Powered By Blogger

Saturday, November 20, 2010

దస్తగిరి - పార్ట్ 1 : గురు పూజోత్సవము.

 నేను, కడప మునిసిపల్ హై స్కూల్ (మెయిన్) లో 9 , 10 తరగతులు  చదివే రోజుల్లో దస్తగిరి నా క్లాసుమేటు. దస్తగిరి వ్యవహారం కొంచెం విచిత్రం గా ఉండేది. దేనికీ తొణికే రకం కాదు. ఏం జరిగినా మనల్ని కాదు అన్నట్లు ఉండే దస్తగిరి నాకు త్వరగానే మిత్రుడయ్యాడు.

9  వ తరగతి మొదలైన కొన్ని నెలలకు దస్తగిరి సియస్ ఐ  స్కూల్ నుంచి మా స్కూల్ కు ట్రాన్స్ఫర్ మీద వచ్చాడు. స్కూల్ తెరిచిన రెండు నెలలకు రావడం మూలాన, మిగతా క్లాసు లలో అప్పటికే పూర్తి స్త్రెంగ్థ్ ఉండడం వల్ల, దస్తగిరి ని మా సెక్షన్ కు కేటాయించారు. 9  వ తరగతి లో 4 సెక్షన్లు ఉండేవి. ఎ,బి,సి,డి. ఎ సెక్షన్లో మాత్రం అమ్మాయిలు, అబ్బాయిలు కలసి ఉండేవారు. నాది సి సెక్షన్. 

దస్తగిరి పూర్తి పేరు "దస్తగిరి రెడ్డి". రాయలసీమ లో హిందువుల్లో కూడా "దస్తగిరి రెడ్డి, ఫకీరా రెడ్డి" లాంటి పేర్లు మామూలే. మొక్కుబడి ఉన్నవాళ్ళు అలాంటి పేర్లు పెట్టుకుంటారు. అప్పటివరకు స్క్వాడ్ లీడర్ (మా స్కూల్ కు ప్రతి సంవత్సరం బిఇడి ట్రైనీ టీచర్ లు వచ్చేవారు. ఈ స్క్వాడ్ లీడర్  ప్రయోగం వాళ్ళదే . లేకపోతే మునిసిపల్  హై స్కూల్ ఆటలకే కానీ, చదువుకు అంత ఫేమస్ కాదు.)గా ఉన్న నాకు, క్లాసు లీడర్ గా ప్రమోషన్ వచ్చింది. 

స్క్వాడ్ లీడర్ గా నేను ఉద్ధరించింది ఏమీ లేదు. నా స్క్వాడ్ లో ఉన్నవాళ్ళంతా కొంచెం అమాయకులు, నోట్లో నాలుక లేని బాపతు కావడం, వాళ్ళు హోం వర్క్ సరిగ్గా చేయడం, అల్లరి చెయ్యక పోవడం నా ప్రతిభే అని పొరపాటు పడి మా  లెక్కల సార్ నన్ను క్లాసు లీడర్ ను చేసారు. స్క్వాడ్ లీడర్ గా ఎలాగో నెట్టుకొచ్చిన నాకు , క్లాసు లీడర్ పోస్ట్ తల నొప్పి గానే తయారైంది.


అప్పటివరకు అల్లరి చేసే పిల్లల పేర్లు బోర్డు మీద రాయడం, టీచర్ లకు మొర పెట్టుకోవడం మినహా గత్యంతరం లేని నాకు దస్తగిరి తో స్నేహం కలిసొచ్చింది. 9  తరగతికే, దస్తాగిరిది భారీ విగ్రహం. మా అందరికన్నా పొడవు కూడా. కాస్త దుడుకుగా ఉన్న పిల్లలను దస్తగిరి కంట్రోల్ లో పెట్టేవాడు. చూడడానికి దిట్టంగా, ఎవరన్నా లెక్కలేనట్లు ఉండే దస్తగిరి ఆంటే వాళ్లకు భయం.   కొన్ని కొన్ని విషయాల్లో దస్తగిరి నాకు సలహాలు కూడా ఇచ్చేవాడు. ఆ సలహాల వల్ల కొన్ని సార్లు లాభాలు, మరి కొన్ని సార్లు నష్టాలు. కానీ, ఒక సారి దస్తగిరి ఇచ్చిన సలహా, నా మెడకు అనకొండ లా చుట్టుకుంది.


