Powered By Blogger

Sunday, September 18, 2011

నేచురల్ బ్రిడ్జి - కెంటకి

మా ఊరు లూయివిల్ కు దాదాపు రెండు గంటల ప్రయాణ దూరంలో "నేచురల్  బ్రిడ్జి" స్టేట్ పార్క్ ఉంది. 

ప్రకృతి సహజం గా ఏర్పాటైన బ్రిడ్జి అన్నమాట. మీలో చాలామంది మన తిరుమల కొండమీద "శిలా తోరణం" చూసే ఉంటారు. సరిగ్గా అలాగే ఉంటుంది. కాకపొతే, చాలా పెద్దది ఎత్తైనది. మరో విషయం ఏంటంటే, నాకు తెలిసినంతవరకూ "శిలా తోరణం" మనం నడవడానికి వీలు లేదనుకుంటా. (నాకు సరిగ్గా గుర్తు లేదు. Correct me if I am wrong.) ఈ ఆర్చ్ మీద, మీరు నడవొచ్చు, పరుగులు పెట్టొచ్చు..మీ ఇష్టం. 

అసలీ పార్క్ కు వెళ్ళే దారికూడా చాలా బాగుంటుంది. రెండుగంటల ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది. దారి పొడువునా, విశాలమైన పచ్చిక బయళ్ళు, స్వేచ్చ గా తిరిగే గుర్రాలు. (మా ఊరు గుర్రాలకు, గుర్రప్పందేలకు ప్రసిద్ది)చూడ్డానికి చాలా బాగుంటాయి. 
అసలు ఎలా ఏర్పడింది:  దాదాపు మిలియన్ సంవత్సరాలకు పూర్వమే ఈ బ్రిడ్జి ఏర్పడడం మొదలైందని కొంత మంది జియాలజిస్ట్ ల నమ్మకం. నిజంగా ఎన్నాళ్ళ నుంచి ఉందో తెలియదు కానీ, కొంతమంది పర్యాటకులు 1889 నుంచి ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారట. 78 అడుగుల పొడవు, 65 అడుగుల ఎత్తు, 12 అడుగుల మందం, 20 అడుగుల వెడల్పు.ఇవీ  ఈ బ్రిడ్జి వివరాలు.
 
ఆసక్తి ఉన్నవారికి ఇక్కడ కేమ్పింగ్ వసతులున్నాయి. కొండ కిందున్న లేక్ లో బోటింగ్ చెయ్యడానికీ, పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం కూడా ఉన్నాయి. 





 











 


మరి కొండపైకి వెళ్ళడం ఎలా?:
ఇక్కడ ఉన్న "స్కయ్ లిఫ్ట్" నిజంగా ప్రత్యేక ఆకర్షణ. దాదాపు అరమైలు దూరం సాగే ఈ స్కయ్ లిఫ్ట్ ప్రయాణం ఉత్కంట భరితంగా ఉంటుంది. పైకి వెళుతున్న కొద్దీ, 
 కింద కనిపించే జింకలు, కుందేళ్ళు చూడ ముచ్చటగా ఉంటాయి.(కుందేళ్ళు కెమేరాకు చిక్కలేదు!)


ఈ ఆర్చ్ ఏర్పడడానికి ఉపయోగపడిన రాయిని  జియాలజీ పరిభాషలో 
"Pottsville conglomeratic sandstone" అంటారట. కొండపైన అడవిలాంటి ప్రాంతంలోపలికి వెళ్ళడానికి దారులు కూడా ఏర్పరచారు. 
మొత్తానికి ఈ ట్రిప్ పిల్లలకు, పెద్దలకు కూడా వీకెండ్ ఆటవిడుపే.


~శశిధర్  సంగరాజు.

Friday, September 16, 2011

నీ అసాధ్యం కూలా.. రాంబాబూ...నువ్వు సామాన్యుడివి కాదయ్యా!

ఇదిగో రాంబాబూ,
టీవీల్లో ఏదో చూపిస్తున్నారు. నువ్వేం  మనసు కష్టపెట్టుకోకు. ఈసారి వినాయక చవితికి కథ చదువుకోకుండా చంద్రున్ని చూసినట్లున్నావ్. నీలాపనిందలు. అవే సర్దుకుంటాయి లే.

అయినా, ఈ ఆంధ్రజ్యోతి ఛానల్ వాళ్ళకు వేరే పనేమీ లేనట్లుంది. గతంలో కూడా ఎన్ డి తివారీ విషయంలో కూడా ఇలాగే చేసారు. ఏదో ముసలాయన ఊరపిచ్చుక లేహ్యం గట్రా తిని హుషారుగా ఉన్నాడులే అని చూసీ చూడనట్లుండకుండా నానా యాగీ చేసి గవర్నర్ గిరి ఊడగొట్టించారు.

సరే, నీ విషయంలో అంటే ఊడగొట్టించడానికి నీ దగ్గర ప్రస్తుతానికి పదవేదీ లేదనుకో.
ఇక పరువు మర్యాదలంటావా..తూచ్..మనకు వాటికీ ఆమడదూరం. ఈ విషయం వాళ్ళకు తెలిసిరాలేదు.

అయినా, ఈ మధ్య ఓటర్ల కు కూడా బాగా కోరికలెక్కువయ్యాయి. ఏదో అయిదు సంవత్సరాలకొకసారి, నాలుగైదు
గంటలు ఎండలో నిలబడి ఓటు వేసినంతమాత్రాన, అవినీతి చెయ్యద్దంటారు, మహిళలను గౌరవించాలంటారు, ఎంత కష్టం. పైగా ప్రతిదానికీ ప్రకాశం పంతుల్ని, వావిలాల గోపాలకృష్ణయ్య లాంటివాళ్ళను ఉదాహరణలు చూపిస్తారు. వాళ్ళలా నీతినిజాయితీ గా ఉండడానికి మనకేమైనా చాదస్తమా? ఏదో నాలుగు రాళ్ళు సంపాదించుకోకపోతే, రాజకీయాల్లోకి రావడం ఎందుకు?

