Powered By Blogger

Sunday, April 24, 2011

అర్జునుడా? అభిమన్యుడా?

 కడప లోక్ సభకు, పులివెందుల అసెంబ్లీ కి ఉప ఎన్నికల తేదీ దగ్గరపడుతోంది . కాంగ్రెస్, తెలుగుదేశం,వైఎస్ఆర్ కాంగ్రెస్ హోరా హోరీ గా ప్రచారం చేసుకుంటున్నాయి. ఎప్పుడు చూసినా, కరవుతో, వర్షాభావంతో  అల్లాడే కడప ప్రజలపై ఇప్పుడు ధనవర్షం కురుస్తోంది. ఓటుకు ఐదు వేల రూపాయలవరకు ముట్టచెపుతున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.  కాంగ్రెస్ పార్టీ హేమాహేమీలను రంగం లోకి దింపింది. ఇక విమర్శలు, ప్రతివిమర్శలకు అంతే లేదు. ఈ నేపధ్యంలో విజయావకాశాలు ఎవరికి ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. ఇది కేవలం ఊహాత్మకమైన పరిశీలన మాత్రమే. ఫలితాలు దీనికి పూర్తిగా వ్యతిరేకంగా కూడా ఉండొచ్చు. 
ముందుగా పులివెందుల అసెంబ్లీ స్థానం: ప్రదానం గా పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ విజయమ్మ, కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డిల మధ్యనే.తెలుగుదేశం అభ్యర్థి బిటెక్ రవి మూడో స్థానంతో సరిపెట్టుకోవచ్చు. ఎందుకంటే, ఎంతో కుటుంబ నేపధ్యం, దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో తలపడిన ఎస్వీ సతీష్ రెడ్డి కే ఇక్కడ విజయం దక్కలేదు. మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన బిటెక్ రవికి ఇంతకన్నా మెరుగైన ఫలితాలు వస్తాయనుకోవడం నమ్మశక్యం కాని విషయం. 

ఇక విజయమ్మ పరిస్థితి కొస్తే, ప్రస్తుతానికి ఎక్కడికి వెళ్ళినా మహిళలు నీరాజనాలు పడుతున్నారు. గతంలో ఒక్కసారి కూడా ప్రచారానికి రాని ఆమె, మండుటెండల్లో వీదుల్లోకి రావడంతో మహిళల్లో  సానుభూతి కూడా పుష్కలంగా ఉంది. కానీ, ఇక్కడే ఒక చిన్న మెలిక ఉంది. మహిళా సానుభూతి ఓట్లతో ఒకవేళ గెలిచినా, పులివెందుల ప్రజలకు వాళ్ళ పనులు జరగాలంటే, మళ్ళీ వివేకానందరెడ్డి సహాయం తప్పనిసరి. పైగా, 
వైఎస్ మరణం తర్వాత, అన్ని పార్టీల మద్దతుతో గెలుపొందిన విజయమ్మ ఒక్కసారి కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు (మీడియా వార్తల ప్రకారం). అప్పుడంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు "మీది తెనాలే..మాది తెనాలే" అని పాడుకుంటూ సరిపెట్టుకున్నారు. ఇప్పుడు విజయమ్మ, జగన్ ఇద్దరూ కాంగ్రెస్ కు  బద్దవ్యతిరేకుల జాబితాలో చేరిపోయారు కాబట్టి, ఒకవేళ గెలిచి అసెంబ్లీ, మెట్లు ఎక్కకపోతే, ప్రతిపక్షాలతో పాటు, కాంగ్రెస్ కూడా విమర్శలు గుప్పించక మానదు. ఒకవేళ, అసెంబ్లీ కి వెళ్ళినా ప్రజా సమస్యలపై ఈమె ఏమాత్రం పోరాడుతారో అనుమానమే. (ఇప్పుడు అసెంబ్లీ లో ఉన్నోళ్ళు ఏమి పొడిచేసారని నన్ను అడక్కండి...నా దగ్గర సమాధానం లేదు) 
వివేకానంద రెడ్డి విషయానికొస్తే, మొన్నేదో అసెంబ్లీ లో గాలి ముద్దుకృష్ణమనాయుడ్ని ఒక్కటిచ్చుకున్నాడని పేపర్లలో వచ్చింది గానీ, స్వతహాగా ఈయన సౌమ్యుడు. పులివెందుల ప్రాంతంలో అందరికి అందుబాటులో ఉంటాడనే మంచి పేరు ఉంది. (ఈయన లోగడ కడప ఎంపి గా చేసినప్పుడు అందరూ అంటుంటే, విన్నాను. ) మంత్రి పదవికి రాజీనామా చేసి మరీ పోటీ చెయ్యడం ఒక విధంగా ప్లస్ పాయింట్ అవుతోంది. 