అదేమిటంటే, ప్రతి సంవత్సరం స్కూల్ లో గురుపూజోత్సవం (టీచర్స్ డే - సెప్టెంబర్ 5 న)బాగానే జరుపుకుంటారు. అన్ని సెక్షన్ల మధ్య ఒక అప్రకటిత పోటి  ఉండేది. ఎవరు బాగా టీచర్స్ డే జరిపారనే విషయం మీద. 'ఏ' సెక్షన్ తో మాకు ఎప్పుడూ పోటి ఉండేది కాదు. కారణం, ఆ సెక్షన్లో అమ్మాయిలు ఉండడం. వాళ్ళ క్లాసు ను వాళ్ళు బాగా అలంకరించడమే కాకుండా, ముగ్గులు, రంగవల్లులు వేసి మమ్మల్ని చిత్రహింసలు పెట్టేవారు.ఇక మా పోటి  బి,డి సెక్షన్ లతోనే. 


ఈ సంవత్సరం మనం గురుపూజోత్సవం ఎలా జరపాలన్న విషయం మీద చర్చలు మొదలైయ్యాయి. అందరి దగ్గరనుంచి డబ్బులు  వసూలు చేసే భాద్యత నేను తీసుకున్నాను.  తెలుగు సార్ ని పిలుద్దామని అనుకున్నాం. ఆయన కూడా వస్తానని చెప్పారు. 


క్లాసు మొత్తం రంగు కాగితాలతో అలంకరించడం, గురువు గారికి పూల దండ, ఆపిల్ పండ్లు సమర్పించడం వరకు అందరూ ఒప్పుకున్నారు. కానీ, మిగతా క్లాసులకన్నా మనం గొప్పగా చెయ్యడం ఎలా అన్న దగ్గర ఎవరికీ ఏమి తోచడం లేదు. ఇంతలో, దస్తగిరికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. పైన్నించి పూలు కురిపించాలని.  అదెలాగో కూడా దస్తగిరి చెప్పాడు. బెలూన్లలో పూలు నింపి, వాటిని పేల్చడం ద్వారా పూలు కురిపించొచ్చని . గత సంవత్సరం వాళ్ళ పాత స్కూల్ లో అలాగే చేసారట.ఇంకేం, ఆ భాద్యత తను తీసుకున్నాడు. 


సెప్టెంబర్ 5  రానే వచ్చింది. వసూలు చేసిన డబ్బులు ఆపిల్ పండ్లకు, రంగు కాగితాలకు, విడి పూలకు సరిగ్గా సరిపోయింది. ఇంకా బెలూన్లకు డబ్బులు అడిగితే, గురుపూజోత్సవం సంగతి దేవుడెరుగు, నాకు పూజ ఖాయం. అందుకని ఆ తిప్పలేవో దస్తాగిరినే పడమన్నాను. మా క్లాసు లోనే సురేష్ అనే అబ్బాయి ఉండేవాడు. "నేను, సురేష్ తెస్తాం లే" అని దస్తగిరి హామీ ఇచ్చాడు. నన్ను మాత్రం అగరుబత్తీలు తెమ్మని చెప్పాడు. బెలూన్లు పేల్చడానికీ, సార్ కుర్చీ ఎదురుగా ఉండే, టేబుల్ మీద పెట్టడానికీ. 


ముందు రోజు క్లాసు మొత్తం శుభ్రంగా చిమ్మి, రంగు కాగితాలతో అలంకరించడం వల్ల క్లాసు కు కూడా కొత్త కళ వచ్చింది. దస్తగిరి, సురేష్ బెలూన్లు, అందులో వేయడానికి బంతి పూలు తెచ్చారు. ఎరుపు, పసుపు రంగుల బంతి పూలు ముచ్చటగా ఉన్నాయి. పూల రేకులను జాగ్రత్తగా తుంచి బెలూన్లను నింపారు. మొత్తం మూడు బెలూన్లు తయారయ్యాయి. వాటిని టీచర్ కూర్చునే కుర్చీ పైన, రంగు కాగితాలు కట్టిన తాళ్ళకు ముడి వేసారు. అంతా సిద్దం అయ్యింది, నేను స్టాఫ్ రూం కు వెళ్ళాను గురువు గారిని పిలుచుకు రావడానికి. ఆయన పేరు సుబ్రమణ్య శర్మ. తెలుగు చాలా బాగా చెప్తారు.ముఖ్యంగా "విదురుని విందు" అనే పాటం ఆయన చెపితే మళ్లీ , మళ్లీ వినాలనిపించేది.


