Powered By Blogger

Saturday, May 7, 2011

కెంటకీ డర్బీ - మా ఊళ్ళో గుర్రప్పందేలు

మే 7 న (శనివారం) మా ఊర్లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన గుర్రప్పందేలు జరిగాయి. చర్చిల్ డౌన్స్ అనే ప్రాంతం లో జరిగిన ఈ రేసును  "డర్బీ" అంటారు. చిన్న, చితకా రేసులు దాదాపు సంవత్సరం పొడుగునా జరుగుతూనే ఉన్నా, ఈ రేసుకు ఒక ప్రత్యేకత ఉంది. అమెరికా లో ప్రతిసంవత్సరం మూడు పెద్ద రేసులు జరుగుతాయి. వీటిని "ట్రిపుల్ క్రౌన్" రేసులంటారు. లూయివిల్ లో జరిగిన "డర్బీ" రేసు,  "ట్రిపుల్ క్రౌన్" లో మొదటిది. రెండోది, "ప్రీక్నెస్ స్టేక్స్"  బాల్టిమోర్/మేరీలాండ్ లో జరుగుతుంది. మూడో రేస్ "బెల్మొంట్ స్టేక్స్" న్యూయార్క్ లో జరుగుతుంది. అక్కడితో  ఈ సంవత్సరానికి "ట్రిపుల్ క్రౌన్" రేసులు ముగుస్తాయి. 
చర్చిల్ డౌన్స్



ఈ బ్లాగ్ చదివేవాళ్ళలో జంతు ప్రేమికులేవరైనా ఉంటే "నోరులేని జీవాలను హింసిస్తున్న దుర్మార్గులు" అని నా మీద అలగక్కరలేదు. ఈ రేసులు ఇప్పుడేదో కొత్తగా మొదలైనవికావు. కెంటకీ డర్బీ 1875 లో, ప్రీక్నెస్ స్టేక్స్ 1873 లో, బెల్మొంట్ స్టేక్స్ 1867 లో మొదలైయ్యాయి. లక్షలాది మంది చూసి ఆనందిస్తే, మిలియన్ల కొద్ది డాలర్లు చేతులు మారతాయి. ఈ రేసులన్నిట్లో మూడు సంవత్సరాల వయసున్న గుర్రాలే పాల్గొంటాయి. పేరుకు మూడు సంవత్సరాల వయసైనా, చూడడానికి ఎత్తుగా, పెద్దగా హుందాగా ఉంటాయి. ఫినిషింగ్ లైన్ వైపు దూసుకొచ్చే గుర్రాలు చూడడానికి అద్భుతంగా ఉంటాయి. 
దూసుకుపోతున్నజాకీలు 


ఇక్కడో విషయం గమనించాలి, లింగవివక్ష ఎక్కడైనా ఉందేమో గానీ గుర్రప్పందేల్లో మాత్రం లేదని చెప్పగలను. సరిగ్గా డర్బీ జరగడానికి ఒక రోజు ముందు, లూయివిల్ లో "కెంటకీ ఓక్స్" అనే రేసు జరుగుతుంది. ఇందులో అన్నీ ఆడ గుర్రాలే పాల్గొంటాయి.


 ప్రతి సంవత్సరం లాగే, ఈ సంవత్సరం కూడా కొన్ని గుర్రాలమీద పందెం కాసాను. గతంలో ఎంతో, కొంత అనాలిసిస్ చేసి, గుర్రాల గురించి తెలుసుకుని మరీ పందేలు పెట్టేవాన్ని. కొన్నిసార్లు కొంత చిల్లర కూడా వచ్చినట్లు గుర్తు. అదేం విచిత్రమో, నేను పందెంకాసిన గుర్రాలు, రేసు మొదట్లో గుర్రాలుగానే పరుగు మొదలెట్టినా, చివరకొచ్చేసరికి గాడిదల్లాగా రూపాంతరం చెందుతున్నాయి. ప్రతిసారి నాకు చేతి చమురు వదలడమే. ఆడిన ప్రతిసారి ఓడిపోయేటప్పుడు, పందేలు కట్టడ మెందుకు అంటారా? అదో తుత్తి.  

వచ్చేసంవత్సరానికైనా "ఆశ్వ హృదయం" గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతం లో నకులుడికో, సహదేవుడికో ఈ విద్య తెలుసని చదివాను. చూద్దాం అదృష్టం ఎలాఉందో. 
~శశిధర్ సంగరాజు.

4 comments:

శ్రీ said...

నేను కెంటకీ డెర్బీ రెండు సార్లు చూసాను, మంచి సరదాగా ఉంటుంది. మా స్నేహితుడు డెర్బీలనీ ఫాలో అయ్యేవాడు. డిష్ నెట్ వర్క్ లో ఒక చానెల్ లో ఎపుడూ గుర్రం రేసులే చూసేవాడు.

Sasidhar said...

Dear Sri -
Yes, Kentucky Derby is fun to watch.
Thanks for the comments. Yes, there are some channels that telecast horse races around the world. I guess, TVG channel or something like that.

~Sasidhar

జర్నో ముచ్చట్లు said...

శశీ,
డర్బీ ఆర్టికల్‌ బావుంది. నా మస్తిష్కపు అంతరాళలో ఎక్కడో నిక్షిప్తమైన డర్బీ చరిత్రను బయటకి రప్పించావు. ధన్యవాదాలు. ఇంకో విషయం..జూదం అతి దారుణమైన వ్యసనం. మనకు తెలియకుండానే తన వశం చేసుకుంటుంది. జీవితాన్నే నష్టపరుస్తుంది. అయినా 'అశ్వమేధ యాగం' మనకెందుకు చెప్పు..? దేశం కాని దేశంలో ప్రశాంతంగా ఏదో ఉద్యోగం చేసుకుంటున్నావ్‌.. నాలుగు రాళ్లు వెనకేసుకుని పిల్లలకు పంచు..! శ్రేయోభిలాషిగా జస్ట్‌ ఇదో సలహా..! have a nice day.

Sasidhar said...

Vijay garu,

Thanks for the comments.
Yes, you are absolutely correct. Gambling kills people. But, I don't run behind it. I pitch in for derby only. It is kind of festival here.
Anyway, will keep your suggestion in mind.
BTW, I am not seeing much activity in your blog. Hope you are very busy with work. please keep writing.

~Sasi