Powered By Blogger

Sunday, September 18, 2011

నేచురల్ బ్రిడ్జి - కెంటకి

మా ఊరు లూయివిల్ కు దాదాపు రెండు గంటల ప్రయాణ దూరంలో "నేచురల్  బ్రిడ్జి" స్టేట్ పార్క్ ఉంది. 

ప్రకృతి సహజం గా ఏర్పాటైన బ్రిడ్జి అన్నమాట. మీలో చాలామంది మన తిరుమల కొండమీద "శిలా తోరణం" చూసే ఉంటారు. సరిగ్గా అలాగే ఉంటుంది. కాకపొతే, చాలా పెద్దది ఎత్తైనది. మరో విషయం ఏంటంటే, నాకు తెలిసినంతవరకూ "శిలా తోరణం" మనం నడవడానికి వీలు లేదనుకుంటా. (నాకు సరిగ్గా గుర్తు లేదు. Correct me if I am wrong.) ఈ ఆర్చ్ మీద, మీరు నడవొచ్చు, పరుగులు పెట్టొచ్చు..మీ ఇష్టం. 

అసలీ పార్క్ కు వెళ్ళే దారికూడా చాలా బాగుంటుంది. రెండుగంటల ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది. దారి పొడువునా, విశాలమైన పచ్చిక బయళ్ళు, స్వేచ్చ గా తిరిగే గుర్రాలు. (మా ఊరు గుర్రాలకు, గుర్రప్పందేలకు ప్రసిద్ది)చూడ్డానికి చాలా బాగుంటాయి. 
అసలు ఎలా ఏర్పడింది:  దాదాపు మిలియన్ సంవత్సరాలకు పూర్వమే ఈ బ్రిడ్జి ఏర్పడడం మొదలైందని కొంత మంది జియాలజిస్ట్ ల నమ్మకం. నిజంగా ఎన్నాళ్ళ నుంచి ఉందో తెలియదు కానీ, కొంతమంది పర్యాటకులు 1889 నుంచి ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారట. 78 అడుగుల పొడవు, 65 అడుగుల ఎత్తు, 12 అడుగుల మందం, 20 అడుగుల వెడల్పు.ఇవీ  ఈ బ్రిడ్జి వివరాలు.
 
ఆసక్తి ఉన్నవారికి ఇక్కడ కేమ్పింగ్ వసతులున్నాయి. కొండ కిందున్న లేక్ లో బోటింగ్ చెయ్యడానికీ, పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం కూడా ఉన్నాయి. 





 











 


మరి కొండపైకి వెళ్ళడం ఎలా?:
ఇక్కడ ఉన్న "స్కయ్ లిఫ్ట్" నిజంగా ప్రత్యేక ఆకర్షణ. దాదాపు అరమైలు దూరం సాగే ఈ స్కయ్ లిఫ్ట్ ప్రయాణం ఉత్కంట భరితంగా ఉంటుంది. పైకి వెళుతున్న కొద్దీ, 
 కింద కనిపించే జింకలు, కుందేళ్ళు చూడ ముచ్చటగా ఉంటాయి.(కుందేళ్ళు కెమేరాకు చిక్కలేదు!)


ఈ ఆర్చ్ ఏర్పడడానికి ఉపయోగపడిన రాయిని  జియాలజీ పరిభాషలో 
"Pottsville conglomeratic sandstone" అంటారట. కొండపైన అడవిలాంటి ప్రాంతంలోపలికి వెళ్ళడానికి దారులు కూడా ఏర్పరచారు. 
మొత్తానికి ఈ ట్రిప్ పిల్లలకు, పెద్దలకు కూడా వీకెండ్ ఆటవిడుపే.


~శశిధర్  సంగరాజు.

2 comments:

శ్రీ said...

కెంటకీ శిలాతోరణం బాగుంది.

Sasidhar said...

Thank you!

~Sasidhar