ఆయన క్లాసు లోకి రాగానే, అందరూ లేచి "గుడ్మార్నింగ్ సార్ "అని దీర్ఘాలు తీసారు. అందరినీ కూర్చోమని చెప్పి, శర్మ గారు కుర్చీలో కూర్చున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి, గురుపూజోత్సవం గురించి మరొక్క సారి చెప్పి, బాగా చదువుకోమని ఆశీర్వదించారు. ఇక మిగిలింది ఆయన్ను సన్మానించే కార్యక్రమం. క్లాసు లీడర్ను అయినందుకు నేను, ఈ కార్యక్రమంలో నాకు ఎక్కువగా సహకరించినందుకు దస్తగిరి, సురేష్ లు మాస్టారు కూర్చునే ప్లాట్ ఫారం మీద నించున్నాం. ఆయన మెడలో పూల దండ వేశాం. చిరునవ్వుతో స్వీకరించారు, ఇవన్నీ ఎందుకురా అంటూనే. ఇక బెలూన్లు పేల్చే పని నాది. నేను అగరుబత్తి తో బెలూన్లను పేల్చాను. పెద్ద శబ్దంతో రెండు బెలూన్లు పేలాయి.  పూలు జలజల మాష్టారు గారి మీద పడ్డాయి. బెలూన్లు పేలిన  శభ్దానికి, గాలి విసురుకూ అగరుబత్తి ఆరిపోయింది. మూడో బెలూన్ పేలలేదు.అదే మా కొంప ముంచింది. 


తన మీద పడ్డ పూలను చిరునవ్వుతో చూస్తూ, సార్ తల పైకెత్తి చూసారు . అంతవరకూ సాకేత రాముడిలా ప్రశాంతంగా ఉన్న ఆయన ఒక్కసారిగా పరశురాముడై పోయారు. "ఛీ..ఛీ" అంటూ, ఒక చేత్తో తనమీద పడ్డ పూలను విదిలించేస్తూ, మరో చేత్తో నా చెవి పట్టుకున్నారు. "వెధవల్లారా...ఎక్కడ్నుంచి తెచ్చారురా ఇవి, ఇది మీకు వచ్చిన ఆలోచనేనా " అంటూ. మాకందరికీ నిలువు గుడ్లు పడ్డాయి. బాధకు తట్టుకోలేక నేను సురేష్ వైపు, సురేష్  దస్తగిరి వైపు చూపించుకున్నాం. సురేష్ కు కూడా వీపు మీద ఒక దెబ్బ పడింది. రెండు చేతులతో మా ఇద్దరికీ సన్మానం జరగడం వల్ల దస్తగిరి మాత్రం బతికి పోయాడు.


జరిగిందేంటంటే, దస్తగిరి, సురేష్ లు తెచ్చిన బెలూన్లు,  "నిరోద్"లు. సురేష్ వాళ్ళ అమ్మగారు ప్రైమరీ హెల్త్ సెంటర్ లో నర్స్ గా పనిచేస్తారట. పేషంట్లకు పంపిణీ చెయ్యమని వాళ్లకు ఇచ్చిన పాకెట్లలోంచి వీళ్ళిద్దరూ కొన్ని నిరోద్ లు కొట్టుకొచ్చారు. డబ్బు ఖర్చుపెట్టక్కర లేదు కదా ని నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు . 
అయినా, ఇప్పటి పిల్లలకున్నంత లోకజ్ఞానం కూడా అప్పట్లో మాకెవ్వరికి ఉండేది కాదు కూడా. ఉచితంగా బెలూన్లు వస్తున్నాయన్న సంబరం తప్ప.


ఇప్పుడు గుర్తుచేసుకుంటే , ఆ దృశ్యం కూడా వికృతం గానే కనిపిస్తోంది. పగిలి వాలిపోయిన రెండు బెలూన్ల మధ్య, పేలని మూడో బెలూన్ గాలికి ఊగుతోంది. పాలిపోయిన మోఖాలతో నించున్న మమ్మల్ని చూసి ఏమనుకున్నారో ఏమో, "సరే, చేసింది చాలు, ఇక ఈ దరిద్రం అంతా శుభ్రం చెయ్యండి" అని ఆర్డరు వేసి శర్మ గారు క్లాసు లోంచి వెళ్లి పోయారు.


