Powered By Blogger

Tuesday, July 19, 2011

బహుశా ...ఇదే కారణమై ఉంటుంది.

అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే, రాందేవ్ బాబాల దీక్షలు, ప్రజలు దానికి మద్దతు పలకడం, రాజకీయనాయకులు యథాప్రకారం తమను కాదన్నట్లు అమాయకత్వం నటించడం చూస్తుంటే ఒకవైపు ఆనందం,మరోవైపు చిరాకు వస్తోంది. అవినీతి అన్ని రంగాల్లో ఉన్నా,  రాజకీయనాయకులదే పైచేయి.       నాకెప్పుడూ ఒక అనుమానం వస్తుండేది. రాజకీయ నాయకులు ఈస్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారు కదా, వీళ్ళకు మనస్సాక్షి ఉండదా?పాపభీతి లేదా? ఇంత మంది ఉసురు పోసుకుని రాత్రిళ్ళు ప్రశాంతంగా ఎలా పడుకోగల్గుతున్నారు? అని. ఈమధ్యకాలంలో నాకొక దిక్కుమాలిన లాజిక్ తట్టింది. (లాజిక్ దిక్కుమాలిందని ముందే చెప్పాను, నన్ను చీవాట్లు పెట్టి లాభంలేదు.) 

భగవద్గీత సిడిలో ఘంటశాల మాష్టారు స్పష్టంగా చెప్పారు -

                     "ఆత్మ నాశనము లేనిది.
                                 ఆత్మను అగ్ని దహింపజాలదు,
                                 నీరు తడపజాలదు,
                                వాయవు ఆర్పివేయనూ సమర్ధము కాదు " అని.

జనాలు ఎంతమాత్రం వేదాంతమార్గం పట్టారో  తెలియదుకానీ, మన రాజకీయనాయకులు ఈ పాయింట్ మాత్రం బాగా వంటపట్టించుకున్నట్లుంది.ఎలాగూ వీళ్ళు పోయాక ఆత్మ వెళ్ళేది నరకానికే (స్వర్గం గేటు దగ్గరికి కూడా వీళ్ళను రానివ్వరని అరాజ(చ)కీయులకు ముందే తెలుసు). ఆత్మకు పైనచెప్పినట్లు ఏ బెంగా లేదు. ఇంకేం, సిగ్గు, శరం లేకుండా "అనుభవించు రాజా" అని పాడుకుంటూ ఇష్టమొచ్చినట్లు లంచాలు మేసేస్తున్నారు. పాపం, ఈవిషయం తెలియక యమకింకరులు పెద్ద, పెద్ద విగ్గులు అవీ పెట్టుకుని, నల్లరంగు పూసుకుని అమాయకంగా తిరుగుతుంటారు...సినిమాల్లో చూపించినట్లు. "చేసుకున్నవాళ్ళకు చేసుకున్నంత" అన్నట్లు కొంతమందిని పట్టుకుని జైల్లో పారేసినా, అక్కడ కూడా ఇడ్లీలు, వడలు తింటూ ఎంజాయ్ చేస్తున్నారని వార్తలొస్తున్నాయి.

నా లాజిక్ తో ఏకీభవించేవాళ్ళెవరైనా ఉంటే, నాకు రాయండి.  ఇంతకూ, ఉన్నట్లుండి ఆత్మల మీద పడ్డాడేమిటి అనుకుంటున్నారా? దానికో కధ ఉంది. నా తర్వాత పోస్ట్ లో రాస్తాను.
~శశిధర్ సంగరాజు.

2 comments:

Rajendra Devarapalli said...

నిజమే మీరన్నది చాలావరకూ.నాయకులు కానివాళ్లలో చాలామందిదీ ఇదే నమ్మకం :)

Sasidhar said...

Rajendra garu,
Thanks for the comments. నా బ్లాగ్ కు అంత సీన్ లేకపోయినా, ఈ పోస్ట్ చదివి ఇంకొంతమంది ఈ మార్గం పట్టకపోతే అంతే చాలు.
~శశిధర్