 వీళ్ళకు తోడు ఈ మధ్యన అన్నాహజారే తయారయ్యాడు,  ప్రతిదానికీ నిరాహార దీక్ష చేస్తానంటాడు.
ఈవయసులో అప్పుడప్పుడూ ఉపవాసం చెయ్యడం ఆయనకు కూడా మంచిదే అనుకో. కాకపోతే మధ్యతరగతి జనాలు ఆ విషయం అర్థం చేసుకోవడం లేదు. ఏదో భూమి బద్దలైపోతున్నట్లు హడావిడి.

ఇంతకూ రాంబాబూ, మహిళా కార్యకర్తలను ఈరకంగా గిల్లుకోవచ్చని నీకు భలే ఐడియా వచ్చిందే. సూపర్ కదా!
అందుకే నిన్ను సామాన్యుడివి కాదూ అన్నది. రాజకీయాల్లో టెన్షన్ తట్టుకోలేక, రిలీఫ్ కోసం చేసి ఉంటావు కదా? అంతేలే, దానికి ఇంత గొడవ చెయ్యాలా?

ఏమాటకు ఆమాట చెప్పుకోవాలి. నీ తాపత్రయం నా కర్థమైందిలే. ఏదో బయటున్నప్పుడే ఈ ముచ్చట్లన్నీ.
రేప్పొద్దున ఎమ్మార్ కేసులో సిబిఐ అరెస్టు చేసి లోపలేసిందనుకో, అక్కడ గోక్కోడానికి మహిళా కార్యకర్తలెవరూ ఉండరు. ఉంటే గింటే, మహిళా కానిస్టేబుళ్ళు ఉంటారు. వాళ్ళను గోకావనుకో, బయటకు  చెప్పుకోలేనిచోట థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు. మళ్ళీ అదో  బాధ.

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నట్లున్నావ్. ధైర్యం అంటే అదీ. నిజం ఎలాగూ త్వరలోనే బయటపడుతుంది. ఈలోపల తొందరపడి జగన్ పార్టీలోంచి తీసేస్తాడని ఆలోచించొద్దు. ఇది కాకపోతే ఇంకోటి. ఈసారి మహిళలు కాస్త ఎక్కువున్న పార్టీ చూసి చేరుదువు గానీ. వినడానికి ఫోన్లో నీ గొంతు భలేగా ఉంది రాంబాబూ. ఈసారి వీడియో చాటింగ్ చెయ్యి. టెక్నాలజీ ని ఉపయోగించుకో. అసలే నీది మంచి ఫోటోజనిక్ ఫేస్  కదా.

ఈ ఛానళ్ళు, మహిళా సంఘాల  గొడవ మామూలేగానీ, నీ పనిలో నువ్వుండు. ఆల్ ది బెస్ట్.

~శశిధర్ సంగరాజు.

Thursday, September 8, 2011

750..800..850...

ఇరానీ హోటల్ లో ఇద్దరు...

మొదటి వ్యక్తి : (గాల్లోకి చూస్తూ...)   750..800..850...
రెండో వ్యక్తి : ఏంటి గురూ..ఏదో లెక్కలేస్తున్నట్లున్నావ్? ఏదైనా ఇంటి స్థలం కొంటున్నావా? ఎన్ని గజాలేంటి?
మొదటి వ్యక్తి : అబ్బే, ఇది గజాల్లెక్క కాదు. పొట్ట పగిలేలా దోచుకుతిన్న గాలి జనార్ధనరెడ్డి ని జైల్లో పెట్టి ఖైదీ నెంబర్ 697  ఇచ్చారు కదా? మన జగనన్న కు ఏ నెంబర్  వస్తుందా అని ఆలోచిస్తున్నా!
రెండో వ్యక్తి : అదేంటీ? బేరం సెటిల్ చేసుకోవడానికి ఢిల్లీ లెవెల్లో ఏదో ప్రయత్నం చేస్తున్నట్లున్నాడు?
మొదటి వ్యక్తి : ఆ ప్రయత్నాలన్నీ చీదేశాయి. మనోడు ఇంటిదారి కూడా పట్టాడట. డబ్బు మంత్రం పని చేసినట్లు లేదు. 
రెండో వ్యక్తి: సిబిఐ కూడా బాగా గట్టిగా ఉన్నట్లుంది. శ్రీకృష్ణ జన్మస్థానం తప్పేట్లు లేదు.
మొదటి వ్యక్తి: అందరూ అదే అంటున్నారు. లోపలకు వెళ్ళాక ఏ నెంబర్ వచ్చినా పర్లేదు కానీ, 786 మాత్రం రాకూడదు. లేకపోతే, దేవుడు తనవైపే ఉన్నాడని ఇంకో పిడివాదం మొదలెడతాడు. మొన్న ఏదో ఇంటర్వ్యూ లో చెప్పాడుగా, తనను అరెస్ట్ చేస్తే, దేవుడు వాళ్ళను శిక్షిస్తాడని.
రెండో వ్యక్తి : నిజమే, అంత పనీ, చెయ్యగలడు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వర్షం పడితే, వరుణుడు మా వైపే ఉన్నాడనేవాడు. 
మొదటి వ్యక్తి: చూద్దాం. సిబిఐ జగన్ కు ఎలాంటి షాక్ ఇస్తుందో?

~శశిధర్ సంగరాజు