తర్వాత బిక్కు బిక్కు మంటూ, నేను, దస్తగిరి, సురేష్, ఇంకా క్లాసు లోని కొంతమంది పిల్లలు స్టాఫ్ రూం కు వెళ్లి, సార్ కు సారీ చెప్పి, ఆయన కోసం తెచ్చిన ఆపిల్ పండ్లు ఇచ్చి వచ్చాం. "ఇలాంటివి స్కూల్ లోకి తీసుకు రాకూడదు ..సరే వెళ్ళండి. పిచ్చి వేషాలు వెయ్యకుండా బాగా చదువుకోండి" అని అప్పటికి మమ్మల్ని వదిలేసారు. సార్ మమ్మల్ని చివాట్లు పెట్టిన బాధకన్నా, మిగతా సెక్షన్ల కు ఈ విషయం తెలియకుండా ఎలా దాచాలన్నది మా ముందున్న పెద్ద సమస్య. ఎలా చెయ్యడమా అని అందరం మల్ల గుల్లాలు పడుతుంటే, దస్తగిరి మాత్రం "అన్ని బెలూన్లు పగలలేదని సార్ కు కోపం వచ్చిందిరా...అంతే, ఇంకేమి కాదు" అని జరిగిన దారుణానికి ముక్తాయింపు పలికాడు. 
తర్వాత ఎక్కడ కనిపించినా, మా వైపు తెలుగు సార్ అనుమానంగా చూడడం, ఆయనను తప్పించుకు తిరగడంతో మా 9 తరగతి చదువు భారంగానే గడిచింది. 
ఇప్పుడు అమెరికా లో, పిల్లల పుట్టినరోజు ఫంక్షన్ లు చేసినప్పుడు, కాంఫెట్టి వేసిన బెలూన్లను పేలుస్తూనే ఉన్నాం. ప్రతిసారీ నాకు మేము చేసిన గురుపూజోత్సవమే గుర్తుకు వస్తుంది. 


దస్తగిరి తో నాకు ఎదురైన మరో అనుభవం రెండో భాగం లో వివరిస్తాను...అంత వరకూ సెలవ్.


~ శశిధర్ సంగరాజు. 







10 comments:

జర్నో ముచ్చట్లు said...

డియర్ శశీ..
బాల్యస్మృతులు ఎప్పుడైనా ఎక్కడైనా అంతులేని ఆనందాన్నిస్తాయి. వాటిని తరచూ తలచుకుంటుంటే.. పెదవుల మీద చిరునవ్వు.. మనసులో అద్భుతమైన పులకింత భావం వచ్చి.. మనలో మనకే తెలియని కొత్త ఉత్సాహం కలుగుతుంటుంది. నీ గురుపూజోత్సవం అనుభవం కూడా అలాంటిదే. నీ నుంచి తరచూ ఇట్లాంటివి ఆశిస్తున్నా.

విజయ్‌

Sasidhar said...

విజయ్ గారు,
మీ కామెంట్స్ కు ధన్యవాదాలు. అవును, బాల్యస్మృతులు ఎప్పటికీ మరపురానివి. ఈ మధ్య మీరు పని ఒత్తిడిలో బిజీగా ఉన్నట్లున్నారు. మీ బ్లాగ్ లో కొత్త పోస్ట్ లు కనిపించలేదు. మీ నుంచి చక్కని పోస్ట్ ల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను.

~శశిధర్ సంగరాజు.

C L N RAJU said...

శశిధర్ గారూ...
మీ గురుపూజోత్సవ అనుభవాలు కడుపుబ్బా నవ్వించాయి. నిజంగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వానంటే నమ్మండి. మీ రెండో పోస్ట్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తుంటాను.

Sasidhar said...

@సి.ఎల్.ఎన్. రాజు గారు,
మీ అభిమానానికి ధన్యవాదాలు. నా రెండో పోస్ట్ త్వరలోనే రాస్తాను. తప్పకుండా చదవండి.

@శశిధర్ సంగరాజు.

వేణూశ్రీకాంత్ said...

శశిధర్ గారు హ హ మీ మాష్టారి హావభావాలను తలుచుకుంటే నవ్వు ఆగడంలేదండి. చాలా బాగా రాశారు.

dinesh said...

nice narration of most missing days

జేబి - JB said...

హహ్హహా

Sasidhar said...

@వేణు శ్రీకాంత్
@దినేష్

@జెబి

థ్యాంక్యూ వెరీమచ్

Anonymous said...

very good narration!!!
sri

Sasidhar said...

@sri

Thanks a lot

~Sasidhar