలేదు.


~శశిధర్ సంగరాజు.

6 comments:

జర్నో ముచ్చట్లు said...

డియర్‌ శశీ,

దస్తగిరి సీక్వెల్‌లో రెండో భాగం సూపర్‌. నీతో మాట్లాడేటప్పుడు.. నువ్వు వేసే జోకులు చూసి.. మంచి మాటకారి అనుకునేవాడిని. కానీ ఇప్పుడు నీ రచనలు చూస్తుంటే.. నీలో ఎంతటి హాస్య రచనా పటిమ ఉందో తెలుస్తోంది. (మనం చెన్నైలో పనిచేసేటప్పుడు.. నువ్వు రాసే వార్తలు తప్ప.. నీ ఇతరత్రా రచనలు చూసే అవకాశం కలగలేదు కదా...!)
నీ ఈ పోస్టు వల్ల.. ప్రతివారికీ చిన్ననాటి సంగతులు గుర్తొచ్చి.. వారి మనస్సులను దూదిపింజలను చేస్తాయంటే అతిశయోక్తి కాదు.
పెన్నులు కారేటప్పుడు బట్టపీలికలు చుట్టిన జ్ఞాపకాలు.. నేనెట్ల ఇచ్చిండానో అట్లే ఇయ్యల్ల.. అన్న నీ ప్రయోగాలు... నన్ను పాతిక, 30 సంవత్సరాల కిందటికి తీసుకు వెళ్లాయి.

ఇక నీరచనలో...
"అంత వరకు బొచ్చు కుక్క పిల్ల లా అందంగా , ముచ్చటగా ఉండే కువైట్ పెన్ను, గజ్జి కుక్కలా తయారైంది "
"లెక్కలతోనే నాకు తిప్పలు. నాకు మాత్రికలు (Matrix), త్రికోణమితి (Trigonometry) లను చూస్తే, అమావాస్య అర్ధరాత్రి రెండు కొరివి దయ్యాలు జుగల్బంది చేసినట్లుండేది"
లాంటి ప్రయోగాలు నీలోని హాస్య రచనా పటిమను చాటుతున్నాయి.

మొత్తంగా, నీ ఈ రచన చాలా చాలా బాగుంది. ఇదే పద్ధతిలో నీకంటూ ప్రత్యేక శైలిని కొనసాగిస్తూ.. మరిన్ని మంచి రచనలను మాకు అందించాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నాను.


రిగార్డ్స్
విజయ్‌

Anonymous said...

http://vivaadavanam.blogspot.com/2010/11/blog-post_25.html

వేణూశ్రీకాంత్ said...

హ హ మీ దస్తగిరి టెక్నిక్ బాగుందండోయ్ ఎట్లున్నదో గట్లనే ఇచ్చేయ్... సరదాగా రాస్తున్నారు, మరిన్ని రచనలకోసం ఎదురుచూస్తున్నాను.

Sasidhar said...

@Jurno...
విజయ్ గారు,
మీ అభిమానం, ప్రోత్సాహం ఉంటే, మరిన్ని రచనలతో మీ ముందుకు వస్తాను. నా బ్లాగ్ పోస్ట్ లను పరిశీలనా దృష్టితో చదువుతున్నందుకు చాలా థ్యాంక్స్


@Ananymous

నా పోస్ట్ పై మీ అభిప్రాయం తెలియజేయలేదు. మీరు పోస్ట్ చేసిన లింక్ చూసాను. బాగుంది.

@ వేణూ శ్రీకాంత్

మీ ప్రోత్సాహానికి చాలా థ్యాంక్స్

~ శశిధర్

Edge said...

చాలా బాగా రాసారు , శశిధర్ గారు. చాలా కాలం తరవాత మళ్లీ టెన్త్ క్లాసు రోజులు గుర్తు చేసారు. మరిన్ని రచనల కోసం ఎదురు చూస్తుంటాను.

Sasidhar said...

@Edge

Thanks a lot for your comments. Appreciate it.

~Sasidhar