Bottom Line: తక్కువ మెజార్టీతో అయినా సరే, పులివెందుల నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి గెలుస్తాడని నా అంచనా. 
కడప పార్లమెంటు స్థానం: ఇక్కడ, కాంగ్రెస్ నుంచి డిఎల్ రవీంద్ర రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి జగన్, తెలుగుదేశం నుంచి మైసూరారెడ్డి బరిలో ఉన్నారు. అధికార పార్టీ, అధికారుల అండదండలు డిఎల్ కు కలిసివచ్చే అంశం. కాకపొతే, ఈయన సాదారణంగా మైదుకూరు నియోజక వర్గానికి పరిమితమైన నాయకుడు. జిల్లా మొత్తాన్ని ఎలా ప్రభావితం చేస్తాడనే దానిమీద విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. పిఆర్పి, కాంగ్రెస్ లో విలీనం కావడంవల్ల, ఆ సామాజిక వర్గం ఓట్లు తప్పకుండా కలిసొస్తాయి. ఇక, మైసూరారెడ్డి ది మాత్రం ఎదురీతే. స్వతహాగా, మంచి నాయకుడనే పేరు, ప్రజల్లో సానుభూతి (గత ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయాడు కాబట్టి)ఉంది. అవి ఎంతవరకు ఓట్లుగా మారతాయనేది వేచిచూడాల్సిన విషయం. 
ఇక జగన్, ఈయన,  తాను సియం అయితే...ఏ ఫైల్ మీద ముందుగా సంతకం పెడతాడో అన్న విషయం పక్కనపెట్టి, ప్రజలకు ఏమిచేస్తాడో చెపితే ఇంకొన్ని ఓట్లు ఎక్కువ రాలే అవకాశం ఉంది.కాంగ్రెస్ పన్నిన పద్మవ్యూహం లో అభిమన్యుడవుతాడో, అర్జునుడవుతాడో మే 13 దాకా వేచిచూడాల్సిందే.  

Bottom Line: జగన్ వర్గం డప్పు కొట్టుకుంటున్నట్లు, మూడులక్షల మెజార్టీ రాదు కానీ, జగన్ గెలిచే అవకాశాలే ఎక్కువున్నాయి. గతంలో కన్నా మెజార్టీ తగ్గొచ్చు. అయినా, ఎంపి గా పదవీ కాలం ఉన్నప్పుడు, రాజీనామ చేసి, మళ్లీ ఎంపి గా గెలిస్తే మాత్రం ఒరిగేదేముంటుంది (సొంత గుర్తు మీద గెలిచానన్న తుత్తి తప్ప).
రిగ్గింగ్ జరక్కుండా అడ్డుకుని, ప్రజలను స్వేచ్చగా ఓట్లు వేసుకోనిస్తే ఫలితాలు తారుమారైయ్యే అవకాశం ఉంది. కానీ, కడప లో అది సాధ్యమైయ్యే వ్యవహారం కాదు. ముఖ్యంగా, ఈ ఎన్నికల్లో. 
ఒకవేళ, రెండు సీట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుచుకుంటే, రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి మాత్రం ఖాయం. 

Wednesday, March 16, 2011

పట్టుకుంటారా...వదిలేస్తారా?

ఇరానీ హోటల్ లో ఇద్దరు:
మొదటివ్యక్తి: తెలంగాణా ఉద్యమం, ట్యాంక్ బండ్ మీద విగ్రహాల ధ్వంసం, జగన్ పార్టీ, జపాన్ సునామీ   ఈ వార్తల్లో పడి ఈ మధ్య పట్టించుకోలేదు కానీ, భాను ఏమైయ్యాడ్రా?

రెండోవ్యక్తి: ఏ భాను?

మొదటివ్యక్తి: చూసావా, నువ్వుకూడా మర్చిపోయావ్!

రెండోవ్యక్తి: ఆ..ఆ...గుర్తొచ్చింది. మద్దులచెర్వు సూరి ని  హత్యచేసాడని అనుమానిస్తున్న భాను గురించేగా...అవున్రా.. ఏమైయ్యాడంటావ్?

మొదటివ్యక్తి: ఎక్కడో మన పొలీసు బాబాయిల ప్రతిభ చూసి నవ్వుకుంటూ ఉంటాడు.

రెండోవ్యక్తి: పాపం, సూరి పోయి వంద రోజులు దాటినట్లుంది.

మొదటివ్యక్తి: అవును. ఇదంతా చూస్తుంటే ఒక విషయం గుర్తుకొస్తోంది. మేము కాలేజ్ కు వెళ్ళే దారిలో ఒక గోడ మీద ఎవరో ఎర్ర అక్షరాలతో రాసారు "పోలీసుల్లారా! బుర్ర ఉన్నది టోపీ లు పెట్టుకోవడానికి కాదు. ఆలోచించడానికి" అని. అది నిజమనిపిస్తోంది.

రెండోవ్యక్తి:  ఏమోరా బాబు! చూస్తుంటే సూరి సంవత్సరీకానికైనా పట్టుకుంటారా? లేకపోతే,  వాడి పాపాన వాడే పోతాడని వదిలేస్తారా అనిపిస్తోంది.

~శశిధర్ సంగరాజు. 

Thursday, March 3, 2011

కుయ్యో ...మొర్రో

అవును. ప్రస్తుతం నా పరిస్థితి (అంటే, నా ఒక్కడిదే కాదు, అమెరికాలో అందరిదీ) అలాగే ఉంది మరి.
పెట్రోల్ రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. మధ్యప్రాచ్యం లో విప్లవం పుణ్యమా అని పెరగడం మొదలెట్టిన పెట్రోల్ ధరలు రెండు డాలర్ల నుంచి పెరుగుతూ వచ్చి ఈరోజుకు మూడున్నర డాలర్లకు చేరుకుంది. 

దురుద్రుష్టం కొద్దీ, మా ఆఫీసు పక్కనే గ్యాస్ స్టేషన్ (అమెరికాలో పెట్రోల్ బంకును అలాగే పిలుస్తాం) ఉంది. నా సీట్ లోంచి చూస్తే స్టేషన్ ముందున్న  పెట్రోల్ ధరల బోర్డు కనిపిస్తుంది. హనుమంతుడి తోకలాగా రోజు, రోజుకు పెరిగే ధరలు చూడడం, గుండెలు బాదుకోవడమే పనిగా తయారైంది నాకు. నాకు తెలిసి చాలామంది, ఈ పెట్రోల్ వేడి తట్టుకోలేక వీకెండ్ ప్రయాణాలు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మరీ ప్లాన్ చేసుకుంటున్నారు. ట్యాంక్ నింపితే పట్టుమని వారం రోజులు కూడా రావడం లేదు. 

ఈ పరిస్థితి ఇలాగే సాగితే, కార్లు మానేసి, సైకిల్ కొనుక్కోవడమో, లేకపోతే క్లింట్ ఈస్ట్ వుడ్ సినిమాల్లో లాగా గుర్రాలపై తిరగడమో తప్పేట్లు లేదు.

మొన్నీ మధ్య గుడికి వెళ్ళినప్పుడు దేవుడ్ని ప్రార్థించా.."భగవంతుడా! నా జీవితం రొటీన్ గా తయారైంది. ఏదైనా మార్పు చూపించు" అని. ఆయన ఏం విన్నాడో, ఏమో, ఉదయానికల్లా పెట్రోల్ రేట్లు పెంచేసాడు. ఈ సారి పంతులుగారితో అయినా రికమెండ్ చేయించాలి. 
~శశిధర్ సంగరాజు.  

Friday, February 25, 2011

నిష్కల్మష మూర్తి కి అశ్రునివాళి

ఈ మధ్య పనిఒత్తిడితో తరచూ బ్లాగ్ లో రాయడం కుదరలేదు. కానీ ఆంధ్ర రాజకీయాలు మాత్రం కొద్దో గొప్పో ఫాలో అవుతున్నాను. రాజకీయాలు పక్కన పెడితే, నన్ను బాగా కదిలించింది ముళ్ళపూడి గారి మరణం.

ఇండియా ట్రిప్ కు వెళ్ళినప్పుడు తెలుగు పుస్తకాలు కొని తెచ్చుకోవడం మామూలే. ఇటీవల ఇండియాకు వెళ్ళినప్పుడు కూడా కోతికొమ్మచ్చి - 2  కొన్నాను. మొదటి భాగం స్టాక్ లేకపోవడం వల్ల దొరకలేదు. పనిఒత్తిడి ఎక్కువైనా, మనసు బాలేకపోయినా బుడుగు - సీగానపెసూనంబలు, కోతికొమ్మచ్చులు నాలో మళ్లీ ఉత్సాహాన్ని నింపుతుంటాయి. అలాంటి మంచి  మనిషి మన మధ్య లేరనే విషయం నిజం కాకపొతే బాగుండనిపిస్తోంది.

టివి కార్యక్రమాల్లో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించినా, సభల్లో ప్రసంగించినా ఒక్క పొల్లు మాట ఆయన నోటి నుంచి దొర్లిన సందర్భం లేదంటే అతిశయోక్తి కాదు. మాటల విలువ తెలిసిన మహనీయుడు. తమకు అవార్డులు రాకపోతే ఎదుటివాళ్ళ మీద దుమ్మెత్తి పోసే సినీరంగంలో ఉంటూ కూడా, తమకు "పద్మాలు" రాలేదని పన్నెత్తు మాట కూడా అనని సంస్కారి. ప్రాణ మిత్రుడు బాపుగారితో కలసి ఎన్నో సిల్వర్ జూబిలీ హిట్లు ఇచ్చినా, ఏనాడూ, ప్రచార ఆర్భాటానికి వెళ్ళని నిగర్వి.

"జాతస్య మరణం.." నిజమైనప్పటికీ, మరణం ఇలాంటి వారి విషయంలో వీలున్నంత నిదానంగా వస్తే బాగుంటుందేమో.  జీవించినంత కాలం అందరినీ నవ్వించిన పెద్దాయన ఆత్మకు శాంతి కలగాలనీ, ఆయన బహిప్రాణం బాపుగారికి ఈ కష్టకాలంలో  వీలున్నంత త్వరగా స్వాంతన చేకూరాలని ఈ బ్లాగ్ ముఖంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. 

~శశిధర్ సంగరాజు. 

Sunday, February 6, 2011

మనిషివా....చిరంజీవివా?

ఇరానీ హోటల్ లో ఇద్దరి సంభాషణ...

మొదటివాడు: ఏరా...వార్తలు ఫాలో అవుతున్నావా?
రెండోవాడు: అవుతున్నానులే...ఏం?
మొదటివాడు: పీఆర్పీ...కాంగ్రెస్...
రెండోవాడు: ఆ విషయం వదిలైయ్యరా బాబూ..కడుపులో దేవేసినట్లుంది.
మొదటివాడు:అదికాదురా..ఏంటీ దారుణం అని.
రెండోవాడు: అదంతే లేరా...సైడ్ కాల్వలన్నీ వెళ్లి మెయిన్ డ్రైనేజ్ లో కలవాల్సిందే.
మొదటివాడు:జనాలేమనుకుంటారో అని కూడా లేకుండా...
రెండోవాడు: జనాలేమనుకుంటారూ .. " మా చిరు వచ్చేసాడ్రా...అలాంటిలాంటి మార్పు కాదు....అవినీతిని  కడిగేస్తాడు...సామాజిక న్యాయం తెస్తాడు...చూస్తుండు" అని నిన్న మొన్నటి దాకా ఊగిపోయిన మా ఎదురింటి బాబాయి ...ఉదయాన్నే ఎవరినో తిడుతున్నాడు..."నువ్వు మనిషివా...చిరంజీవివా?" అని.
మొదటివాడు: ఖర్మ గాకపోతే...ఎందుకొచ్చిన దూల.కొన్ని రోజులు పోతే మెగాస్టార్ ను దగాస్టార్ అని కూడా అంటారేమో...


~శశిధర్ సంగరాజు.

Saturday, February 5, 2011

పీఆర్పీ + కాంగ్రెస్ = ఇంకో చారిత్రక తప్పిదం (?)

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపెయ్యడం దాదాపుగా ఖరారైంది (మీడియా వార్తల ప్రకారం)..
విలీనం మరో  చారిత్రక తప్పిదం అవుతుందని నా నమ్మకం. ఈ నేపధ్యం లో నా అభిప్రాయాలు :


ఆగుష్టు 26 , 2008 తిరుపతి లో మెగా స్టార్ చిరంజీవి "ప్రజారాజ్యం" పార్టీని అధికారికంగా ప్రకటించబోతున్నాడు. దాదాపు అంతకు నెల రోజుల ముందరనుంచే మీడియా లో పార్టీ జెండా, అజెండాల గురించి చర్చలు ఊపందుకున్నాయి. ఆంధ్ర రాజకీయాల మీద ఆశక్తి తో నేను కూడా అమెరికా నుంచి ఈ డెవలప్మెంట్ల ను గమనిస్తూ వచ్చాను. ఒక విధంగా సంతోషపడ్డాను కూడా. ఎందుకంటే, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రత్యామ్న్యాయంగా ఇంకో రాజకీయ పార్టీ రాబోతోందని. అదీ, అత్యధిక ప్రజాదరణ ఉన్న చిరంజీవి పెట్టబోయే పార్టీ. ఇక ఆంధ్ర ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని మురిసి ముక్కలైపోయాను.అమెరికా నుంచి కొందరు ఉత్సాహవంతులు పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి తరలి వెళ్ళారు.  అంతటి అద్రుష్టం, అవకాశం నాకు లేకపోయిందే అని కొంత బాధపడ్డ మాట కూడా నిజం. స్వర్గీయ ఎన్టీయార్  1983 లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు నేను బాగా చిన్నవాణ్ణి. అందరూ అనుకుంటుంటే వినడమేకానీ, ఈ రాజకీయ పార్టీలు, ఎలెక్షన్ లు ఆంటే ఏమిటో అర్థం అయ్యేది కాదు. సరే, అప్పుడెలాగు త్రిల్ మిస్ అయ్యాము ,  ఈయనేదో పొడిచేస్తాడు కదా అని ఎదురుచూడడం మొదలెట్టాను. 


పార్టీ పెట్టిందగ్గర నుంచి, " నానాటికి తీసికట్టు నాగం భొట్లు" అన్నట్లు తయారైయాడు అన్నయ్య. ఏ విషయంలో క్లారిటీ లేదు (ఇప్పుడు పీఆర్పీని, కాంగ్రెస్ లో  విలీనం చెయ్యడం మినహా). తనను చూడడానికోచ్చే  జనాన్ని చూసి మురిసి పోవడం తప్ప.ఇక పవన్ కళ్యాణ్ అయితే కాంగ్రెస్ పార్టీని, నాయకులను అమ్మనాబూతులు తిట్టేసాడు. పార్టీ పెట్టింతర్వాత గట్టిగా రెండు,మూడు సంవత్సరాలైనా నడపడం చేతకాలేదు. తమిళనాడు లో విజయకాంత్ ను చూడండి ఎలా రాజకీయాలకు ఎదురీదుతున్నాడో. సాటి నటుడ్ని చూసినా చిరుకు జ్జ్ఞానోదయం కలగాలి.


కేవలం జగన్ తాకిడిని తట్టుకోవడానికి తప్ప, కాంగ్రెస్ కు చిరంజీవి వల్ల ఒనగూడే లాభం ఏమాత్రం లేదు. ఒకవిధంగా నష్టమే. అదెలాగంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చిరంజీవికి కొత్త అల్లుడి మర్యాదలు చేస్తే, ఇంతవరకూ పార్టీని పట్టుకు వేలాడుతున్న సీనియర్లు అలగడం ఖాయం.  వాళ్ళను మచ్చిక చేసుకోవడానికి చిరంజీవి ని పక్కన పెట్టడమో, ప్రాధాన్యత తగ్గించడమో చేస్తే,ఇక పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేసి ప్రయోజనం ఏముంది. మీడియా లో ఇంకో రకం పుకార్లు వినిపిస్తున్నాయి. విలీనం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టి చిరంజీవిని సీయమ్ చేస్తారని. ఎందుకయ్యా ఆంటే , జగన్ ను ఎదుర్కునేందుకు సమర్ధుడైన నాయకుడి అవసరం కనుక. చిరంజీవి సమర్దుడే అయితే ఈసరికి ముఖ్యమంత్రే అయ్యేవాడు. ఇక, ప్రతిదానికి అల్లు అరవింద్ వైపు చూసే చిరంజీవి, జగన్ ను ఎదుర్కుంటాడనేది అర్థం లేని వాదన. 


కొంతమంది పీఆర్పీ నాయకులు, రాజకీయాల్లో ఇలాంటి విలీనాలు తప్పు కాదు, విజయశాంతి "తల్లి తెలంగాణా పార్టీ"ని తెరాస లో విలీనం చెయ్యలేదా అని లా పాయింట్లు లాగుతున్నారు. ఆంటే, చిరంజీవిని , విజయశాంతిని ఒక గాటన కట్టేస్తారా? ఒక రకంగా విజయశాంతి నయం. తెలంగాణా సాధనకు పోరాడుతున్న ఇంకో పార్టీ లో   విలీనం చేసింది. కమ్యునిస్ట్ పార్టీలు కాంగ్రెస్ ను, టిడిపి ని తిట్టి తర్వాత అవసరానికి వాళ్ళతో పొత్తు పెట్టుకోలేదా అని మరో వాదన. రాష్ట్ర రాజకీయాల్లో,కమ్యునిస్ట్ పార్టీ లు ప్రధాన పార్టీలకు ఎప్పుడూ ప్రత్యామ్నాయం కాదు. అలా ఎవరైనా అనుకుంటే అంతకన్నా పొరపాటు ఇంకోటి ఉండదు. కానీ, అభిమానులు పీఆర్పీని, కాంగ్రెస్, టిడిపి లకు ప్రత్యామ్నాయంగానే చూసారు. ఇప్పుడు పీఆర్పీ జండాలు మోసిన అభిమానుల పరిస్థితేంటి. ఆస్తులమ్ముకుని, 2009 లో పీఆర్పీ తరుఫున పోటీచేసిన వాళ్ళ పరిస్థితేంటి.విలీనం అంటూ జరిగితే (జరగడం అనివార్యం...ఈ సరికే పీఆర్పీ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పదవుల వాసన చూపించేసింది...వాల్లెలాగూ పదవులకు మొహం వాచే ఉన్నారు.) పీఆర్పీ వీళ్ళందరికీ ముందుగా జవాబు చెప్పాలి. 

ఒకవైపు, కేంద్రం, రాష్ట్రాల్లో  2 జి స్పెక్ట్రం అవినీతి, ఎమ్మార్ కుంభకోణాలు ఎదుర్కుంటున్న పరిస్తితుల్లో, కాంగ్రెస్ అవినీతికి వ్యతిరేకంగా పోరాడాల్సింది పోయి, వెళ్లి, వెళ్లి కాంగ్రెస్ లో కలవడం నిజంగా మూర్ఖత్వమే. అయినా, అంత తొందరేమొచ్చింది. పదవుల పిచ్చ కాకపొతే.

ప్రజలను, అభిమానులను వెర్రివాళ్ళను చేసిన ఈ మొత్తం డ్రామాలో బంపర్ ఆఫర్ కొట్టింది అల్లు అరవింద్. మొన్న ఎలెక్షన్లలో ఓడిపోయినా, ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం లేకపోయినా, చిరంజీవి బామ్మర్ది అయిన కారణంగా కేంద్రంలో మంత్రి పదవి వచ్చేలాగుంది. మొత్తానికి, చిరంజీవి పెట్టిన ఈ పీఆర్పీ దుకాణం త్వరలో ఎలాగూ మూసేస్తారు. అదేదో కథలో చెప్పినట్లు "ఏనుగు ఏదో చేస్తుందని జనాలు ఎగబడితే, వారికి నిరాశ ఎదురైనట్లు ...." పీఆర్పీ ప్రస్థానం ఈ రకంగా తుస్సుమంది. ముందుముందు, చిరంజీవి & కో ఇంకెన్ని అవమానాలు ఎదుర్కోవాలో. చూద్దాం.


~శశిధర్ సంగరాజు.

Thursday, January 20, 2011

సింహ Vs పరమవీర చక్ర

ఇంతలో ఎంత తేడా...
సింహ: "చూడూ...ఒకవైపే చూడూ...రెండో వైపు చూడాలనుకోకూ..తట్టుకోలేవూ..మాడిపోతావ్" 
            (ప్రేక్షకుల చప్పట్లతో ధియేటర్ లు మారుమోగాయి)
పరమవీరచక్ర : "చూడూ...వాల్ పోస్టర్ మాత్రమే చూడూ..సినిమా చూడాలనుకోకూ...చచ్చిపోతావ్ "
          (ప్రేక్షకులు బయటనుంచే పారిపోవడంతో ధియేటర్ లు చిన్నబోయాయి)
~ శశిధర్ సంగరాజు.